రూ.11 కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మాయం
సరఫరా చేయకుండా బిల్లుల చెల్లింపు
డీడీ కాదంటే ఏడీలతో సంతకాలు
టీడీపీలో బీజం.. వైకాపాలో పంపకం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పశు సంవర్ధక శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఉంటే.. దాన్నేం చేయాలి? సంబంధిత జిల్లాలో ఎస్సీ, ఎస్టీల జీవనోపాధి మెరుగుకు పశువులను కొనుగోలు చేసి ఇవ్వాలి. ఇందుకోసం కేటాయించిన నిధులతో వేరే రాష్ట్రానికి వెళ్లి ఎక్కువ పాలిచ్చే మేలుజాతి పశువులు కొనుగోలు చేస్తే మనకేం మిగులుతుందనుకున్నారో ఏమో.. పశువులకు దాణా ఇస్తే సరిపోతుందని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దాణా కొనుగోలుకు మళ్లించేశారు. సాధారణంగా పొలం గట్ల మీద, చెరువుల్లోను మేసే పశువులకు దాణా ఇచ్చేశామని రికార్డుల్లో రాసుకుంటే ఎంచక్కా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మింగేయొచ్చని, ఆ తర్వాత అడిగితే ఆ దాణా పశువులకు పెట్టేశామని చెప్పేయొచ్చన్నదే అసలు ప్లాన్. ఒక్క మాటలో చెప్పాలంటే బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ చేసిన గడ్డి కుంభకోణం లాంటిదే ఇది కూడా. అంకెల్లోనే తేడా.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం 2017 నుంచి 2021 వరకు జిల్లాలో యదేచ్ఛగా సాగింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కేవలం దళితుల కోసమే ఖర్చు చేయాలి. అందుకు దళితులకు రెనోవేటెడ్ ఇన్‌పుట్ డెవెలప్‌మెంట్ పేరుతో చూలు ఆవులు కొనుగోలు చేసి ఇవ్వాలని 2017`18 ఆర్ధిక సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేయాలని ముందుగా నిర్ణయించింది. చూలు ఆవులు కొనుగోలు చేయడానికి సమయం పడుతుందని, దీనివల్ల ప్రభుత్వ ప్రయోజనం నెరవేరదని గుర్తించిన కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు చూలు ఆవులు కొనుగోలు స్థానంలో పశువుల దాణా సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. అందుకోసం 2 లక్షల బస్తాలు (ఒక్కోటి 50 కేజీలు) అంటే కోటి కిలోల దాణాకు విజయవాడలోని శ్రీనివాస్ ఆయిల్ మిల్స్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. కేజీ రూ.16కు కొనుగోలు చేసి సబ్సిడీపై రైతులకు రూ.4కు అందించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. జిల్లాలో 50వేల మంది రైతులను గుర్తించి ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా 3వేల కేజీల దాణాను నాలుగు పశువులకు రెండు నెలల పాటు అందించడానికి నిర్ణయించారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని ఆయా పశువైద్య ఆసుపత్రుల పరిధిలో ఉన్న దళిత, గిరిజన రైతులు తమ వాటాగా 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఆయా పశువైద్యాధికారులు ధ్రువీకరించి ఆర్‌ఐడీఎస్ యాప్ ద్వారా రైతులు కోరిన దాణాను ఇండెంట్ పెట్టాలి. ఇండెంట్ పెట్టిన దాణాను రైతులకు చేరువ చేయాలి. అయితే జిల్లాలో 10 శాతానికి మించి సరఫరా జరగలేదు. పశువుల దాణా జిల్లాకు తీసుకురాకుండానే తెచ్చినట్టు చూపించి నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
బ్లాక్ మార్కెట్‌కు తరలించారు
ఏజెన్సీలు 50 శాతం కమీషన్‌తో పశుదాణా సరఫరా చేయడం మొదటి నుంచి అలవాటు. దీన్నే ఆదాయ మార్గంగా చేసుకొని జిల్లాలో ఉన్న పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు కలిసి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో కొనుగోలు చేసి సరఫరా చేయాలని నిర్ణయించిన పశుదాణాను జిల్లాకు రవాణా కాకుండానే బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారు. దాణాను పక్కదారి పట్టించడం కోసం పశు సంవర్ధక శాఖ అధికారులు మొదట్నుంచి ఓ పథకం ప్రకారం వ్యవహరించారు. దాణా ఇస్తారనే సమాచారం బయటపడకుండా గుట్టుగా వ్యవహారం నడిపారు. దీంతో దళిత, ఎస్టీ రైతులు మీ`సేవలో పేర్లు నమోదు చేసుకోలేదు. ఒకవేళ ఎవరైనా నమోదు చేసుకున్నా, వారి కంట్రిబ్యూషన్ 25 శాతం చెల్లించిన దాఖలాలు లేవు. కానీ వెయ్యి లారీల్లో 2 లక్షల బస్తాల దాణా సరఫరా చేసినట్టు రైతుల పేరుతో ఆర్‌ఐడీఎస్ యాప్‌లో నమోదు చేసి ఇండెంట్ పెట్టి సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. వాస్తవానికి జిల్లాలో దళిత, ఎస్టీల్లో 50వేల మందికి పశువుల దాణా పంపిణీ చేయాలి. దీన్ని ఆ శాఖ డైరెక్టర్ నుంచి క్షేత్రస్థాయిలో పశువైద్య అధికారుల వరకు దుర్వినియోగం చేసి కమీషన్లు పంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోనీ నిబంధనల ప్రకారం పంపిణీ చేశారనుకున్నా 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి దాణా పంపిణీ పూర్తి కానట్లు తెలుస్తుంది. అయినా విజయవాడకు చెందిన శ్రీనివాస్ ఆయిల్ మిల్స్ ఏజెన్సీకి రూ.9 కోట్ల మేర చెల్లించేశారు. చివరిసారిగా 2019 మార్చి 5న 2.40 లక్షల కేజీల పశుదాణా అవసరమని ఆర్‌ఐడీఎస్‌లో ఇండెంట్ కూడా పెట్టారు.
