నిలిచిపోయిన రూ.94 కోట్ల బిల్లులు
ప్రతివారం చెల్లింపులు అటకెక్కాయి
గుంతలు పూడ్చిన నిధులూ విడుదల కాలేదు
లబోదిబోమంటున్న ‘దేశం’ నేతలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పల్లెపండుగ పనులకు బిల్లులు చెల్లింపులో జాప్యం కారణంగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పనులు చేస్తున్న కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు, కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. 2024 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కేవలం రూ.30 కోట్లు జమ చేసి ప్రభుత్వ చేతులు దులుపుకుంది. మూడు నెలలుగా మరో రూ.94 కోట్లు చెల్లింపులు నిలిచిపోయాయి.
జిల్లాలో మొదటి విడతగా రూ.526 కోట్లతో 4,070 పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. చేపట్టిన పనులకు ప్రతి గురువారం బిల్లుల చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో గ్రామాల్లో కూటమి పార్టీల నేతలు, కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి శరవేగంగా పనులు చేపట్టారు. చేసిన పనులకు మండలాల వారీగా ఉపాధి హమీ పధకం ఏపీవోలు వారం వారం బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నారు. మొదటిసారి అక్టోబర్ 14న పనులు ప్రారంభిస్తే డిసెంబర్ 13న బిల్లులు జమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బిల్లులు జమ కాలేదు. పనులు పూర్తిచేసి సుమారు మూడు నెలలు కావస్తున్నా బిల్లులు చెల్లింపులు లేకపోవడంతో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు డీలా పడిపోయారు. అధికారులు దగ్గరుండి సిమెంట్, బీటీ రోడ్డు, పాఠశాల ప్రహారీల నిర్మాణం పనులు చేయించినా బిల్లులు చెల్లింపులో జాప్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యుత్సాహంతో కాంట్రాక్టర్లు (వెండర్లు)గా బరిలోకి దిగిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.
మూడు నెలలైనా చెల్లింపులు నిల్
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం ద్వారా జనరేట్ అయ్యే కాంపొనెంట్ నిధులతో ప్రభుత్వం గ్రామాల్లో పల్లెపండగ పేరుతో గత ఏడాది అక్టోబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమానికి ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. పల్లె పండుగలో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి పెద్ద ఎత్తున సిమెంట్, బీటీ రోడ్లు, మురుగు కాలవలు నిర్మాణానికి చర్యలు తీసుకుంది. వీటి నిర్మాణానికి మెటిరియల్ కాంపొనెంట్ నిధులు వెచ్చించడంతో డ్వామా పర్యవేక్షణలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ట్రైబల్ వెల్ఫేర్, సమగ్రశిక్ష పరిధిలో పనులు చేపడుతున్నారు. పనులు చేయించే బాధ్యత ఆయా శాఖలకే అప్పగించి, బిల్లులు అప్‌లోడ్ చేసే బాధ్యత డ్వామాకు కట్టబెట్టారు. పల్లెపండగ కార్యక్రమం ప్రారంభించిన సమయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి గురువారం బిల్లుల జమ చేస్తామని ప్రకటించారు. పవన్‌కళ్యాణ్ ప్రకటనతో రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి పనులు చేసి రోడ్డున పడిపోయామని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024 అక్టోబర్‌లో పూర్తిచేసిన పనులకు బిల్లులు చెల్లించిన ప్రభుత్వం నవంబర్‌లో వేసిన రోడ్లకు మూడు నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. అధికారులు పనులు చేయాలని ఒత్తిడి చేసి నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నారు. బిల్లులు జమ చేయకుండా పనులు చేయాలని ఒత్తిడి చేయడంపైనా కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు గుర్రుగా ఉన్నారు. పనులు చేసిన వెంటనే క్వాలిటీ అధికార్ల బృందం తనిఖీలు చేస్తే, డ్వామా ఏపీవోలు బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో పెట్టుబడి పెట్టించి పశువుల షెడ్డులు, ఇంకుడు గుంతలు తవ్విస్తున్నారు. వీటికి బిల్లుల చెల్లింపు జరగడం లేదు. డ్వామా సిబ్బందికి టార్గెట్‌లు ఇచ్చి పనులు చేయిస్తున్నా, బిల్లులు జమ కాకపోవడంతో కూటమి కార్యకర్తలు, నాయకులు, గ్రామీణ ప్రాంతాల రైతులు నైరాశ్యంలో ఉన్నారు.
