top of page

పేకాట శిబిరాలకు పోలీసుల రూట్‌మ్యాప్‌

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jan 2
  • 2 min read
  • బెండిగేటు-టెక్కలిపట్నం వయా గారబంద

  • శిబిరంలో యువకుడ్ని చితక్కొట్టిన నిర్వాహకుడు

  • ప్రతిదాడి భయంతో కిరాయిమూకల పహారా

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా సరిహద్దులో ఒక నేరం చేసి పక్కనే ఉన్న ఒడిశాకు పరారైన నిందితులను కొద్ది గంటల వ్యవధిలో మన పోలీసులు తెచ్చి రిమాండ్‌కు పంపిస్తున్నారు. కావాలంటే ఆమధ్య గుడివీధిలో పట్టపగలే జరిగిన చోరీలో ఎన్ని రాష్ట్రాలు దాటి మన పోలీసులు నిందితులను ఇక్కడకు తెచ్చారో ఒక్కసారి గుర్తుచేసుకోండి. అంతెందుకు.. మొన్నటికి మొన్న ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో రెండుచోట్ల చైన్‌స్నాచింగ్‌ జరిగితే, ఒడిశా నుంచి ఈడ్చుకొచ్చి ఇక్కడ మీడియా ముందు పెట్టారు మన పోలీసులు. ఇక పక్క రాష్ట్రంలో గంజాయి పార్శిల్‌ అయితే చాలు.. జిల్లాలో ఇట్టే పట్టేసుకుంటున్నారు. ఇన్ని సాహసాలు చేస్తున్న పోలీసుల చెంతనే మరికొందరు అదే యూనిఫామ్‌తో సొమ్ములకు లొంగిపోతున్నారు. కేవలం మన పరిధిలో కాదు.. ఒడిశా బోర్డర్‌లో జరుగుతుంది అన్న నెపం చూపించి జిల్లా నలుమూలల నుంచి వెళ్తున్న పేకాట నిర్వాహకులకు రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు పేకాట శిబిరం ఎక్కడ పెట్టాలో వారికి రూట్‌మ్యాప్‌ ఇస్తున్నది కూడా పోలీసులేనన్న ఆరోపణలూ లేకపోలేదు.

పాతపట్నం సర్కిల్‌ పరిధిలో ప్రతి రోజు జిల్లా సరిహద్దుకు సమీపంలో ఒడిశాలోని పర్లాకిమిడి తాలూకా గారబందలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై ‘సత్యం’ పత్రికలో వచ్చిన వరుస కథనాలపై జిల్లా పోలీసు బాస్‌ స్పందించారు. సదరు పోలీసు అధికారులకు జిల్లా పోలీసు బాస్‌ వివరణ అడిగారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు పేకాట శిబిరానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సంబంధిత పోలీసు సిబ్బందే పేకాట శిబిరం నిర్వాహకులైన బెండి తులసీ, తాండ్ర తేజ, సీపాన శ్రీను, గోపీిలకు కొత్తగా రూట్‌మ్యాప్‌ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. ప్రతిరోజు స్థానిక కొత్తరోడ్డు నుంచి పేకాట నిర్వాహకులు కాపలాదారులతో పాటు పేకాటరాయుళ్లతో కలిసి వెళుతుండేవారు. ఎప్పుడైతే ‘సత్యం’ కథనాల ద్వారా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డికి ఈ విషయం తెలిసిపోయిందో... వీరు వెళ్లే కార్లను టెక్కలి, మెళియాపుట్టి, చాపర మీదుగా కాకుండా టెక్కలి, బెండిగేట్‌, టెక్కలిపట్నం మీదుగా గారబందకు వెళ్లాలని సూచించారని తెలిసింది. అప్పటి వరకు రోజుకు రూ.5వేలు ఇచ్చే పేకాట నిర్వాహకులు రూట్‌మ్యాప్‌ను ఇచ్చిన తర్వాత వారానికి రూ.70వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.

గత నాలుగు నెలలుగా ప్రతి రోజు జిల్లా కేంద్రం నుంచి జిల్లా సరిహద్దులు దాటి ఒడిశాలో పేకాట శిబరాలను నిర్వహిస్తున్నవారికి సరిహద్దులో ఉన్న జిల్లా పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు అందుకే వినిపిస్తున్నాయి. పేకాట నిర్వాహకుల్లో ప్రధాన వాటాదారుడైన మాజీ సైనికుడుగా చెప్పుకుంటున్న తాండ్ర తేజ తన వద్దకు పేకాడడానికి వచ్చిన మెళియాపుట్టి మండలం బందపల్లికి చెందిన ఒక యువకుడిపై తన మనుషులతో దాడి చేయించినట్టు తెలిసింది. పేకాడుతున్న సందర్భంలో యువకుడి కాలు తేజకు తగలినందుకు సదరు యువకుడిపై విచక్షణారహితంగా దాడిచేశారట. దీనికి ప్రతిగా సదరు యువకుడు టెక్కలిలో గత కొద్ది రోజులుగా ప్రతిదాడి చేయడానికి బందపల్లికి చెందిన యువకులతో కలిసి కాపుకాసినట్టు తెలిసింది. దీంతో టెక్కలి నుంచి బందపల్లి, మెళియాపుట్టి మీదుగా వీరు వెళ్లడం మానేశారు. ప్రతిదాడి భయంతో తాండ్ర తేజ ఒడిశాలోని గారబంద పేకాట శిబిరానికి వెళ్లడం మానేశాడని తెలిసింది. బాధితుడు మాత్రం ఇప్పటికీ డిప్రెషన్‌లోనే ఉంటూ ఇంటికి వెళ్లడంలేదని తెలిసింది. ఇప్పటి వరకు తల్లిదండ్రులే తనపై చేయి చేసుకోలేదని, అలాంటిది వేరొకరు తనపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది. దీంతో బెండి తులసీ, సీపాన శ్రీను, గోపీకృష్ణ మాత్రమే రోజు 30 మంది కాపలాదారులతో బెండిగేటు మీదుగా టెక్కలిపట్నం నుంచి గారబందకు ఐదు కార్లలో వెళుతున్నట్టు తెలిసింది. బెండి తులసీ తన మామను వెంట తీసుకువెళ్లి రోజుకు రూ.2వేలు ఇస్తున్నట్టు తెలిసింది. కొత్తరోడ్డు నుంచి వెళుతున్న 30 మంది కాపలాదారులకు ఒక్కొక్కరికీ రూ.1500 ఇస్తున్నారని వినికిడి. లాభం వచ్చిన రోజు అదనంగా మరో రూ.వెయ్యి ఇస్తున్నారని సమాచారం. వీరికి తోడుగా నగరానికి చెందిన ధర్మాన శ్రీను, చల్లా రాజును తీసుకువెళుతున్నారు. వీరిలో చల్లా రాజుకు స్పాట్‌లో రూ.10 వడ్డీకి డబ్బులు ఇచ్చే దందా అప్పగించారని తెలిసింది. మొత్తం 18 వాటాలతో ప్రస్తుతం నడుస్తున్న గారబంద పేకాట శిబిరంలో తులసీ, తేజ, శ్రీనులకు 8 వాటాలు ఉండగా, గోపికృష్ణకు ఒక్క వాటా ఉన్నట్టు తెలిసింది. మిగిలిన వాటాలు నరసన్నపేటకు చెందినవారివిగా తెలిసింది. ఈ విషయాలన్నీ పాతపట్నం పోలీసు సర్కిల్‌ పరిధిలో పోలీసు సిబ్బందికి తెలిసే జరుగుతున్నా రోజువారీ చెల్లింపుల కారణంగా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page