top of page

పవన్‌ ముందు చిన్నబోయిన బీజేపీ

Writer: NVS PRASADNVS PRASAD
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో లాంటి లక్షణం ఉంటుంది. పార్టీ పేరు చెప్పినంతనే వారు ఎలాంటి వాదాన్ని వినిపిస్తారో తెలియంది కాదు. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ బీజేపీ తీరు విమర్శలకు తావిస్తోంది. బీజేపీ అన్నంతనే హిందుత్వ అన్న ముద్ర ఉన్న ఆ పార్టీ.. ఏపీలో అధికార కూటమిలో భాగస్వామి. ఇలాంటి వేళ తమ రాజకీయ ప్రత్యర్థులు చేసిన తప్పులను ఎండగట్టటమే కాదు.. దానికి సంబంధించిన చేపట్టాల్సిన కార్యక్రమాలు చాలానే ఉంటాయి. కానీ.. ఆ విషయంలో ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిచ్చేలా మారింది.

శ్రీవారి లడ్డూ కల్తీ ఎపిసోడ్‌ మొత్తాన్ని చూస్తే.. టీడీపీ, జనసేన దూకుడు ముందు ఏపీ బీజేపీ నేతలు వెలవెలపోవటమే కాదు.. వారి వాయిస్‌ ఎక్కడా వినిపిస్తున్న పరిస్థితి లేదు. నిజానికి కమలనాథులు చేయాల్సిన పనిని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నారని చెప్పాలి. లడ్డూ అంశాన్ని తీవ్రంగా తీసుకోవటమే కాదు.. మిగిలిన రాజకీయ పార్టీల తీరుకు భిన్నంగా పవన్‌ ప్రకటిస్తున్న నిర్ణయాలు మిగిలిన రాజకీయ పార్టీలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

సాధారణంగా ఒక దుర్మార్గ ఘటన జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండిరచటం, దానిమీద ఘాటు విమర్శలు చేయటం మామూలే. అందుకు భిన్నంగా లడ్డూ ఎపిసోడ్‌లో సగటు హిందువుగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్‌ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో మరే పార్టీ అధినేత కానీ.. కరుడుకట్టిన హిందుత్వ వాదులు సైతం తీసుకోని నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా పవన్‌ కొత్త విధానానికి తెర తీశారని చెప్పాలి. అలా అని అన్యమతం మీద ఆయన విరుచుకుపడటం లేదు. ఒక ధర్మానికి జరిగిన నష్టాన్ని మాట్లాడటం.. మిగిలిన ధర్మాల పట్ల మర్యాద.. గౌరవాల్ని ప్రదర్శించటం ద్వారా.. అందరికి ఆమోదయోగ్యంగా వ్యవహరిస్తున్నారు.

నిజానికి పవన్‌ చేయాల్సిన దీక్షను.. ఏపీ బీజేపీకి చెందిన అగ్రనేతలు కలిసికట్టుగా చేయటం.. దాన్నో ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవటంలో వెనుకపడ్డారని చెప్పాలి. దేశ రాజకీయాల్లో సాఫ్ట్‌ హిందుత్వ పార్టీల లేమి ఎప్పటి నుంచో వెంటాడుతోంది. ఆ కొరతను తీర్చిన మొదటి పార్టీగా జనసేనను చెప్పాలి. నిజానికి ఈ అవకాశాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ అందిపుచ్చుకుంటుందని, అదే జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా నిలుస్తుందని పలువురు భావించేవారు. కానీ.. కేజ్రీవాల్‌ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఈ విషయంలో జనసేనాని కొత్త పంథాను ఎంచుకున్నారని చెప్పాలి. సాఫ్ట్‌ హిందుత్వలో హిందువుల పక్షపాతిగా వారికి అండగా ఉండటం, వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లే అంశాల పట్ల ఓపెన్‌గా మాట్లాడటం, సెక్యులర్‌ శక్తులుగా చెప్పుకునే పక్షాలకు భయపడకుండా ధీటుగా వాదనల్ని వినిపించటమే కాదు.. అన్యమతాల పట్ల కించిత్‌ తగ్గని గౌరవాభిమానాల్ని ప్రదర్శించటం ఉంటుంది. ఈ తరహా బ్లెండ్‌ ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీకి లేదనే చెప్పాలి. పవన్‌ తీరు ఇందుకు తగ్గట్లే ఉంది. తాజాగా ఆయన చేపట్టిన దీక్షతో అది రూడీ అయ్యిందని చెప్పాలి. ఏమైనా.. శ్రీవారి లడ్డూ కల్తీ వేళలో.. ఏపీలో మరింత హోల్డ్‌ పెంచుకోవాల్సిన బీజేపీ.. తమకంత సీన్‌ లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.

