పోలీసు బదిలీలు పూర్తికావడంతో మళ్లీ మొదలు
నిర్వాహకుల కార్లకు గ్రీన్‌సిగ్నల్
ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి తరలింపు
గత పాలకులతో అంటకాగిన బ్యాచ్ ఆగడాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గతంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడుకొని మంత్లీలు ఫిక్స్ చేసుకొని పేకాడిరచిన బృందాలు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పేకదస్తాల ముసుగులో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా గంజాయిని రవాణా చేస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. కొత్త ఎస్పీగా మహేశ్వర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొద్ది రోజులు స్తబ్ధుగా ఉన్న పేకాట నిర్వాహకులు ఇప్పుడు పేకాట కంటే గంజాయి లాభసాటి వ్యాపారంగా గుర్తించి, దాన్ని రవాణా చేస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లా నుంచి పేకాడేవారిని అటు ఒడిశా బోర్డర్‌కు తరలించి రోజుల తరబడి ఆడిరచిన తర్వాత తిరుగుప్రయాణంలో అదే కారులో గంజాయిని జిల్లాకు తీసుకువస్తున్నట్టు తెలుస్తుంది. ఇంత నిఘా ఉన్నచోట గంజాయిని జిల్లాకు తరలించడం అంత సులువా అన్న ప్రశ్న తలెత్తక మానదు. కాకపోతే పేకాడటానికి జనాలను తరలిస్తున్న కార్లు, వాటి నెంబర్లు ముందుగానే పోలీసులకు చెప్పి ఎక్కడా వాటిని అడ్డకుండా పంపించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి పేకాడటానికి వెళ్తున్నవారి కారులో పెద్ద ఎత్తున డబ్బులు మాత్రమే ఉంటాయని, పేకాడుతుండగా పట్టుకోవడం మినహా మరో విధంగా కేసు నమోదు చేయలేమని చెప్పుకొస్తున్న పోలీసులు నిర్వాహకులు ఇస్తున్న కారు నెంబర్ల ప్రకారం ఎక్కడా చెకింగ్ లేకుండా వదిలేస్తున్నారు. దీంతో అదే కార్లలో గంజాయిని కూడా తరలిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఇటీవల గంజాయి సరఫరా చేస్తున్నవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపినా, పేకాట ముసుగులో తరలిపోతున్న గంజాయి మీద మాత్రం దృష్టి వెళ్లకపోవడానికి ప్రధాన కారణం డిపార్ట్‌మెంట్ వారి సహకారమే.
జిల్లా సరిహద్దులు దాటి పేకాట ఆడిరచడంలో జిల్లాలో కొందరికి రెండు దశాబ్ధాల అనుభవం ఉంది. జిలా పోలీసులు రైడ్ చేసిన ప్రతిసారి సరిహద్దులు దాటి వెళ్లి పేకాట ఆడిస్తుంటారు. వీరికి ఒడిశా, నేపాల్, గోవా తదితర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహించే అనుభవం ఉంది. కాసినో ఆడే అలవాటు వీరందరికీ ఉంది. అందరూ ఇక్కడి నుంచే కట్టకట్టుకొని వెళ్లి ఆ ప్రాంతంలో ఉన్నవారితో కలిసి రోజుల పాటు పేకాట ఆడుతుంటారు. అప్పుడప్పుడూ జిల్లా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఒడిశాకు చెందిన గ్రామాల్లో పేకాట శిబిరాన్ని ఏర్పాటుచేస్తారు. రోజూ ఒకేచోట కాకుండా రెండుమూడు చోట్ల మారుస్తూ శిబిరాలను నిర్వహిస్తుంటారు. దీనికోసం ఒడిశా, జిల్లా సరిహద్దు ప్రాంతంలోని పోలీసు అధికారులను కలిసి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పేకాట ఆడిస్తారు. ప్రస్తుతం జిల్లా పోలీసు ఉన్నతాధికారి తనదైన శైలిలో పనిచేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఉన్నతాధికారుల పనితీరుతో జిల్లాలో అనేక అంశాల్లో మార్పులకు శ్రీకారం చుట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవేవీ కొందరు దిగువ స్థాయి పోలీసు అధికారులకు పట్టడం లేదు. గతంలో పనిచేసిన ఉన్నతాధికారికి నెలవారీ మామూళ్లు ఇచ్చి ఆయా సర్కిల్స్ పరిధిలో ఇష్టారీతిగా వ్యవహరించి అక్రమార్కులను ప్రోత్సహిస్తూ వచ్చారు. కొన్ని రోజులుగా స్థబ్ధతగా ఉన్న పేకాటరాయుళ్లు మళ్లీ శిబిరాలను ప్రారంభించారు. ఇంతకు ముందు జిల్లా పోలీసు అధికారికి తెలిసి జరిగేవి. అందుకు అనుగుణంగా మంత్లీలు ముట్టజెప్పేవారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లాకు కొత్త పోలీస్‌బాస్ వచ్చారు. అన్ని సర్కిల్ కార్యాలయాలకు, స్టేషన్లకు పోలీస్ అధికారులు వచ్చారు. వీరిలో కొందరికి పేకాటరాయళ్లతో ఉన్న పాతపరిచయాలతో స్థానికంగా ఉన్న ఎస్‌బీ కానిస్టేబుల్స్‌తో మాట్లాడి వ్యవహారం వెలుగులోకి రాకుండా మేనేజ్ చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో పేకాట శిబిరాల ఏర్పాటుకు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా నుంచి వచ్చే జూదగాళ్ల కార్లకు ఆటంకం లేకుండా చూడడానికి పోలీసులకు ఆయా స్టేషన్‌ల వారీగా డబ్బులు ఇస్తున్నారని తెలిసింది. విశాఖ నుంచి వచ్చే పేకాటరాయుళ్లు కార్లలో గంజాయిని సరఫరా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పేకాట పేరుతో గంజాయిని ఒడిశా నుంచి కొనుగోలు చేసి వారి వెంట తీసుకువెళుతున్నట్టు తెలిసింది.
