మూడుచోట్ల ఒకేసారి చతుర్ముఖ పారాయణం
సిండికేట్‌గా ఏర్పడి రాష్ట్రస్థాయి పోటీగా మార్చేశారు
అన్ని ఫ్రాంచైజీలలో గోపీ, తులసీలే యజమానులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే ఆటగాళ్లను కొనుగోలు చేసే ఫ్రాంచైజీలు ఐపీఎల్ నిర్వహించి, లాభాలను సంపాదిస్తున్నట్లే ఉత్తరాంధ్ర ప్రాంతంలో పేకాడేవారిని ఒక చోట కూర్చి జిల్లా బోర్డర్‌లో మూడు ఫ్రాంచైజీలుగా నడుపుతున్న కథ ఇది. అయితే ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీకి ఒక్కో యజమాని ఉంటాడు. షారూక్ ఖాన్ ఒక టీమ్‌ను కొనుక్కుంటే, ప్రీతిజింతా, నీతూ అంబానీ లాంటివారు వేరే ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. కానీ పేకాట ప్రీమియర్ లీగ్‌లో అన్ని ఫ్రాంచైజీలకు ఒకడే యజమాని. పేకాడిరచేవారందర్నీ సిండికేట్ చేసి వేర్వేరు చోట్ల.. మన క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే వేర్వేరు పిచ్‌ల మీద ఆడిస్తున్నారు. ఏ దేశం క్రికెట్ ఆడినా ఐసీసీ పరిధిలోకే వచ్చినట్లు ఇక్కడ ఏ ప్రాంతంలో పేకాట ప్రీమియర్ లీగ్ ఆడినా ఆ సిండికేట్‌కే సొమ్ములు చేరాలి. ఈ వ్యాపారంలో కాంపిటేషన్ లేకుండా మోనోపలిగా నిర్వహిస్తుండటం వెనుక ప్రతీ వ్యవస్థలో మేనేజ్ చేయడానికి పెద్ద యంత్రాంగమే పని చేస్తోంది. డబ్బులు తేవడానికి ఒక గ్రూపు, జూదరులను తరలించడానికి ఒక గ్రూపు, డబ్బును కాయిన్లుగా మార్చడానికి మరో గ్రూపు, జూదమాడేవారికి సకల సౌకర్యాలు కల్పించడానికి మరో గ్రూపు, ఏ పిచ్ మీద ఆడాలో నిర్ణయించడానికి ఒక నిఘావ్యవస్థ.. మొత్తం కలిపి ఒక పరిశ్రమనే వీరు నడుపుతున్నారు.
డీజీపీకి లేఖ
అవకాశం దొరికిన ప్రతిచోట పేకాట శిబిరాలను నిర్వహిస్తూ జూదరుల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న శ్రీకాకుళం నగరానికి చెందిన గరికి గోపాలకృష్ణ, బెండి తులసీ అండ్ బ్యాచ్‌పై పోలీసు ఉన్నతాధికారులకు ఒక బాధితుడు మంగళవారం పోస్టు ద్వారా ఫిర్యాదు చేశాడు. పేకాటను ఐపీఎల్ మాదిరిగా నిర్వహిస్తూ లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నట్టు తెలిసింది. పేకాట శిబరం నిర్వహించడానికి గోపి, తులసీ జిల్లాలో సరిహద్దుల్లోని పోలీసులకు ఇస్తున్న ప్యాకేజీని అందులో పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లా కేంద్రంతో పాటు, ఆయా సర్కిల్స్ పరిధిలో ఉన్న పోలీసులు ఎవరెవరితో వీరికి సంబంధాలు నెరుపుతున్నారో వివరించినట్టు తెలిసింది. గోపి, తులసీ బారినపడి ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో అందులో పేర్కొన్నట్టు తెలిసింది. గతంలోనూ ఇలాంటి ఫిర్యాదే ఒకటి డీజీపీ, ఎస్పీకి అందిన వెంటనే పేకాట నిర్వాహకులపై నిఘా పెట్టి జిల్లాలో పేకాట శిబిరాలు లేకుండా అడ్డుకొని కొందరిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టేశారు. ఆ తర్వాత వారంతా వేర్వేరు కుంపట్లు పెట్టకొని గరివిడి, భోగాపురం, ఒడిశా, నేపాల్, గోవా బాట పట్టారు. మళ్లీ వారంతా ఒక్క చోటకు చేరి జూదర్లకు సమాచారం ఇచ్చి పేకాట శిబిరాలను నిర్వహించడం ప్రారంభించారు. ఇటీవల పేకాట శిబిరాల నిర్వహణ ఒక ఉద్యమంలా సాగుతుంది. దీనికి పోలీసులు అండదండలు అందించడంతో పాటు టీడీపీ నాయకులు తమ వెంట ఉన్నారని నిర్వాహకులు బహిరంగంగా చెప్పుకు తిరుగుతున్నారు. వాస్తవంగా పేకాట నిర్వాహకులందరూ వైకాపా నాయకులతో అంటకాగుతూ జిల్లాలో రణస్థలం, నరసన్నపేట, శ్రీకాకుళం, జలుమూరు, రాజాం, సోంపేట, మందసలో ఎక్కడికక్కడే శిబిరాలను ఏర్పాటుచేసి పేకాట ఆడిస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో టీడీపీ పేరుతో పబ్బం గడుపుతున్నారు.
