ఉత్తరప్రదేశ్‌లో కొత్త నిబంధన
సభలో పాస్ చేసుకున్న వైనం
‘యాంటీ నేషనల్’ కంటెంట్ ఉంటే జైలే గతి

దుప్పల రవికుమార్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సరికొత్త ఆలోచన చేసారు. రోజురోజుకు పెరిగిపోతున్న సోషల్ మీడియా పోస్టుల తాకిడికి ఆయనకు బాగా చిర్రెత్తుకొచ్చినట్టుంది. విస్తృతంగా పెరిగిపోతున్న సోషల్ మీడియా ప్రచారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ప్రభుత్వ అధినేతలు ఇన్నాళ్లూ తల్లడిల్లిపోతున్నారు. దానికి విరుగుడు కనిపెట్టడం ఎలాగా అని తలకిందులు తపస్సు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. వెంటనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. బిల్లు ముసాయిదా రూపొందించారు. గుట్టుచప్పుడు కాకుండా పాస్ చేసేసారు. బిల్లు సారాంశం ఏమిటంటే ప్రభుత్వాన్ని పొగుడుతూ రాసిన వారికి ఎనిమిది లక్షల రూపాయల వరకూ బహుమానాలు ఇస్తారట. తమ పాలనను తెగుడుతూ రాసిన వారిని జైలుపాలు చేస్తారట. ఇది చదివిన వారికి పూర్వం రాజాశ్రయాలు గుర్తొస్తే ఆ తప్పు ఆయనదే. ఇలాంటి చిత్రమైన ఆలోచనలు నియంతలకే ఎలా పుడతాయబ్బా అని ప్రజాస్వామికవాదులు ఆశ్యర్యపోతున్నారు. మనకు గుంటూరు శేషేంద్రశర్మ వాక్యాలు గుర్తుకొస్తాయి. ‘మనం తుపాకీ తూటాలను ఎదుర్కోగలం. కాని నియంతలు ప్రశ్నల్ని ఎదుర్కోలేరు’.
మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం నూతన డిజిటల్ మీడియా ముసాయిదా 2024ను ఆమోదించింది. తమ ప్రభుత్వం చేపడుతోన్న అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి, సంక్షేమ పథకాల గురించి, రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తోన్న విజయాల గురించి ప్రజలకు వివరించడంలో ఈ ముసాయిదా బిల్లు ఎంతగానో తోడ్పడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ బిల్లు తయారుచేస్తున్నప్పుడే వివాదాస్పదం కావడం ఆరంభమయింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు (ప్రభావశీల సోషల్ మీడియా నిర్వాహకులు) వివిధ డిజిటల్ మాధ్యమాల ద్వారా తమకు సానుకూల కవరేజి ఇచ్చినట్లయితే తగిన పారితోషకం అందిస్తామని, అదే సమయంలో దీనికి భిన్నంగా ఎవరైనా సోషల్‌మీడియాలో ‘అభ్యంతరకరమైన’ లేదా ‘జాతీయ వ్యతిరేక’ సమాచారం పోస్ట్ చేసినట్లయితే, వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఈ బిల్లు విస్పష్టంగా చెబుతోంది. ఈ చట్టం గురించి తెలియజేస్తూ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్, ‘ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియా వార్తలు అశ్లీలంగా, ఏహ్యంగా, జాతీయత వ్యతిరేకంగా ఉండకూడదని, దానిని సహించబోమని’ స్పష్టం చేసారు.
పార్టీ విధేయులకు దోచిపెట్టడానికేనా?
ఆగష్టు 27వ తేదీన యుపి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన ఈ న్యూ డిజిటల్ మీడియా పాలసీ, 2024 బిల్లులో సోషల్ మీడియా వేదికలను నిర్వచించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (మునుపు ట్విట్టర్), యూట్యూబ్‌లతో పాటు బ్లాగులు, సొంత వెబ్‌సైట్లను ఈ సమూహంలో చేర్చారు. ఇలాంటి సమాచారాన్ని వాట్సప్, మెసెంజర్, టెలిగ్రాం వంటి వివిధ రకాల యాప్‌ల ద్వారా తమ స్నేహితులకు, బంధువులకు, పలు గ్రూపులకు పంపించే (వైరల్ చేసే) మెసేజింగ్ యాప్‌లుగా గుర్తించారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఇవే మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లకు ప్రకటనలు ఇవ్వడం వంటి ప్రోత్సాహకాలు అందివ్వనున్నట్టు బిల్లులో పొందుపరిచారు. ప్రభుత్వ పథకాలను, విజయాలను సానుకూలంగా చిన్న చిన్న వీడియోల ద్వారా ప్రచారం చేసేవారికి నెలకు ఎనిమిది లక్షల రూపాయల వరకు పారితోషకాలు అందివ్వనున్నట్టు బిల్లు చెప్తోంది. తమ రాష్ట్రానికి చెందినవారు దేశంలో ఎక్కడున్నా ఈ సానుకూల ప్రచారం చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పొందవచ్చని ముఖ్య కార్యదర్శి వివరించారు.
