top of page

పలుచబడుతున్న సమాఖ్య స్ఫూర్తి

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Feb 24
  • 2 min read

మనది ఫెడరల్ రాజ్యం.. అంటే సమాఖ్య వ్యవస్థ. అంటే భారతదేశం అనేక రాష్ట్రాల కూటమి అని.. రాష్ట్రాలు తమ పరిధిలో పనిచేస్తూనే.. జాతీయస్థాయిలో కేంద్ర, రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నది సమాఖ్య వ్యవస్థలో కీలక సూత్రం. కానీ ఈ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర`రాష్ట్ర సంబంధాలు తరచూ వివాదాస్పదం అవుతుండటం కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా జాతీయస్థాయిలో ఈ అంశం చర్చల్లో నలుగుతూనే ఉంది. సర్కారియా వంటి అనేక కమిషన్లు కొల్లలుగా సిఫార్సులు చేశాయి. సుప్రీంకోర్టు స్థాయిలో ఎన్నో న్యాయ సంవాదాలు జరిగాయి.. తీర్పులు వెలువడ్డాయి. కానీ అవేవీ ఈ వివాదానికి చరమగీతం పాడలేకపోయాయి. నివురుగప్పిన నిప్పులా ఉంటూ సందు దొరికనప్పుడల్లా రాజుకుంటున్న కేంద్ర-రాష్ట్ర సంబంధాలు అనే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసఫ్ నేతత్వంలో నియమించిన త్రిసభ్య కమిటీ రూపొందించిన నివేదిక కొన్ని దశాబ్దాలుగా అధికారం కేంద్రీకృతమవుతున్న తీరును తద్వారా సమాఖ్య భావన బలహీనపడుతుండటాన్ని కీలకంగా ప్రస్తావించింది. ముఖ్యంగా రాష్ట్రాల అధికారాన్ని బలహీనపరిచే ఇటీవలి పాలనా ధోరణులను తప్పుపట్టింది. దేశంలో అధికారాల కేంద్రీకరణ పెరుగుతోందని, ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదని హెచ్చరిస్తూ తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. భారతీయ సమాఖ్య వ్యవస్థకు 1991 ఆర్థిక సంస్కరణల స్థాయిలో ఒక నిర్మాణాత్మక మార్పు అవసరమని నొక్కి చెప్పింది. దేశ విభజన, సంస్థానాల విలీనం వంటి గత అనుభవాలను దష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు కేంద్రానికి కాస్త ఎక్కువ అధికారాలు దఖలుపరిచారు. తర్వాత కాలంలో శాసన, పరిపాలన, న్యాయపరమైన చర్యలు ఈ ఆలోచన ధోరణిని మరింత బలోపేతం చేశాయి. అయితే కేంద్రీకరణకు మద్దతు పలికే వాదనలను తాజా నివేదిక పూర్తిగా తోసిపుచ్చింది. భారత్ వంటి విశాలమైన , వైవిధ్యభరితమైన దేశంలో సమాఖ్య వ్యవస్థను విస్మరించడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఇందుకు దారితీస్తున్న పలు అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రాల భౌగోళిక ఉనికి కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండటం దురదష్టకరమని పేర్కొంటూ.. 2019లో జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడమే దీనికి నిదర్శనమని ప్రస్తావించింది. దేశానికి ఒకే జాతీయ భాష అవసరమనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వ్యాప్తిచేయడం కూడా తప్పుడు చర్యగా పేర్కొంది. రాష్ట్రాల పాలనలో కేంద్రం అనుచిత జోక్యానికి గవర్నర్లు సాధనాలుగా మారడం మరో తప్పిదం. త్వరలో జనాభా దామాషా పద్ధతిలో చేపట్టనున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జనాభాను బాగా నియంత్రిస్తున్న రాష్ట్రాలకు ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల జాతీయ పాలనలో ఆ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉంది. ఎన్నికల నిర్వహణ అధికారాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాలు కూడా క్రమంగా కేంద్రీకృతం అవుతున్నాయి. అధికారం ఒకేచోట కేంద్రీకృతం కావడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఈ నివేదిక గట్టిగా హెచ్చరించింది. భిన్నత్వంతో కూడిన మన దేశంలో స్థానిక సమస్యలు, అవసరాలు ఎక్కడో ఉన్న ఢిల్లీ నుంచి కాకుండా ఆయా రాష్ట్రాల పరిధిలోనే పరిష్కారానికి నోచుకోవాలని నివేదిక సూచించింది. ఆర్థిక సమాఖ్య వ్యవస్థ, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల స్వయంప్రతిపత్తి దెబ్బతిన్నదని నివేదిక పేర్కొంది. దీనివల్ల రాష్ట్రాలకు సొంతంగా పన్ను వసూలు అధికారం తగ్గిపోయింది. ఫలితంగా రాష్ట్రాలకు రావలసిన వాటా కోసం కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోంది, ఇది అభివృద్ధి పనులకు అవరోధంగా మారుతున్నదని నివేదిక ఎత్తిచూపింది. అందువల్ల ఆర్థిక వనరుల పంపిణీలో రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం ఉండాలని కమిటీ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాల విధులు, అధికారాల్లో గవర్నర్ల జోక్యం పెరగడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టసభలు ఆమోదించిన బిల్లులను నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడం ద్వారా గవర్నర్లు సమాంతర ప్రభుత్వాలను నడుపుతున్నారని విమర్శించింది. ఇటువంటి చర్య చట్టసభల ప్రతినిధులను ఎన్నుకున్న ప్రజల ఓటుహక్కును అవమానపరచడంగానే పరిగణించాల్సి ఉంటుంది. అందువల్ల గవర్నర్ల నియామకం, వారి అధికారాలపై స్పష్టమైన నిబంధనలు ఉండాలని పేర్కొంది. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రకారం విద్య, ఆరోగ్య రంగాలు ఉమ్మడి జాబితాలో.. అంటే కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో కేంద్రమే పెత్తనం చెలాయిస్తోంది. ‘నీట’ వంటి పరీక్షలు, జాతీయ విద్యావిధానం వంటివి కేంద్ర ఆధిపత్యాన్ని ప్రస్ఫుటం చేస్తూ రాష్ట్రాల ప్రత్యేక అవసరాలను, అధికారాలను దెబ్బతీస్తున్నాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన విషయానికొస్తే.. దేశంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా వద్ధిరేటు తగ్గింది. భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తే జనాభా వద్ధిరేటు ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఏర్పడి జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల ప్రాభవం తగ్గుతుంది. కేంద్ర పాలనతోపాటు వనరుల పంపిణీల్లో వీటి వాటా తగ్గిపోతుంది. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని, అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్రాలను శిక్షించినట్లు అవుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదిక ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైనది కాదు. భారతదేశం ‘రాష్ట్రాల కలయిక’గా కొనసాగడానికి మార్గదర్శి కాగలదు. 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టి బలపడినట్లే.. ఇప్పుడు సమాఖ్య వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరముందని జస్టిస్ కురియన్ జోసఫ్ నేతత్వంలోని కమిటీ సూచించింది. అయితే తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ చేసిన సూచనలను కేంద్రం పట్టించుకుంటుందా?.. అనుమానమే!


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page