శ్రీకాకుళం నగరానికి చెందిన గరికి గోపాలకృష్ణ, ఆమదాలవలస మండలం తోటాడకు చెందిన బెండి తులసీ, ఆమదాలవలస మండలం అక్కివరానికి చెందిన సీపాన శ్రీను, మాజీ ఆర్మీ ఉద్యోగి తాండ్ర తేజేశ్వరరావు, నరసన్నపేటకు చెందిన గన్నీ, శ్రీకాకుళానికి చెందిన బండారీలతో పాటు నగేష్, చల్లా రాజు, అప్పి ఉన్నారు. ప్రస్తుతం గజపతి జిల్లా గారబందకు 15 కిలోమీటర్లు దూరంలో శాశ్వత పేకాట శిబిరం ఏర్పాటుచేసి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి జూదర్లను తీసుకువెళుతున్నారు. టెక్కలి, మెళియాపుట్టి, చాపర మీదుగా సుమారు ఏడు వాహనాల్లో జూదర్లను నిర్వాహకులు తరలిస్తున్నారు. అందులో మూడు వాహనాల్లో శ్రీకాకుళం కొత్తరోడ్ నుంచి బెండి తులసీ, తేజ, శ్రీను బయలుదేరుతున్నారు. కలెక్టరేట్ వద్ద బాదుర్లపేట నుంచి డిజైర్ వాహనంలో గరికి గోపాలకృష్ణ బ్యాచ్ బండారి, నగేష్ బయలు దేరుతున్నారు. ఈ వాహనంలోనే నగదుతో పాటు కాయిన్స్ తరలిస్తుంటారు. నరసన్నపేట నుంచి గన్ని (గణేశ్వరరావు) ఆధ్వర్యంలో ఒక బ్యాచ్ బయలుదేరుతుంది. వీరు ఉదయం 10 గంటలకు నగరం నుంచి బయల్దేరి గారబందకు రెండు గంటల వ్యవధిలోనే చేరుకుంటారు. అక్కడికి చేరిన తర్వాత వీరికి ఒడిశాలోని బరంపురం, పర్లాకిమిడి తదితర ప్రాంతాల నుంచి మరికొందరు తోడవుతున్నారు. వీరి ఆధ్వర్యంలో వాటాలు పెట్టి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న రాష్ట్ర సరిహద్దుల్లోని ఒడిశా పరిధిలో గారబంద, గోచెక్క, సుంకికి జూదర్లను అద్దెవాహనాల్లో తరలించే బాధ్యతను నగరానికి చెందిన అప్పి, చల్లా రాజు చూస్తున్నట్టు తెలిసింది.
బెండి తులసికి పోలీసుల్లో కొందరితో ఉన్న బంధత్వం వల్ల వైకాపా హయాంలో బెండి తులసికి అండదండలు అందాయి. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు గోపి అండ్ బ్యాచ్‌పై బెండి తులసీ పోలీసులకు పార్టీ నాయకులతో ఫోన్ చేయించడమే ఇందుకు ఉదాహరణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న పోలీసులను తులసి పావుగా వాడుకొని గోపితో కలిసి పేకాట శిబిరాలను నడుపుతున్నాడు. సుంకిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరానికి వీరు వెళ్లకపోయినా అక్కడ నిర్వాహకులతో వీరు వాటాదారులుగా కొనసాగుతూనే జూదర్లను అప్పి, చల్లా రాజు ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. గోచెక్కలో నిర్వహిస్తున్న శిబిరానికి విశాఖ నుంచి కొందరిని తులసీ బ్యాచ్ తరలిస్తూనే సీపాన శ్రీను, తాండ్ర తేజ అక్కడి వ్యవహారాలను చూస్తున్నారు.
ఒకే సమయంలో మూడుచోట్ల నిర్వహిస్తున్న పేకాట శిబిరాల్లో గారబందకు 200 మందికి పైగా ఆటగాళ్లు హాజరవుతున్నారని తెలిసింది. నగదును కాయిన్స్‌గా మార్చే వ్యవహారాన్ని నగరానికి చెందిన నగేష్ చూస్తున్నాడు. దీనికోసం ఆయనకి రోజుకు రూ.3వేలు చెల్లిస్తున్నట్టు తెలిసింది. అలాగే పేకాట శిబరాలకు చల్లా రాజు ఫైనాన్స్ చేస్తున్నట్టు తెలిసింది. అప్పి అనే వ్యక్తి అద్దెకు వాహనాలు సమకూర్చడం ద్వారా ఒక వాహనానికి రూ.2వేలు కిరాయి తీసుకుంటున్నట్టు తెలిసింది. వీరంతా తులసీ, గోపిల పేకాట పరిశ్రమలో ఉద్యోగుల కింద లెక్క. ఈ వ్యవహారంపై ప్రభుత్వ నిఘా అధికారులు పూర్తి సమాచారం సేకరించి పోలీసులకు ఇచ్చినట్టు తెలిసింది.
Comments