మరోసారి వార్తల్లోకి ఎక్కారు!

మొదటిసారి మోడీ ‘యే పవన్‌ నహీ తుపాన్‌ హై’ అన్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన రోజున వేదిక మీద మోడీ అన్న మాటలవి. మోడీ వ్యాఖ్య మీద స్పందించిన నెటిజన్లు మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎవరీ పవన్‌ కళ్యాణ్‌ అంటూ గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. గూగుల్‌లో ఆ రోజు ఎక్కువ హిట్స్‌ పవన్‌ కళ్యాణ్‌ గురించే జరిగాయి. మళ్లీ శనివారం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో పవన్‌కళ్యాణ్‌ గురించి చర్చ మొదలైంది.

మంచివారెవరూ లేరిక్కడ!

చిత్తూరుకి చెందిన సారా కాంట్రాక్టర్‌ ఆదికేశవులు నాయుడుని టీటీడీ చైర్మన్‌గా నియమించింది చంద్రబాబే. కరుణాకర్‌ రెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించింది వైఎస్సార్‌. మళ్లీ చెన్నైకి చెందిన శేఖర్‌రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమించింది చంద్రబాబే. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించింది జగనే. వీఐపీ దర్శనం పేరుతో కోట్లు వెనకేశారు రోజా అనే ఆరోపణలున్నాయి.

అసలు దీనికి పరిష్కారం ఏమిటి?

మొన్న పవన్‌ ఒక ప్రకటన చేశారు.. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక సంస్థని ఏర్పాటుచేసి దేశంలోని అన్ని దేవాలయాలను ఆ సంస్థ పర్యవేక్షణలోకి తీసుకురావాలి. ఇది దేశంలోని అన్ని ప్రాంతాలలోని రాజకీయ పార్టీలకి సెగ తగిలింది. ఒకవేళ పవన్‌ కోరినట్లుగా మోడీ, అమిత్‌ షాలు కనుక ఆ దిశగా అడుగులు వేస్తే అది బీజేపీ మరింత బలపడే ప్రమాదం ఉందని భయం!

అఫ్కోర్స్‌! తిరుపతి లడ్డు వివాదం మీద అమిత్‌ షా సీరియస్‌గా ఉన్నారు. మరోవైపు జేపీ నడ్డా వివరంగా నివేదిక ఇవ్వమని చంద్రబాబుని కోరారు. ఇక ప్రకాష్‌రాజ్‌ అయితే పవన్‌కి ఒక విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం మీదే కనుక విచారణ చేసి దోషులని అరెస్ట్‌ చేస్తే పోయేదానికి దేశానికి కలిపి ప్రత్యేకంగా కొత్త సంస్థ ఎందుకని వాపోయారు. ఎందుకొచ్చిన గోల అని అనుకున్నారేమో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో నందిని నెయ్యినే వాడాలని ఆదేశాలు ఇచ్చింది. ఇది ఒక చెయిన్‌ రియాక్షన్‌ అనుకోవాలి పవన్‌ ప్రకటనకి. మన తెలుగు మీడియాలో పెద్దగా కవరేజీ లేదు కానీ పవన్‌ చేసిన ప్రకటన మాత్రం ఉత్తరాదిన బాగా వైరల్‌ అవుతున్నది. ఒక సిద్ధాంతం కలిగిన రాజకీయ నాయకుడుగా జాతీయ స్థాయిలో ఇప్పడిప్పుడే తన ఉనికిని చాటుకుంటున్నారు పవన్‌ కళ్యాణ్‌.

 
 
 

コメント


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page