జనసేన నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకోబోనంటూ హెచ్చరికలు జారీ చేశారు. అన్ని మతాలను సమానంగా చూసేదే సనాతన ధర్మం అంటూ ఒకవైపు చెబుతూనే మరోవైపు చర్చి, మసీదులపై విషం కక్కారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర మతాల పట్ల అసహనమే సనాతన ధర్మం అయితే అది రాజ్యాంగ విరుద్ధం. లౌకికతత్వాన్ని పరిరక్షిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ రాజ్యాంగాన్నే సవాలు చేస్తున్నారు. ఇంత వరకు ఆయన నిర్దిష్టంగా సనాతన ధర్మం అంటే ఇదీ అని చెప్పలేదు. పైగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన తరపున ‘నరసింహ వారాహి దళా’న్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దళాలు ఏం చేస్తాయో కూడా స్పష్టం చేయలేదు. సనాతన ధర్మం అంటే పరమత సహనమా? పరమత ద్వేషమా? సహనమే ఆయన భావం అయితే అంతగా అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. భారతదేశ చరిత్రలో పరమత సహనం, అసహనం రెండూ ఘర్షణ పడుతూనే వస్తున్నాయి. బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటంలో మత సామరస్యం రూపుదిద్దుకుంది. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు కలిసి బ్రిటిష్ పాలకులను ఎదుర్కొని ప్రాణాలర్పించారు. రaాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, బహదూర్ షా, మంగళ్ పాండే, బేగం హజరత్ మహల్, కున్వర్‌సింగ్ లాంటి అనేకమంది ఈ పోరాటంలో అసువులు బాసినవారే. 1905 బెంగాల్ విభజన సమయంలో హిందూ ముస్లింలు ఐక్యమై బ్రిటిష్ కుట్రలను ఓడిరచి ఐక్య బెంగాల్‌ను కాపాడుకున్నారు. బ్రిటిష్ పాలకులు మత ఘర్షణలు పెట్టి స్వాతంత్య్రోద్యమాన్ని దెబ్బ తీయాలని చూశారు. మొన్నటి దాకా చేగువేరా బొమ్మ పెట్టుకొని యువతను ఆకర్షించి ఇప్పుడు ఆ చేగువేరా బొమ్మను పక్కన పడేసి మోడీ బొమ్మ తగిలించుకొని హఠాత్తుగా అవతారం మార్చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు చేయలేని పనిని రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ద్వారా చేయిస్తున్నారు. ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నది. తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టి తమ ఆధిపత్యాన్ని సాధించడానికి బిజెపి పవన్ కళ్యాణ్‌ను ముందు పెట్టి బీ టీమ్‌గా మార్చుకుంటున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగటాన్ని ఖండిస్తూ మహారాష్ట్ర ఎన్నికల సభలో గళమెత్తారు. కానీ మణిపూర్ మండిపోతున్న విషయాన్ని మాత్రం విస్మరించారు. మతోన్మాదం ఏ పేరుతో ఉన్నా ప్రమాదమే బంగ్లాదేశ్‌లో మతోన్మాదానికి హిందువులే కాదు ముస్లింలు కూడా బలవుతున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను వెనకేసుకొస్తూ అన్ని మతాలను ఆయన ఎలా సమానంగా గౌరవించగలరు? గత కొద్దిరోజులుగా మణిపూర్ తిరిగి భగ్గుమంటు న్నది. రెండు ఆదివాసీ తెగల మధ్య మతం పేరుతో కుంపటి రాజుకుంది. అది ఇప్పుడు పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు అనే తేడా లేకుండా మనుషులందరినీ బలిగొంటోంది. ఏడాదిన్నరగా మణిపూర్ లో మానవత్వం మంట గలుస్తున్నా మోడీ నోరు మెదపడం లేదు. కనీసం ఆ రాష్ట్ర ప్రజలను ఓదార్చడానికి సందర్శించనూ లేదు. ఇదేనా పవన్ కళ్యాణ్ దృష్టిలో మానవత్వమంటే? మణిపూర్ కోసం మోడీని నిలదీయగలరా? సనాతన ధర్మం పేరుతో ఇలాంటి మారణకాండను, అకృత్యాలను పవన్ కళ్యాణ్ ఎలా సమర్థించగలరు? మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడమే గాకుండా ఆంధ్రప్రదేశ్‌ను హస్తగతం చేసుకోవాలని నానారకాల వ్యూహాలు పన్నుతున్నది. అందులో పవన్ కళ్యాణ్ ఒక పావు మాత్రమే. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నది. టీటీడీ లడ్డు వివాదం సందర్భంలో సంబంధం లేకపోయినా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నేరుగా రిపోర్టులు తెప్పించుకోవడం ఇందులో భాగమే. తిరుమలపై రాజకీయ ప్రకటనలు అనుమతించబోమని చెప్పిన బోర్డు అదే రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మ కాకూడదు. అయోధ్యలో అడ్రస్ లేకుండా పోయిన బిజెపి టిటిడిని ఎలాగైనా తన కబంధ హస్తాల్లో బంధించాలని రంగంలోకి దిగింది. వారి చేతిలో టిటిడి బోర్డు తురుపు ముక్క కాకూడదు.
top of page
bottom of page
Comments