top of page

పలాసలో రివర్స్‌ రాజకీయం!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • `నాడు మంత్రిగా అప్పలరాజు దుందుడుకుతనం

  • `ఇప్పుడు ఆయన బాటలోనే పచ్చ నేతల కక్షసాధింపులు

  • `నాడు టీడీపీ సానుభూతిపరులకు పథకాలు నిలిపివేత

  • `నేడు వైకాపావారికి అవే చేదు అనుభవాలు

  • `అంతా సీదిరివారి పాపాల ఫలితమేనని నియోజకవర్గంలో చర్చ

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అనుకున్నా.. చేసిన పాపాలను దేవుడు వదిలేసినా కాలం, కర్మ మాత్రం వెంటాడి మరీ బదులిచ్చేస్తాయని భావించినా ఒకటే అర్థం. పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం తరఫున పని చేస్తున్నవారిని ఎలా తొక్కేశారో.. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రీతిలో వ్యవహరిస్తూ వైకాపావారిని అణిచేస్తున్నారు. ఈ వ్యవహారాల్లో తప్పొప్పులు ఎంచడమంటే గొంగట్లో భోంచేస్తూ వెంట్రుకలు ఏరుకున్నట్లే! ఎన్నికల వరకే రాజకీయాలు కానీ.. ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో భాగస్వాములమన్న విషయాన్ని మర్చిపోయి వ్యవహరించడం వల్ల చర్యకు ప్రతిచర్యలు, కక్ష తీర్చుకునే ధోరణి కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కక్షసాధింపులు ఉండవని పవన్‌కల్యాణ్‌ చెప్పినా స్థానిక నాయకులు మాత్రం ఐదేళ్లు తీవ్ర అణచివేతకు గురైన తర్వాత బదులు తీర్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇందుకు పలాసలో జరుగుతున్న తాజా ఘటనలే అద్దం పడుతున్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

` ఈ ఏడాది జనవరిలో పలాస మండలం గరుడఖండిలో ఏడు కుటుంబాలు గౌతు శిరీష సమక్షంలో టీడీపీలో చేరాయి. ఆ తర్వాత నెల ఆ కుటుంబాల్లోని లబ్ధిదారులకు వైఎస్సార్‌ భరోసా పెన్షన్లు, మరో నలుగురు మహిళలకు వైఎస్సార్‌ చేయూత నిలిపివేశారు. దీనిపై గౌతు శిరీష స్థానిక ఎంపీడీవోకు, స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా వాటిని పునరుద్ధరించలేదు. మంత్రి సీదిరి నుంచి ఒత్తిడి ఉందని, పెన్షన్లు పునరుద్ధరించలేమని అధికారులు చేతులెత్తేశారు. కట్‌ చేస్తే.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైకాపా చేసిన మాదిరిగానే టీడీపీ నేతలు పలాస మండలం పెదంచలలో 20 మందికి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు ఆపేశారు. బాధితులు ఆందోళన చేయడం, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పెద్ద రచ్చ జరగడంతో కలెక్టర్‌ ఆదేశాలతో ఆ 20 మందికి పింఛన్లు పంపిణీ చేశారు.

` 24వ వార్డులో మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు భార్యపై పోటీ చేసి గెలిచిన అమ్మాజమ్మ కుమారుడు నవీన్‌ ముగ్గురి పింఛన్లను స్థానిక సచివాలయ అడ్మిన్‌ను బెదిరించి నిలిపివేయించారని ఆరోపణ ఉంది. దీనిపై చైర్మన్‌ గిరిబాబుకు బాధితుల కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయడంతో అడ్మిన్‌ కార్యదర్శిని సంపద్రించగా రెండు పింఛన్లను పంపిణీ చేసినా వృద్ధుడైన తిరునగిరి కురత్తల్వార్‌ స్వామీజీకి నిలుపుదల చేశారు. దీంతో గిరిబాబు తన సోదరుడు ఆనంద్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సచివాలయానికి వెళ్లి అడ్మిన్‌ కోసం వాకబు చేయగా 24వ వార్డు కౌన్సిలర్‌ ఇంటిలో ఉన్నారని సిబ్బంది చెప్పారు. దీంతో వార్డు కౌన్సిలర్‌ ఇంటి వద్దకు చేరుకొని పురుషోత్తపురం సచివాలయం అడ్మిన్‌కు వేరొకరితో కబురు పంపించారు. నవీన్‌ బయటకు వచ్చి పింఛన్‌ తానే ఇవ్వొద్దని చెప్పానని, స్వామీజీకి పింఛన్‌ ఇవ్వడం కుదరదని చెప్పడంతో చైర్మన్‌ గిరిబాబు, కౌన్సిలర్‌ కుమారుడు నవీన్‌ మధ్య వాగ్వాదం జరిగింది. అందులో భాగంగానే గిరిబాబును ఛాతిపై చేయి వేసి నవీన్‌ తోసేశారని తెలిసింది. ఆ తర్వాత గిరిబాబు సోదరుడు ఆనంద్‌ రావడంతో ఇద్దర్నీ నవీన్‌ రెండు చంకల్లో పెట్టి ఈడ్చుకుంటూ వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం పలాసలో హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది.

