పన్ను వసూలులో కార్పొరేషన్ ఆల్‌టైమ్ రికార్డ్
- DV RAMANA
- Apr 1
- 1 min read
ఒక కమిషనర్, ఇద్దరు ఆర్‌ఐలతో సాధ్యమైన ఫీట్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఇంటిపన్ను, ఖాళీ స్థల పన్ను, కుళాయి నీటి పన్ను వసూళ్లలో 2024`25 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం కార్పొరేషన్ ఆల్‌టైమ్ రికార్డ్ సాధించింది. ఇప్పటి వరకు కార్పొరేషన్ చరిత్రలో లేనివిధంగా రూ.26.75 కోట్లు వసూలుచేసింది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో పాటు పన్ను వసూలుకు కూడా గడువు తీరిపోవడంతో సోమవారం అర్థరాత్రి వరకు వేసిన లెక్కల మేరకు రూ.26.75 కోట్లు వసూలు చేశారు. ఇదే కార్పొరేషన్‌లో గత ఏడాది.. అంటే 2023`24 ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్ల పన్నును వసూలు చేశారు. దీంతో పోలిస్తే ఈ ఏడాది రూ.6.50 కోట్లు ఎక్కువ వసూలైంది. గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో రూ.8.75 కోట్లు అధికంగా వసూలు చేశారు. ఒక్క మార్చి 31వ తేదీనే రూ.1.26 కోట్లు పన్నుల రూపంలో రాబట్టగలిగారు. ఓ పథకం ప్రకారం రూ.లక్ష దాటిన బకాయిలకు ఒకసారి డ్రైవ్, రూ.50వేలు లోపు బకాయిలుంటే మరోసారి డ్రైవ్ నిర్వహించి పకడ్బందీగా పన్నులు వసూలుచేశారు. మొండిబకాయిలు రాబట్టడం కోసం 120 షాపులకు తాళాలు వేయగా 300 కుళాయి కనెక్షన్లు కట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వడ్డీపై పన్ను రాయితీ ఇస్తుంది. ఈసారి 50 శాతం రాయితీ ఇవ్వడంతో దీన్ని వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అప్పటికీ చాలామందిలో కదలిక లేకపోవడంతో ఇళ్లకు తాళాలు వేయడం, షాపులు సీజ్ చేయడం వంటివి చేశారు. దీంతో బకాయిదారులు దిగివచ్చారు. 17 రెవెన్యూ వార్డులున్న శ్రీకాకుళం కార్పొరేషన్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరిని కోఆర్డినేట్ చేయడంలో కమిషనర్ దుర్గాప్రసాదరావు సఫలీకృతమయ్యారు. నగర పరిధిలో 90 శాతం పన్నులు వసూలుకాగా, మిగిలిన 10 శాతం భవనాలకు సంబంధించి కొన్ని కోర్టు కేసుల్లో ఉండగా, మరికొన్ని మురికివాడల్లో ఉన్నాయి. కార్పొరేషన్‌లో విలీనమైన పంచాయతీల్లో మాత్రం దాదాపు రూ.6కోట్లు బకాయిలు వసూలు కావాల్సి ఉన్నా గడువు ముగియడంతో వసూలు చేయలేకపోయారు. సచివాలయాల్లో సిబ్బంది లేకపోవడం, ఉన్నవారికి భవన యజమానులు ఎవరో తెలియకపోవడం వల్ల ఇక్కడ వసూలు మందగించింది. గత ఏడాది 23వేల మంది నుంచి పన్నులు వసూలుచేయగా, ఈసారి 35,800 మంది నుంచి బకాయిలు రాబట్టారు. కోర్టు కేసుల్లో ఉన్న కమర్షియల్ భవనాలకు సంబంధించి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే కార్పొరేషన్‌కు ఇప్పుడు వసూలుచేసిన దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది.
Comments