top of page

పనిలేదుకానీ.. ప్రయాణం ఆగదు!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Apr 13
  • 2 min read
  • పర్యవేక్షణ పేరుతో నిధులకు చక్రాలు

  • ప్రస్తుతం ప్రాజెక్టులో పనులు నిల్.. అద్దె బిల్లులు మాత్రం ఫుల్

  • ‘వంశధార’లో ఇంజినీర్ల మాయాజాలం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్ట్ (వంశధార)కు సంబంధించి పెద్దగా పనులు జరగడంలేదు. అయినా పనుల పర్యవేక్షణ కోసం తిరుగుతున్నామంటూ ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న డీఈ నుంచి ఎసఈ వరకు వాహనాల ఖర్చును ఎడాపెడా చూపిస్తున్నారు. ప్రస్తుతానికి టెక్కలి డివిజన్‌లో ఆఫ్‌షోర్ పనులు, నరసన్నపేటలో అరకొర పనులు మినహా బీఆరఆర్ ప్రాజెక్టులో ఎటువంటి పనులూ జరగకపోయినా, ఫీల్డ్‌విజిట్ పేరుతో ప్రభుత్వం ఎన్ని కిలోమీటర్లు తిరగడానికి ఎంత సొమ్మును బిల్లు చేసుకోవచ్చని వెసులుబాటు ఇచ్చిందో, అంతమేరకూ బిల్లులు పెట్టేస్తున్నారు. వాస్తవానికి డీఈలు పనుల పర్యవేక్షణ కోసం వాహనాలను వాడుకోవాలి. ఇందుకు ఏ స్థాయి అధికారికి ఎంత చెల్లిస్తారు? ఏ కారులో ఏ అధికారి ఎన్ని కిలోమీటర్లు తిరగవచ్చు అనే నిబంధన ఒకటి ప్రభుత్వం విధించింది. అంటే.. ఎక్కడైనా పనుల పర్యవేక్షణకు వెళ్లినప్ప్పుడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించామో లాగ్‌బుక్‌లో రాసుకొని, ఆ మేరకు బిల్లు పెట్టుకోవాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు మొత్తాన్ని కార్యాలయాల్లో కూర్చునే బీఆరఆర్ డీఈలు వాడేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఈ ప్రాజెక్టు ఎసఈ కూడా అతీతం కాదు. ఈయన విశాఖపట్నం క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఈఈగా పని చేస్తున్నారు. శ్రీకాకుళం బీఆరఆర్ ప్రాజెక్టుకు ఎసఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈఈగా విశాఖలో పని చేస్తున్నచోట ఆయనకు కారును అద్దెకు పెట్టుకునే వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. అందుకే శ్రీకాకుళం ఎసఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నందున ఇక్కడ వాహన సౌకర్యం ఇవ్వలేదు. కానీ టెక్కలి డీఈ పేరిట ఈయన వాహనానికి ఇక్కడ బిల్లు పెట్టుకుంటున్నారు. విశాఖపట్నంలో రెండు రోజులు, శ్రీకాకుళం కొత్తూరు వద్ద మదనాపురంలో ఉన్న ఆయన సేరీ వద్ద రెండు రోజులు గడిపేసి ఎంచక్కా రెండుచోట్లా వాహనానికి బిల్లులు పెట్టేసుకుంటున్నారని తెలుస్తుంది. విచిత్రమేమిటంటే.. జిల్లాలో బీఆరఆర్ ప్రాజెక్టు పేరిట ఏవైనా పనులు జరిగితే, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎసఈ రామచంద్రరావే. విచిత్రంగా ఆ పనుల్లో నాణ్యత ఉందో లేదో చూసే క్వాలిటీ కంట్రోల్ ఈఈ కూడా ఇదే రామచంద్రరావు. కాబట్టి పనుల్లో నాణ్యత ఎలా నిర్దారిస్తారో ఆయనకే తెలియాలి. గతంలో ఈయన గురువు డోల తిరుమలరావు కూడా ఇలాగే క్వాలిటీ కంట్రోల్ ఈఈగాను, బీఆరఆర్ ఎసఈగాను పని చేశారు. