top of page

పీక నులిపేసిన బెట్టింగ్‌ భూతం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Mar 28
  • 2 min read
  • అలుదులో అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం

  • తమ్ముడి పరిస్థితి విషమం, అన్న మృతి

  • ఐపీఎల్‌ బెట్టింగులో రూ.45 లక్షలు కోల్పోయిన వైనం

  • గురువారం ‘పేట’లో వెలుగుచూసిన ఇంకో కథ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

బెట్టింగ్‌ ఉచ్చులో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన చెట్టు సూర్యనారాయణ, ఉమా మహేష్‌లు ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో వారం రోజుల వ్యవధిలో సుమారు రూ.45 లక్షలు పోగొట్టుకున్నట్టు తెలిసింది. బెట్టింగ్‌లో పొగొట్టుకున్న రూ.45 లక్షలు కూడా అప్పు రూపంలోనే తెచ్చినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. చేబదులుగా తీసుకువచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి పెరగడంతో తమ్ముడు ఉమామహేష్‌ బహిర్భూమికి వెళ్లి టాయ్‌లెట్‌ యాసిడ్‌ను సేవించి ఈ నెల 26న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఉమామహేష్‌ను రాగోలు జెమ్స్‌కు అదే రోజు రాత్రి తరలించారు. ఉమామహేష్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఉమామహేష్‌ సోదరుడు సూర్యనారాయణ జెమ్స్‌లోనే గురువారం సాయంత్రం తువ్వాలుతో ఉరి వేసుకున్నాడు. క్రికెట్‌ బెట్టింగ్‌ కోసం పెద్ద ఎత్తున అప్పు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని గ్రామంలో జోరుగా ప్రచారం సాగుతోంది. తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం అప్పులు ఇచ్చినవారికి తెలియడంతో వారంతా సూర్యనారాయణ మీద ఒత్తిడి పెంచారని విశ్వసనీయ సమాచారం. తమ్ముడు ఉమామహేష్‌ పరిస్థితి విషమంగా ఉందని జెమ్స్‌ వైద్యులు చెప్పడంతో అప్పుల భారం తన మీద పడుతుందని అన్న ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం సాగుతుంది. ఇద్దరూ గంటల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడంపై పోలీసులు సీరియస్‌గా తీసుకొని విచారణ ప్రారంభించారు. అన్నదమ్ములిద్దరూ కొన్నాళ్లు పాటు దుబాయ్‌లో వెల్డర్లుగా పని చేశారు. ప్రస్తుతం ఒక గ్రానైట్‌ క్వారీలో పని చేస్తున్నారు. సూర్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు, ఉమామహేష్‌కు ఇద్దరు కుమారులు. దుబాయ్‌లో పనిచేయడం వల్ల ఆర్ధికంగా స్థిరపడ్డారు. క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడి అప్పులపాలై అన్న సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకోగా, తమ్ముడు ఉమామహేష్‌ జెమ్స్‌లో కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు.

క్రికెట్‌ బెట్టింగ్‌కు బీజం వేసిన ఐపీఎల్‌ ప్రారంభమై వారం రోజుల్లోనే బెట్టింగ్‌కు పాల్పడి జిల్లాలో అనేక మంది యువకులు బాధితులుగా మారిపోయారు. కొందరు అవమాన భారంతో పైకి చెప్పుకోలేక అప్పులు తీర్చే పనిలో ఉండగా, ఇంకొందరు పోలీసులను ఆశ్రయించి అప్పుల బారి నుంచి బయటపడుతున్నారు. ఐపీఎల్‌ ప్రారంభంతోనే దేశవ్యాప్తంగా బెట్టింగులకు తెర లేచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యుయెన్సర్లపై కేసులు నమోదు చేయడంతో ఇన్నాళ్లూ దాక్కున్న స్థానిక బుకీలు ఇప్పుడు పురివిప్పారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడితే పోలీసులకు దొరికిపోతామని తెలుసుకున్న కొందరు యువకులు ఇప్పుడు స్థానిక బుకీల ద్వారా పాత పద్ధతిలోనే బెట్టింగులకు పాల్పడి సొమ్ములు కోల్పోతున్నారు. ఇంకా బెట్టింగ్‌ యాప్‌లు వినియోగించే వారిలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో ఉంది. దీనికి కారణం ప్రతి పట్టణంలోనూ యాప్‌లను ప్రమోట్‌ చేసి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నవారు ఉన్నారు. అందులో నరసన్నపేట మొదటి స్థానంలో ఉంది.

బెట్టింగుల రాజధాని నరసన్నపేట

ప్రపంచంలో ఎక్కడ క్రికెట్‌ పోటీ జరిగినా నరసన్నపేటలో బెట్టింగ్‌ నిర్వహిస్తుంటారు. ఒక్కడ ఒక ముఠాకు ఫకీరు అనే వ్యక్తి లీడ్‌ చేస్తున్నట్టు పేటలో జోరుగా ప్రచారంలో ఉంది. గతంలో ఫకీర్‌ బెట్టింగ్‌ ఆగడాలపై ‘సత్యం’ వరుస కథనాలు ప్రచురించింది. కొంత కాలం బెట్టింగ్‌ నిర్వహణ నిలిపేసి జూదం వైపు మరలిపోయాడు. దాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన తర్వాత వైజాగ్‌ వేదికగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. వీరి బారిన పడి నరసన్నపేటకు సమీపంలోని పెద్దపేటకు చెందిన ఒక బీటెక్‌ విద్యార్ధి రూ.లక్షల్లో అప్పులపాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడితో విద్యార్థి తన తండ్రికి తెలియకుండా తల్లి నుంచి రూ.50 లక్షలు తీసుకున్నట్టు తెలిసింది. దీనికి అదనంగా మరికొంత సొమ్ము ఇవ్వాలని తల్లిపై ఒత్తిడి చేయడంతో ఇవ్వడానికి ఆమె నిరాకరించినట్టు తెలిసింది. దీంతో విద్యార్థి చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో విషయం భర్తకు వివరించడంతో వారు స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఆయన జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page