` వైకాపా హయాంలో ఒక భూవివాదంలో 29వ వార్డు వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న జీడి వ్యాపారి తూముల శ్రీను జోక్యం చేసుకొని అక్కడ ఉన్న పశువుల పాకను తొలగించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పశువుల పాక తొలగించి నష్టపర్చినందుకు రూ.10 లక్షలు చెల్లించాలంటూ తూముల సతీష్‌ హత్యకేసులో ఒక నిందితుడిగా ఉన్న ధర్మా శ్రీనుకు వార్నింగ్‌ ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు.

`వైకాపా అధికారంలో ఉన్నప్పుడు గౌతు లచ్ఛన్న విగ్రహం తొలగింపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. శాంతిభద్రతల సమస్యగా మారడంతో ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్లు కూడా రంగంలోకి దిగాయి. నారా లోకేష్‌ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి పలాస వెళ్తుండగా శ్రీకాకుళం పొలిమేరల్లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పలాస కిడ్నీ రీసెర్చ్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహాన్ని, శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి.

` వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన నర్తు ప్రేమ్‌కుమార్‌ మంత్రి అప్పలరాజు అండదండలతో నర్సిపురంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇంటిని నిర్మించేస్తున్నారని అప్పట్లో టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపించింది. అయితే తాను 2004లోనే ఆ స్థలం కొనుగోలు చేశాను కాబట్టి టీడీపీ నేతలకు సమాధానం చెప్పే అవసరం లేదని ప్రేమ్‌కుమార్‌ చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులుగా చెలామణీ అవుతున్న అదే గ్రామానికి చెందిన చంద్రరావు, గోపి, సత్యం, కామేశ్వరరావులు ఆ ఇంటిని కూలదోశారని ప్రచారం జరుగుతోంది.

`పలాస మండలం లక్ష్మీపురం పంచాయతీ కిష్టుపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గొండు మోహన్‌ వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కాననట్లు వ్యవహరించారు. అప్పట్లో అప్పలరాజు దన్ను ఉండటం వల్ల ఈయన్ను ఎదుర్కోలేక మిన్నకుండిపోయినవారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రతిదాడులకు దిగారు. అందులో భాగంగా గ్రామానికి చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కృష్ణంరాజు, ఢల్లీి ఇటీవల దాడి చేసి మోహన్‌ను గాయపరిచారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మితిమీరిన దూకుడుతో చేటు

మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినా అప్పలరాజుకు మంత్రి పదవి వరించడానికి ప్రధాన కారణం ఆయన దూకుడే. ఈ తత్వంతో పార్టీని బలోపేతం చేస్తారని భావించారు. కానీ ఆ నలుగుర్ని మినహా డాక్టర్‌ అప్పలరాజు ఎవర్నీ మిగుల్చుకోలేకపోయారు. ప్రేమతో జయించాల్సినచోట కూడా పగసాధించే ధోరణితో అనూహ్యంగా భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. జిల్లాలో జగనన్న సైనికుడిగా ఫైర్‌బ్రాండ్‌ ముద్ర కోసం ప్రయత్నించారు తప్ప ప్రభుత్వం మారితే తన పాపాలే శాపాలుగా మారుతాయని గ్రహించలేకపోయారు. ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఉన్నారని అప్పలరాజు దృష్టికి తీసుకువస్తే దాడులు చేయండి.. తొక్కిపెట్టండి.. కేసులు పెట్టండి.. అనే విధానం అవలంభించడం వల్ల ఇప్పుడు టీడీపీ అదే మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ప్రజాస్వామ్యం, రాచరికం ఒకటి కాదు. ఇలాంటి పనులు చేయబట్టే అప్పలరాజు ఒక టెర్మ్‌కే ఇంటికెళ్లిపోయారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే పని చేస్తే అదే త్రోవలో వెళ్లిపోవాల్సి ఉంటుందని గుర్తిస్తే బాగుంటుంది.

ప్రజాస్వామ్యంలో రాచరిక ధోరణి

మంత్రిగా సీదిరి అప్పలరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత పలాసలో పార్టీల జెండాలే పట్టుకోవడానికి టీడీపీ, జనసేన కార్యకర్తలు భయపడ్డారు. చివరకు సొంత పార్టీలో భిన్నస్వరం ఉన్న నాయకులను కూడా తొక్కిపెట్టారు. టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీషను మహిళ అని చూడకుండా సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసికంగా హింసించారు. ఇలా చేయడం తప్పని మంత్రి సీదిరికి చెప్పడానికి వైకాపా నాయకులు కూడా సాహసించలేదు. బహిరంగ సభల్లో టీడీపీ నాయకులను ఈడ్చికొడతామని అనడంతోపాటు ప్రభుత్వ వ్యవస్థల ద్వారా భయపెట్టారు. మంత్రి సీదిరికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో వ్యక్తిగత ఇమేజ్‌ దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టి రాక్షసానందం పొందారు. ఆ నలుగుర్ని వెనకేసుకొని పలాస రాజ్యానికి రాజులా వ్యవహరించిన అప్పలరాజు వల్లే ఇప్పుడు వైకాపా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారన్న ప్రచారం సాగుతోంది. సహజంగా హుందా రాజకీయం చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. జిల్లాలో మరే నియోజకవర్గంలోనూ ఇప్పటి వరకు ఇటువంటి ఘటనలు ఎదురుకాలేదు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page