దేశంలో నరసన్నపేట రికార్డు

ఏడాది అక్టోబరు 14న పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ, బీటీ రోడ్లు, కాలువల నిర్మాణాలకు మొదటి విడతలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 4,070 పనులు గుర్తించారు. నాబార్డు, పీఎంజీఎస్‌వై, ఏపీఆర్‌ఆర్‌పీ ద్వారా మంజూరు కావాల్సిన బీటీ రోడ్డు పనులను ఉపాధి కాంపొనెంట్ నిధులతో నిర్మించడం దేశంలో మొదటిసారి. ఒక బీటీ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.కోటికి పైగానే ఖర్చు ఉంటుంది. వీటిని పల్లెపండుగ కార్యక్రమంలో నిర్మించడం వల్ల గ్రామీణ రవాణా వ్యవస్థ మెరుగుపడిరదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. జిల్లాలో మిగతా నియోజక వర్గాలతో పోల్చితే నరసన్నపేటలో కేవలం 20 బీటీ రోడ్లను రూ.28 కోట్లతో పూర్తి చేశారు. మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కేవలం సీసీ రోడ్లు నిర్మాణంపైను దృష్టి సారించారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చొరవతో తక్కువ వ్యవధిలో 3 నుంచి 7 కిలోమీటర్లు పొడవుతో 20 బీటీ రోడ్లు పూర్తి చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలసలో సీసీ రోడ్డు తప్ప బీటీ రోడ్ల నిర్మాణం చేయలేదని అధికారులు చెబుతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో సీసీ రోడ్డులు, కాలువలు నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పనులు చేయిస్తున్నారు.
పనులు పూర్తి చేసినా..
జిల్లా 4,070 పనులకు ఇప్పటి వరకు 3,896 పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 2,089 పూర్తయ్యాయి. వీటి కోసం రూ.123.87 కోట్లు బిల్లు జనరేట్ చేయగా, 2024 డిసెంబర్ 13 నాటికి రూ.30 కోట్లు జమైంది. మూడు నెలలుగా మిగతా డబ్బులు రిలీజ్ కాలేదు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 1419 పశువుల షెడ్లుకు 996 పూర్తి అయ్యాయి. ఈ షెడ్లు మూడు కేటగిరీలుగా రూ.1.30 లక్షలు, రూ.1.80లక్షలు, రూ.2.30లక్షలుగా విభóజించి నిర్మాణాలు పూర్తిచేసినా రైతులకు నగదు జమ కాలేదు. వీటితో పాటు రూ.6 వేలు వ్యయంతో జిల్లా వ్యాప్తంగా 5,547 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని నిర్ధేశించగా, అందులో 3,510 పూర్తి చేశారు. వీటి బిల్లుల పరిస్థితీ అంతే. దీంతో మిగిలిన పశువుల షెడ్లు నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతోపాటు ఈ ఏడాది జనవరిలో సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటనలో రాష్ట్రవ్యాప్తంగా రూ.800 కోట్లు వెచ్చించి రోడ్డు ప్యాచ్‌వర్క్ పనులు ప్రారంభించారు. ఈ పనులకు సింగిల్ పేమెంట్‌లో బిల్లులు చెల్లిస్తామని ప్రకటించి పనులు చేసినా బిల్లులు చెల్లింపులు జరగడం లేదు. దీంతో పనులు చేసిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు.
జీఎస్టీ భారం
పల్లెపండుగ పేరుతో చేస్తున్న పనులకు చెల్లించే బిల్లులకు 18 శాతం జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. రూ.లక్ష బిల్లుకు రూ.18వేలు కట్ చేస్తున్నారు. జీఎస్టీ బిల్లు ఉంటే మినహాయిస్తామని అధికారులు చెబుతున్నారు. పల్లె పండుగ పనులు చేస్తున్నవారంతా కూటమి నాయకులు, కార్యకర్తలు కావడంతో జీఎస్టీ వసూలు భారం అవుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సీసీ రోడ్డుకు వినియోగించే సిమెంట్‌కు మినహాయించి మిగతా మెటీరియల్‌కు బిల్లులు ఇచ్చే సంస్కృతి ఎక్కడా లేదు. సీసీ రోడ్డులు నిర్మాణ కాంట్రాక్టర్లుగా పార్టీల కార్యకర్తలు, నాయకులు వ్యవహరిస్తున్నారు. బీటీ రోడ్డులు నిర్మాణంకు రూ.కోట్లులో ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబటి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే లైసెన్స్ కాంట్రాక్టర్లు రంగంలో ఉన్నారు. వీరు లైసెన్స్ కలిగిన కాంట్రాక్టర్లు కావడం వల్ల వీరి నుంచి ప్రభుత్వం రూ.5 శాతం జీఎస్టీ వసూలుచేస్తుంది. దీంతో పల్లె పండగ పనులకు జీఎస్టీ నుంచి మినహాయించాలని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.
Comments