ఈ డిజిటల్ మీడియా వేదికలు నిర్వహించేవారు వ్యక్తులైనా కావచ్చు. సంస్థలైనా కావచ్చు. విడిగా ఆ ప్లాట్‌ఫారానికి ఉండే చందాదారులు (సబ్‌స్క్రైబర్లు), అనుసరించే (ఫాలోవర్స్) వారిని బట్టి ఈ ప్రభావశీలురను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నిర్వహించేవారు వారి సామర్ధ్యాన్ని బట్టి 3 నుంచి 5 లక్షల రూపాయల వరకూ ప్రతి నెలా ఆర్జించవచ్చని ఆయన ప్రకటించారు. అదేవిధంగా వివిధ రకాల పాడ్‌కాస్టులు, వీడియోలు, స్వల్వ విరామ వీడియోలు (రీల్స్, షార్ట్స్ వంటివి) ఏ మాధ్యమంలో ప్రసారం చేసినప్పటికీ విధిగా నెలకు ఎనిమిది లక్షల రూపాయల వరకూ పారితోషకంగా అందుకోవచ్చని తెలుస్తోంది. యూట్యూబ్ చానెళ్లను కంటెంట్‌ను బట్టి, చందాదారులను బట్టి, ఆయా చానెళ్లకుండే విశ్వసనీయతను బట్టి వివిధ కేటగిరీలుగా విభజించారు. వీరు కూడా ప్రతి నెలా 4 నుంచి 6 లక్షల రూపాయల వరకూ ఆదాయం సంపాదించవచ్చని ప్రకటించారు.
దేశానికి దిక్సూచి కానుందా!
ఇది కేవలం సోషల్ మీడియా నిర్వాహకులను ఆకట్టుకునేందుకు చేస్తున్న వృధా ప్రయత్నమని బీజేపీ ప్రభుత్వాన్ని దుమ్మెతిపోస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును నిరంకుశ బిల్లుగా అభివర్ణించింది. ఇప్పుడు ఎలాంటి జంకుబొంకు లేకుండా సోషల్ మీడియాని లొంగదీసుకోవడానికి నిస్సిగ్గుగా చేస్తున్న ప్రయత్నమని, దీనివల్ల ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని యుపి కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. కేవలం సోషల్‌మీడియా ఆధారంగా ఇప్పటికే వాట్సప్ యూనివర్శిటీని రూపొందించిన బీజేపీ ఐటి సెల్ అర్థసత్యాలను, అసత్యాలను పుంఖానుపుంఖాలుగా ప్రచారం చేస్తోందని, ఇప్పుడు ఎదురు డబ్బులివ్వడం ద్వారా ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ ఆందోళనను కొట్టిపడేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రచారకుడు రాకేష్ త్రిపాఠి మాట్లాడుతూ కాంగ్రెస్ అర్థం లేని భయం వ్యక్తం చేస్తోందన్నారు. సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులను అనుసరించి తమ పార్టీ ఈ నూతన డిజిటల్ మీడియా పాలసీని రూపొందించిందని తెలిపారు.
‘మంచిపని’ చేసేవారిని ప్రోత్సహిస్తూ వివిధ రూపాలలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఆదాయం సంపాదించుకునేటట్లు చేసే ఉద్యోగ కల్పన తాము చేపడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తమ ‘చెడ్డ రాతల’ ద్వారా వదంతులు ప్రచారం చేస్తూ, మత సామరస్యాన్ని ధ్వంసం చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రాతలు కోతలు రాసేవారి పట్ల కఠినంగా ఉండబోతున్నట్టు ఆయన శెలవిచ్చారు. దేశంలో అనేక రాష్ట్రాలు తాము వేసిన బాటలో నడవనున్నట్టు ఆయన ధీమా వ్యక్తం చేసారు.
Comments