top of page

ప్చ్‌.. శ్రీకాకుళం ఇంకా మారలేదు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Nov 2, 2024
  • 2 min read
  • ఐదేళ్ల వెనుకబాటుపై బాబు పెదవి విరుపు

  • అరసవల్లి ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌

  • రింగ్‌రోడ్డుకు నిధులివ్వాలన్న ఎమ్మెల్యే

  • కొత్త నాయకత్వానికే బాబు ఓటు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

శ్రీకాకుళం జిల్లా కేంద్రం ఇంకా ఇలానే ఉందా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిట్టూర్చారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన కొన్ని ప్రాంతాలను పరిశీలించి శ్రీకాకుళం ఇంకా అభివృద్ధి చెందకపోవడం బాధాకరంగా ఉందని, 2014`19 మధ్యలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కోసం ఇచ్చిన నిధులతో ఇప్పటికీ కలెక్టరేట్‌ పూర్తికాకపోవడం చూస్తుంటే మిగిలిన అభివృద్ధి పనుల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురంలో ఉచిత గ్యాస్‌ సిలెండర్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబునాయుడు శుక్రవారం రాత్రి స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రకు ప్రాతినిధ్యం వహించినప్పుడు తమ పాలనలో ఏ పనులు జరిగాయో ఇప్పటికీ వాటినే పూర్తి చేయకపోవడం, గడిచిన ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పనీ కొత్తగా నమోదు కాకపోవడం జిల్లా కేంద్రంలో తనకు కనిపించిందని చంద్రబాబు అన్నారు. పక్కనే ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో మాట్లాడుతూ ఆయన ఎంపీ సెగ్మెంట్‌లో జిల్లా కేంద్రం కీలకం కాబట్టి సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళికలను దూరదృష్టితో రూపొందించాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని చంద్రబాబు తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు గొండు శంకర్‌ మాట్లాడుతూ అరసవల్లిని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, కాకపోతే అందుకు పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయని, వాటిని ఎలా సమకూర్చుకోవాలన్నదానిపై తనకు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడుకు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుకు అవగాహన ఉందని, అవకాశమిస్తే వివరిస్తారన్నారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ నిరభ్యంతరంగా చెప్పాలని కోరడంతో అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ రికార్డుల ప్రకారం 58 ఎకరాలు నగరం నడిబొడ్డున ఉన్నాయని, అందులో అనేక భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ఆ మేరకు నిధులు అందజేయాలని కోరారు. 58 ఎకరాలు అమ్మితే ఎంత వస్తుందని చంద్రబాబు ప్రశ్నించడంతో రూ.100 కోట్లు పైబడి ధర పలుకుతుందని చెప్పారు. దీంతో ఆశ్చర్యపోవడం చంద్రబాబు వంతయింది. అన్ని నిధులతో ఒక్క అరసవల్లే కాదని, నగరానికి శాశ్వత ప్రాజెక్టులు కొన్ని నిర్మించవచ్చని, దీని మీద దృష్టి సారించాలని రామ్మోహన్‌నాయుడును కోరారు. 58 ఎకరాల్లో ఫలసాయం కింద కొంత మొత్తం ఆలయానికి వస్తుందని, దానితో కొందరి జీతభత్యాలు ఒడ్డెక్కుతున్నాయని, వారికి జీతాలు ప్రభుత్వం వైపు నుంచి చెల్లించే ఏర్పాట్లు చేస్తే అరసవల్లి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందుతుందన్నారు. శ్రీకూర్మం ఆలయ అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రసాదం ప్రాజెక్టు నుంచి నిధులు మంజూరు చేసే వెసులుబాటు ఉందని, అయితే ఇందుకు దేశవ్యాప్తంగా పోటీ ఉన్నందున ముఖ్యమంత్రి చొరవ చూపించాలని గొండు శంకర్‌ కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ 2014`19 మధ్య రింగ్‌రోడ్డు కోసం ప్రతిపాదనలు వచ్చాయని, ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం నిధులు మంజూరు గడిచిన ఐదేళ్లలో జరగలేదా? అని ఆరా తీశారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా అప్పట్లో అటకెక్కిపోయిందని, ప్రభుత్వం నుంచి నిధులిస్తామంటే దాన్ని పట్టాలెక్కిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి తెలిపారు. రింగ్‌రోడ్డు ద్వారానే నగరం అభివృద్ధి చెందుతుందని, ఇందుకు సంబంధించి ముందుకే వెళ్లాలని చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యేకు సూచించారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నవారితోనే పార్టీ భవిష్యత్‌ ప్రయాణం కొనసాగిస్తుందన్న సంకేతం చంద్రబాబు పర్యటన ద్వారా శుక్రవారం ఇవ్వగలిగారు. జిల్లాలో కొందరికి టిక్కెట్లను ఇవ్వడం మంచి నిర్ణయమేనని చంద్రబాబు మరోసారి బలంగా చెప్పారు. శ్రీకాకుళంలో గెలుపుగుర్రాలైన గొండు శంకర్‌, మామిడి గోవిందరావులకు టిక్కెటిచ్చి తాను తప్పు చేయలేదని నిరూపించానని, ఇద్దరూ నిరంతరం ప్రజల్లో మమేకమై పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఇక 20 ఏళ్లుగా పార్టీ ఏ పని చెబితే ఆ పని చేసిన కలిశెట్టి అప్పలనాయుడుకు ఎంపీ టిక్కెటేమిటని చాలామంది ప్రశ్నించారని, కానీ ఇప్పుడు అప్పలనాయుడుకు డబుల్‌ జాక్‌పాట్‌ తగిలిందని, రెండు జిల్లాల్లో నియోజకవర్గాలకు ఎంపీగా ఉండటం చిన్న విషయం కాదన్నారు. గతంలో ఎప్పుడు జిల్లా పర్యటనకు వచ్చినా రాజకీయాలకు దూరంగా ఉన్న టీడీపీ నాయకులను కలవడమో, లేదూ అంటే పిలిపించుకొని మాట్లాడటమో చేసేవారు. కానీ ఈసారి స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడి పేరునే చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించినట్లు కనపడలేదు. అలాగే మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ దంపతుల పేరును కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అరసవల్లి ఆలయ అభివృద్ధి టాపిక్‌ నడిచినా, ఎక్కడా వీరిద్దరి పేర్లను చంద్రబాబు తెర మీదకు తీసుకురాలేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న నాయకత్వం బలంగా ఉందన్న భావనతోనే ఉన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page