సమాంతర వ్యవస్థ నడుపుతున్న తులసీ, గోపీ అండ్ కో..
అద్దెకు రావడంలేదని సొంతంగా కార్లు కొన్నారు
శిబిరాల వద్ద ‘ధర్మవడ్డీ’కి అప్పులు
పేకాడుతున్నవారి మధ్యలో నిర్వాహకుల బినామీలు
కొద్ది రోజుల క్రితం వరకు టౌన్ బోర్డర్‌లోనే నడిచిన ఆట
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో పేకాట శిబిరాలు నిర్వహించడం ద్వారా కొందరు ఇక్కడ సమాంతర వ్యవస్థను నడుపుతున్నారు. సాధారణంగా వ్యవస్థలో ప్రభుత్వం పెట్టిన అధికారులు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉంటారు. రాజ్యాంగం ప్రకారం మన మీద సర్వహక్కులూ వారివే. అయితే ఇక్కడ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మరో వ్యవస్థ నడుపుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడానికి కారణం వ్యవస్థలో మూల స్తంభాల వెనుక వీరు దాక్కోవడమే. పేకాట శిబిరాలు నిర్వహించే చోటుకు అది ఆడేవారిని తరలించలేమని, పోలీసులకు దొరికిపోతే తమ వాహనాలు సీజైపోతున్నాయని, కోర్టులో కేసు తేలి కారు చేతికొచ్చే లోపు అది పనికిరాకుండాపోతుందని భావించిన ట్రావెల్స్ యాజమాన్యాలు పేకాట శిబిరాల నిర్వాహకులకు కారు అద్దె ఎక్కువ చెల్లిస్తామని చెప్పినా ఇవ్వకపోవడంతో అప్పనంగా వచ్చిన సొమ్ముతో నిర్వాహకులు సొంతంగా కొన్ని కార్లను కొనుగోలు చేశారు. ఈ సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయో వేరేగా చెప్పనక్కర్లేదు. ఇన్‌కమ్ టాక్స్ పడకుండా ఉండేందుకు లోను వంటివాటిని చూపించినా కొనుగోలు చేసిన సొమ్ము కచ్చితంగా పేకాడి ఓడిపోయినవాడి భార్య పుస్తెలతాడులోనిదే.
ఒడిశాలో నిర్వహించే పేకాట శిబిరాలకు వెళ్లేందుకు వినియోగించే వాహనాలకు రోజుకు రూ.10వేలు అద్దె చెల్లిస్తుండేవారు. రెండేళ్ల క్రితం గుణుపూర్, పర్లాకిమిడిలో శిబిరాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కడంతో వాహనాలను సీజ్ చేసి మూడు నెలల వరకు విడిచిపెట్టలేదు. గారబందలో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారంతో పాతపట్నం పోలీసులు ఒక వాహనాన్ని సీజ్ చేశారు. దీన్ని మూడు నెలల పాటు పోలీస్‌స్టేషన్‌లో ఉంచేశారు. ఒకసారి గుణుపూర్ వెళుతుండగా వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో పేకాట శిబిరాలకు వాహనాలను అద్దెకు ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్రస్తుతం నిర్వాహకులే సొంతంగా వాహనాలను కొనుగోలు చేసి వాటిని అద్దెకు పెట్టుకుంటున్నారు.
