top of page

పర్యావరణం పాతమాట.. ఇసుక తవ్వకాల్లో అందరికీ వాటా

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • అనుమతులు లేని ర్యాంపు నుంచి రవాణా

  • వైకాపా నాయకులదే పెద్ద వాటా

  • స్టాక్‌పాయింట్‌ ఏర్పాటుచేసినా పట్టించుకోని యంత్రాంగం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం రూరల్‌)

శ్రీకాకుళం రూరల్‌ మండలం బైరి గ్రామం వద్ద ఇసుక తవ్వకాలకు పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చేలోపు ఇక్కడ నదిలో ఇసుక మొత్తం ఖాళీ అయిపోయేటట్టు కనిపిస్తుంది. ఉచిత ఇసుక అన్నది కేవలం అనుమతులు పొందిన ర్యాంపు నుంచే కాని, అనుమతులు లేనిచోట కాదనే విషయం ఎవరికీ పట్టడంలేదు. బైరి ర్యాంపులో ఏ ఇసుకను తవ్వితే పర్యావరణానికి ముప్పు అని అనుమతులు ఇవ్వడానికి వెనుకాడుతున్నారో, ఇప్పుడు అదే ఇసుకను అనధికారికంగా తవ్వుకుపోతున్నారు. స్థానికంగా ఉన్న ట్రాక్టర్లతో ఇసుకను ఎత్తి దగ్గరలో ఉన్న ఓ చోట స్టాక్‌పాయింట్‌గా ఏర్పాటుచేసి, ఆ తర్వాత ఎంచక్కా విశాఖపట్నానికి అమ్మేస్తున్నారు.

బైరి వద్దే ఉన్న నీలిమ వేయింగ్‌ బ్రిడ్జి వద్ద స్టాక్‌ను ఏర్పాటుచేసి, అక్కడి నుంచి తరలిస్తున్నారు. వాస్తవానికి వేయింగ్‌ బ్రిడ్జిల వద్ద ఎటువంటి స్టాకు ఉండకూడదు. ఆ మాటకొస్తే అసలు ఈ వేయింగ్‌ బ్రిడ్జికి అనుమతులే లేవు. అయినా బ్రిడ్జి వద్దకు బరువు తూయడానికి వచ్చిన ఇసుక లారీలకు సంబంధించినదంటూ మభ్యపెట్టి ప్రొక్లెయినర్లతో లారీలకు లోడ్‌ చేస్తున్నారు.

ఒడ్డుకు చేర్చిన ఇసుకను ట్రాక్టర్‌కు రూ.700, లారీకి రూ.9వేలకు విక్రయిస్తున్నారు. బైరిలో ఇసుక ర్యాంపునకు అనుమతులు ఇవ్వడానికి ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ లేదు. దీంతో ఇక్కడ అధికారికంగా ఇసుక ర్యాంపు ఏర్పాటుచేసి స్టాక్‌ పాయింట్‌ పెట్టాలని అధికారులు రెండు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని వైకాపా హయాంలో ఇసుక మాఫియాను నడిపించిన నక్క గణేష్‌ తన సొంత ట్రాక్టర్లతో ఇసుకను నీలిమ వేబ్రిడ్జ్‌ వద్ద స్టాక్‌ చేయించి, అక్కడి నుంచి లారీ, ట్రాక్టర్లకు లోడ్‌ చేయిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. నీలిమ వే బ్రిడ్జ్‌ యజమాని నక్క జగదీష్‌తో జత కలిసి నక్క గణేష్‌ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీరితో పాటు బైరిలో ఉన్న టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేస్తునే ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ఆసరాగా చేసుకొని సొంత అవసరాల నిమిత్తం ఇసుక తరలిస్తున్నట్టు చూపించి ఇసుకను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇసుకను బైరి వద్ద నదిలో బాటలు వేసి ట్రాక్టర్లకు జేసీబీలతో లోడ్‌ చేసి ఒడ్డుకు చేరుస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు సెమీ మెకానిజంను వినియోగించడానికి వెసులుబాటు కల్పించడంతో అక్రమార్కులు అనుమతి లేనిచోట జేసీబీలను నదుల్లో దించి వాహనాలకు లోడ్‌ చేస్తున్నారు.

నదిలో వరదలు వచ్చిన సమయంలోనూ బైరిలో ఇసుక అక్రమ తవ్వకాలు నిలుపుదల చేయకుండా ఇసుకను ఒడ్డుకు చేర్చారు. ఇసుకను ఒడ్డుకు చేర్చడం కోసం ప్రొక్లెయినర్స్‌తో నది గట్టులను తొలిచి బాటలు వేశారు. దీన్ని ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత లారీల్లో విశాఖకు తలరించుకుపోవడానికి ఒక మార్గంగా అక్రమార్కులు ఎంచుకున్నారు. ఈ ప్రాంతాల్లోనే స్టాక్‌ పాయింట్లు ఏర్పాటుచేసి రాత్రి పగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. బైరిలో ఇసుక పరిమితికి మించి తవ్వేశారు. మడపాం జాతీయ రహదారి వంతెన కింద ఇసుకను జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నా అధికారులు స్పందించడం లేదు. వంతెనకు 500 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వడానికి వీల్లేదు. ఈ నిబంధనకు తూట్లు పొడుస్తూ అక్రమార్కులు తవ్వుకుపోతున్నారు. ఇసుకను అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న వారిలో నక్క గణేష్‌తో పాటు పట్నాల కృష్ణ తదితరులు ఉన్నారు. డిమాండ్‌ తగ్గినా గతంలో ఉన్న పాత పరిచయాలతో నక్క గణేష్‌ లారీల యజమానులతో మాట్లాడి ఇసుకను విశాఖకు అక్రమంగా తరించుకుపోతున్నాడు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ర్యాంపుల్లో 20 టన్నుల లారీకి ఇసుకను అనధికారికంగా లోడ్‌ చేయడానికి రూ.12వేలు వసూలు చేస్తున్నారు. నక్క గణేష్‌ దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి తన చిన్నాన్న నక్క జగదీష్‌కు చెందిన నీలిమ వేబ్రిడ్జ్‌ను వేదికగా చేసుకొని ఇసుకను స్టాక్‌ పాయింట్‌గా మార్చేశాడు. జాతీయ రహదారికి ఆనుకొని ఉండడం, ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ర్యాంపుల నుంచి ప్రభుత్వ నిర్మాణాలకు వెళుతున్న ఇసుక వాహనాలు వేబ్రిడ్జ్‌కు వస్తుండడంతో దీన్ని అవకాశంగా మార్చుకున్నాడు. వేబ్రిడ్జ్‌ వద్ద ఒక ట్రాక్టర్‌ ఇసుకను రూ.700కు లోడ్‌ చేస్తుండడంతో దీన్ని సమీప ప్రాంతాలకు తరలించి విక్రయిస్తే దూరాన్ని బట్టి రూ.1200 నుంచి రూ.2600 వరకు పలుకుతుంది. లారీ రూ.9వేలకు లోడ్‌ చేస్తే, దీన్ని విశాఖకు తరలిస్తే రూ.25వేల నుంచి రూ.30వేలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. దీంతో నక్క గణేష్‌ పాతపరిచయాలను ఉపయోగించి కొత్తగా ఆలోచన చేసి నీలిమ వేబ్రిడ్జ్‌లోనే స్టాక్‌పాయింట్‌ పెట్టి దర్జాగా ఇసుక వ్యాపారం చేసుకుంటున్నాడు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page