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బదిలీపై వెళ్లిపోతే, స్వర్ణకుమార్‌ను ఇక్కడకు తీసుకొచ్చారు. ఇప్ప్పుడాయన నార్త్‌కోస్ట్ సీఈ అయిపోవడంతో తిరుమలరావు శిష్యుడు రామచంద్రరావు ఆయనలాగే జోడుపదవులతో ఇక్కడ కొనసాగుతున్నారు. జిల్లాలో ఆమదాలవలసలో రెండు, హిరమండలంలో ఒకటి, టెక్కలిలో ఒకటి, నరసన్నపేటలో ఒకటి చొప్ప్పున బీఆరఆర్‌కు డివిజన్లు ఉన్నాయి. ఇందులో టెక్కలి డివిజన్‌కు డీఈ లేకపోవడంతో ఆయన వాహనాన్ని ఎసఈ రామచంద్రరావు వాడుతున్నారు. ఎసఈకి ఎర్టిగా వేహికల్ ఇచ్చి 2500 కిలోమీటర్లు తిరగవచ్చని, ఇందుకోసం రూ.45 వేలకు బిల్లు పెట్టుకోవచ్చని ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఈయన డీఈ పేరిట మంజూరైన వాహనాన్ని వాడుతుండటం వల్ల ఇదే కిలోమీటర్లకు రూ.35వేలకు మాత్రమే బిల్లు పెట్టుకోవాలి. ఈమేరకు ఫీల్డ్ విజిట్ చేసినా, చేయకపోయినా వేహికల్ బిల్లు మాత్రం అందరూ పెట్టేస్తున్నారు. పూర్తిగా ప్రతీనెల 2,500 కిలోమీటర్లు తిరిగామంటే డౌటొస్తుందని అప్ప్పుడప్ప్పుడు లాగ్‌బుక్ రాసినట్లు, అందులో కిలోమీటర్లు తగ్గినట్లు చూపిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో బీఆరఆర్‌కు సంబంధించి ఒక్క పనీ జరగడంలేదు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అంపోలు వద్ద వంశధార ప్రధాన కుడికాలువలో ఓ రెండు నెలలు నీరుంటుంది. మహా అయితే ఆ సమయంలో సంబంధిత డీఈ ఒకటి రెండుసార్లు విజిట్ చేస్తారు. అలాగే ఆఫ్‌షోర్ పనులు కూడా అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ఇక్కడికి కూడా ఒకటి రెండుసార్లు ఎసఈ విజిట్ చేసివుండవచ్చు. కానీ అన్ని డివిజన్లలోని వేహికల్‌పేరుతో బిల్లు పెట్టి నిధులు వచ్చిన వెంటనే ఒక్కసారిగా విత్‌డ్రా చేస్తున్నారు. ఇక్కడ పనులు లేక చాలామంది రెండేసి విధులు తమ వద్ద ఉంచుకున్నారు. నరసన్నపేట ఈఈగా పని చేస్తున్న మురళీమోహనరావు వాస్తవానికి డీఈ. ఆయన శ్రీకాకుళం నెంబరు 4 సబ్‌డివిజన్‌లో ఉంటూ, ఆమదాలవలస ఒకటో నెంబరు యూనిట్ కంట్రోల్‌లో ఉన్నారు. అలాగే హిరమండలం ఈఈ బోర రవీంద్ర జంఝావతి ప్రాజెక్టుకు డీఈగా ఉన్నారు. ఇలా చెప్ప్పుకుంటూపోతే కేవలం కొందరు మాత్రమే ఒక పోస్టులో ఇక్కడ పని చేస్తున్నారు. మిగిలినవారందరూ ఒకచోట డీఈగాను, మరోచోట ఇన్‌ఛార్జి ఈఈగాను విధులు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే.. ఈఈగా, డీఈగా రెండు వాహన బిల్లులు పెట్టుకునే వెసులుబాటు కూడా ఇందులో కొందరికి ఉంది. డివిజన్ స్థాయిలో ఒక వాహనానికి నెలకు రూ.35వేలంటే ఏడాదికి రూ.4.20 లక్షలు. ఇందులో ఎంత తిరిగినా ఇంత ఖర్చవడం సాధ్యంకాదు. అలాగే ఈఈలు, డీఈలు ఏదో ఒక పేరు మీద బిల్లులు పుట్టిస్తున్నారు తప్ప, చాలామంది సొంత వాహనాలనే పెట్టుకొని సొంత డ్రైవర్లను మెయింటైన్ చేస్తూ తిరగకుండానే ఈ సొమ్ములు విత్‌డ్రా చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం నేరడి, కొత్తూరు వంటి ప్రాంతాల్లో ఎటువంటి పనులూ ప్రారంభం కాలేదు. కానీ డీఈలు, ఎసఈలు, ఈఈలు మొత్తం 22 వాహనాలు అద్దెకు తీసుకొని ప్రతీనెల తిరుగుతున్నట్టు లెక్కలు చూపించడమే విడ్డూరం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page