పేకాట శిబిరాల కోసం తోటాడలో బెండి తులసి బ్యాచ్ మొత్తం ఐదు వెర్టిగాలను కొనుగోలు చేసి అద్దెకు తిప్పుతున్నారంటే ఈ వ్యవహారం ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవాలి. గారబందకు వెళుతున్న రెండు వాహనాల్లో ఒకటి తులసి వాడుతున్న ఏపీ39 ఆర్‌టీ 8836 కాగా, మరొకటి గోపాలకృష్ణ వద్ద ఉన్న ఏపీ39 జీఎస్ 8676. గోచెక్కకు ఏపీ40ఎన్ 0649, ఏపీ39 ఆర్‌టీ 9291 అనే రెండు వాహనాలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా ఆయా శిబిరాలకు ఆటగాళ్లతో పాటు నిర్వాహకులు కొందరు వెళుతున్నారు. ఈ రెండుచోట్ల సుమారు రూ.కోటికి పైగా లావాదేవీలు సాగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ప్రతిరోజు ఈ రెండుచోట్లా ఆట నిర్వహణకు అయ్యే ఖర్చు కింద రూ.1.10 లక్షలు వెచ్చిస్తున్నారు. అందులో పోలీసులు, రౌడీషీటర్లకు కొంత మొత్తం ఖర్చు చేసి స్థానికంగా శిబిరాలు నిర్వహణకు సపోర్టు చేసినవారికి మామూళ్లు ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే సమాంతర వ్యవస్థను నడపడమంటే. సాధారణంగా పిల్లి`ఎలుకలా ఉండాల్సిన పోలీసులు, రౌడీషీటర్లను ఒకే బోనులో ఉంచి మేపుతున్న ఘనత పేకాట శిబిర నిర్వాహకులదే.
జిల్లాలో పేకాట శిబిరాల నిర్వహణకు మూలపురుషుడుగా పేరొందిన నాయుడు వద్ద టీ, వాటర్ అందించే బాయ్స్‌గా పని చేసిన వారంతా ఇప్పుడు నాయుడుని మించిపోయారు. నాయుడు వద్ద ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేసిన శ్రీకాకుళం నగరానికి చెందిన గరికి గోపాలకృష్ణ, బెండి తులసీ, నరసన్నపేటకు చెందిన గన్నీ, బండారీలు పేకాటలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే స్థాయికి ఎదిగిపోయారు. వీరికి సహాయకులుగా కొందరిని ఏర్పాటుచేసుకొని పేకాట శిబిరాల నిర్వహణ బాధ్యతలు అప్పగించి వాటాలు ఇస్తున్నారు.
జిల్లాలో పేకాట నిర్వహించడానికి అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో సరిహద్దులో ఉన్న ఒడిశాలోని గ్రామాలకు మకాం మార్చారు. దశాబ్ధాం క్రితం వరకు పూట గడవడం కష్టంగా బతుకుబండి నడిపినవారు పేకాడిరచి వందల మందిని రోడ్డుపాలు చేసిన సొమ్ముతో కోట్లకు పడగెత్తారు. ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్నారు. పెద్ద బంగ్లాలను నిర్మించుకున్నారు. దొరికిన చోటల్లా అప్పులు తీసుకొని ఎగనామం పెట్టినవారంతా ఇప్పుడు అప్పులు ఇచ్చే స్థాయికి చేరిపోయారు. పోలీసుల భుజాలపై చెయ్యి వేసి సెటిల్మెంట్ చేసే స్థితికి చేరిపోయారు. వీరి ఆగడాలకు రౌడీషీటర్లను పావులుగా వాడుకొని పేకాట శిబిరాల నిర్వాహణ ద్వారా వచ్చే లాభాలను వాటాలుగా పంచుతున్నారు. పేకాట శిబిరాలకు వెళ్లేవారికి వాహనాలను సమకూర్చుతున్న రౌడీషీటర్లకు అద్దె రూపంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు. పేకాట శిబిరాలు నిర్వహించేవారు ఇచ్చే మామూళ్లతోనే రౌడీషీటర్లు మనుగడ సాగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కొందరు పేకాట నిర్వాహకులతో కలిసి వాటాలు పెట్టినవారు ఉన్నారు. పేకాటలో కూర్చున్న తర్వాత అక్కడే రౌడీషీటర్లు కొందరికి ధర్మవడ్డీ పేరుతో రూ.30కి తక్కువ కాకుండా అప్పులిస్తుంటారు. గెలిస్తే గంటలోనే వందకు రూ.130 చొప్పున వసూలుచేస్తారు. ఓడిపోతే గణిత శాస్త్రంలో కూడా దొరకని వడ్డీ లెక్కలు వేసి ఆస్తులు రాయించుకుంటారు. ఉభయకుశలోపరిగా పేకాట నిర్వాహకులకు అండదండలు అందించడం ద్వారా రౌడీషీటర్లు, రౌడీషీటర్ల పేరు చెప్పి బకాయిలు వసూలు చేసుకోవడంలో నిర్వాహకులు చెట్టపట్టాలేసుకొని పని చేస్తున్నారు.