2021లో బిల్లు చెల్లింపు
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా 2018లో ఈ పథకం ప్రారంభించారు కాబట్టి అప్పటి ఉన్నతాధికారులు ఆపలేదు. ఇండెంట్ పెట్టిన దాణా రాలేదు కానీ.. దీనికి చెల్లించాల్సిన మొత్తం రూ.2.38 కోట్లు విజయవాడకు చెందిన శ్రీనివాస్ ఆయిల్ మిల్స్ ఏజెన్సీకి చెల్లించడానికి 2019 మార్చి 20న అప్పటి జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ సిద్ధమయ్యారు కానీ 2019 సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశుదాణా కుంభకోణంపై ఫిర్యాదులు అందడంతో రూ.2.38 కోట్లు చెల్లింపు తాత్కాలికంగా నిలిపేశారు. వైకాపా హయాంలో జిల్లాకు చెందిన డాక్టర్ అప్పలరాజు ఆ శాఖకు మంత్రిగా ఎంపిక కావడంతో చెల్లింపుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. వైకాపా హయాంలో బకాయిలు చెల్లింపుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక జీవోను 2021లో తీసుకువచ్చారు. అందులో పశువుల దాణా సబ్సిడీ పంపిణీపై పరిశీలించి సక్రమంగా ఉందని నిర్ధారించిన తర్వాతనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. దీనికోసం డివిజన్లలో ఉన్న ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు పక్క డివిజన్‌లో రికార్డులు పరిశీలించి నిర్థారించాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. రాష్ట్రంలో అక్రమాలు జరిగినట్టు నిర్థారణ అయిన శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలతో పాటు మరో రెండు జిల్లాల్లో డీడీలు ఎవరూ బకాయి బిల్లు చెల్లింపులపై నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడ మాత్రం డీడీల స్థానంలో ఏడీలతో సంతకాలు చేయించి బిల్లు చెల్లింపులకు క్లియరెన్స్ ఇచ్చేశారు. దీనిపై శాఖ డైరెక్టర్ బకాయి బిల్లులు చెల్లింపులకు సంబంధించిన ఫైల్‌పై డీడీల స్థానంలో ఏడీలు సంతకాలు చేయడంపై ఆక్షేపించినా శ్రీనివాస్ ఆయిల్ మిల్స్ ఏజెన్సీకి రూ.2.38 కోట్లు చెల్లించేశారు.
త్రీమెన్ కమిటీ
ఇటీవల దళిత సంఘాలు గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై జేసీ త్రీమెన్ కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని కోరారు. ఆయన త్రీమెన్ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత పశు సంవర్ధక శాఖ జేడీ ఇన్‌ఛార్జిగా ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజగోపాలరావును నియమిస్తూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేయడం కొసమెరుపు. ఈ కుంభకోణం వెలుగు చూడకుండా మేనేజ్ చేయడానికే ఈయన్ను నియమించినట్టు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఈ కుంభకోణం వెనుక ఎవరున్నారు? ఎవరు చెబితే టీడీపీ హయాంలో కుంభకోణానికి తెరలేపారు? ఎవరి పాత్ర వల్ల వైకాపా హయాంలో బిల్లులు చెల్లించేశారు? ఇప్పుడు నిజంగా ఇవి బయటపడకుండా ఉండేందుకే ఆరోపణలున్న జేడీని ఇక్కడ నియమించారా? వీటన్నిటిపై మరో కథనంలో కలుద్దాం.
コメント