పేకాట శిబిరాలు నిర్వహించే వారిలో ఆమదాలవలస, నరసన్నపేటకు చెందినవారే అధికం. ఆమదాలవలస మండలం అక్కివరం పంచాయతీ గోపీనగరానికి చెందిన బెండి తులసి, అక్కివరానికి చెందిన సీపాన శ్రీను, మాజీ ఆర్మీ ఉద్యోగి తాండ్ర తేజేశ్వరరావు, నరసన్నపేటకు చెందిన సీహెచ్ గణేష్ (గన్నీ), నాగరాజు, కుమార్‌లు ప్రధాన సూత్రధారులని పేకాట సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. వీరంతా నరసన్నపేట నుంచి జలుమూరు, ఆమదాలవలస, పాలకొండ, పార్వతీపురం మీదుగా మన్యం జిల్లాలోని గోచెక్క, ఒడిశాలోని కొరాపుట్ పరిధి అలమండలో పేకాట ఆడిస్తున్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న గొచెక్కలో వారం రోజుల పాటు ఆట నిర్వహించి ప్రస్తుతం అలమండలో ఆట సాగిస్తున్నారు. వీరు అక్కడ పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి కొరాపుట్ పోలీసు అధికారితో మాట్లాడి వ్యవహారం సెట్ చేశారని తెలిసింది. గోపీనగరానికి చెందిన బెండి తులసి, నరసన్నపేటకు చెందిన గన్ని ప్రధాన పాత్రధారులు. గతంలోనూ వీరు అనేక సందార్భల్లో పేకాట ఆడిస్తుండగా పోలీసులకు చిక్కినా వారిచ్చే మామూళ్లు తీసుకొని విడిచిపెట్టేశారు. వీరు నేరుగా పోలీసు ఉన్నతాధికారులను కలిసి మంత్లీలు మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. ఆమదాలవలసకు చెందిన అప్పటి అధికార పార్టీ నాయకులతో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకొని పేకాట శిబిరాలను నిర్వహిస్తూ వచ్చారు. పోలీసులు చూసీచూడనట్టు విడిచిపెట్టేసేవారు. అందుకు ప్రతి నెల మంత్లీలు స్టేషన్ల వారీగా ఇస్తుండేవారు. ప్రస్తుతం నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పాలకొండ, పార్వతీపురం పోలీస్ స్టేషన్లకు మంత్లీలు చెల్లిస్తున్నారని తెలిసింది. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు ఆట ప్రారంభిస్తారు. సాయంత్రం 6 వరకు పేకాట ఆడి తిరిగి వచ్చేస్తారు. ప్రతి రోజు వీరు ఇదే పద్ధతిలో రాకపోకలు సాగిస్తుంటారు.
ఫకీర్ అనే వ్యక్తి పేకాట ఆడేవారిని సిద్ధం చేసి నరసన్నపేట, ఆమదాలవలస నుంచి పంపిస్తుంటారనే ఆరోపణలున్నాయి. అక్కడ నిర్వహణకు అవసరమైన డబ్బులను కారులో గన్నితో కలిసి నాగరాజు, కుమార్‌లు పేకాట శిబిరానికి తీసుకుని వెలుతుంటారని చెబుతుంటారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, విశాఖ నుంచి వచ్చేవారిని బెండి తులసి, సీపాన శ్రీను, తాండ్ర తేజేశ్వరరావు కార్లతో తీసుకొని వెళుతుంటారని భోగట్టా. శ్రీకాకుళం నుంచి పేకాట శిబిరానికి ఏపీ 40ఎన్ 0649, ఏపీ 39 ఆర్‌టీ 9291 వాహనాల్లో ప్రతిరోజు ఒడిశాలోని కొరాపుట్ జిల్లా అలమండకు వెలుతున్నారు. వీరికి ఎస్‌బీలోని ఒక అధికారి సహకరిస్తున్నారని తెలిసింది. పేకాట శిబిరాలను నిర్వహించడానికి పెద్ద మొత్తంలో ఏ రోజుకు ఆ రోజు డబ్బులు చెల్లిస్తున్నట్టు తెలిసింది. పేకాట ముసుగులో ఒడిశా నుంచి గంజాయిని విశాఖకు తరలిస్తున్నట్టు తెలిసింది. విశాఖ నుంచి పేకాట ఆడటానికి వచ్చే వారంతా తిరిగి వెళ్లే సమయంలో గంజాయినీ తీసుకు వెళుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో బెండి తులసీతో పాటు నరసన్నపేటకు చెందిన గన్ని (గణేష్) కీలక భూమిక పోషిస్తున్నారని వినికిడి. రానున్నవి అన్నీ పండగ రోజులు కావడం, దసరాకు 10 రోజుల పాటు సెలవులు వస్తుండడంతో పేకాట శిబిరాల నిర్వహణ ప్రారంభించారు. వీరంతా అనేక సందర్భాల్లో పేకాట ఆడిస్తూ, ఆడుతూ చిక్కారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో పోలీసులు విడిచిపెట్టేశారు. ప్రస్తుతం వీరే పేకాట శిబిరాల నుంచి గంజాయి రవాణా వరకు ఎదిగిపోయారు.
Comments