15 రోజుల ముందు వరకు గోపి నగరంలోని దమ్మలవీధికి పడమర దిశలో నాగావళి అవతల వైపు తోటలో, ఎచ్చెర్ల మండలం కుశాలపురంలో పేకాట శిబిరాలను నిర్వహిస్తూ వచ్చాడు. అంతకు ముందు సోంపేట, మందసలో పేకాట శిబరాలను నిర్వహించి ఎంతోమందిని రోడ్డుపాలు చేశాడన్న విమర్శలు ఉన్నాయి. పేకాట శిబిరంలో గోపి తన మనుషులను కూర్చోపెట్టి ఆడిరచేవాడని, వారంతా మోసపూరితంగా వ్యవహరించి పేకాట ఆడడానికి వచ్చినవారిని నిలువునా ముంచేశారని గోపాలకృష్ణ బాధితులు చెబుతున్నారు. గారబందలోనూ ఇదే పద్ధతిలో ఆట కొనసాగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. రెండేళ్ల క్రితం ఒడిశాలోని ఛత్రపూర్‌లో ఇదే పద్ధతిని అనుసరిస్తే అక్కడ స్థానికులు గోపి, గన్ని, బండారికి దేహశుద్ధి చేశారని భోగట్టా.
పోలీసులకు చిక్కినా
నగరానికి చెందిన గోపి ఏడాది క్రితం ఒడిశాలోని బల్లుగాం వెళుతుండగా ఇచ్ఛాపురం వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించి గోపీని ఆయనతో పాటు వెళ్లిన మిగతా ఐదుగురిని విడిచిపెట్టేశారు. గోపి కదలికలపై పోలీసులు నిఘా పెట్టినా తప్పించుకు తిరిగాడు. నగరంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న గోపి నివాసానికి, కలెక్టరేట్ వద్ద ఉన్న మూడంతస్థుల భవనం వద్దకు పోలీసులు వెళ్లినా గోపి చిక్కలేదు. ఆ తర్వాత సోంపేట, మందసలో పోలీసులకు మంత్లీలు ఇచ్చి పేకాట శిబిరాలను నిర్వహిస్తూ వచ్చాడు. బెండి తులసీ వైకాపా నాయకుడిగా చలామణి అవుతూ ఆమదాలవలస పోలీసును మేనేజ్ చేస్తూ మంత్లీలు ఇచ్చి తోటాడలోనే పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ వచ్చాడు. ఒకసారి పోలీసులకు చిక్కినా అప్పటి వైకాపా పెద్దల జోక్యంతో విడిచిపెట్టేశారు. ఇప్పుడు గోపి, తులసీ కలిసి పాత బ్యాచ్‌లన్నింటినీ ఒక తాటిపైకి చేర్చి జిల్లా సరిహద్దుల సమీపంలో ఉన్న ఒడిశాలోని గ్రామాల బాట పట్టారు. గోపి, తులసి బ్యాచ్ సుమారు ఐదుచోట్ల పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం నిర్వహిస్తున్న గోచెక్క, గారబంద మాత్రమే వెలుగులోకి వచ్చాయి. మిగతా మూడిరటి వివరాలు తెలియాల్సి ఉంది.
Kommentare