పీజీ కలెక్షన్లపై ఆర్డీవో దర్యాప్తు
- NVS PRASAD

- Apr 9
- 1 min read
రూ.13,500 చొప్ప్పున 23 మంది నుంచి వసూలు
అయినా రెండు రోజుల క్రితం వరకు ఇవ్వని రిలీవ్ ఆర్డర్లు
డీఎంహెచ్‌వో విచారిస్తే న్యాయం జరగదన్న బాధితుడు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ పరిధిలో మెడికల్ ఆఫీసర్లుగా పని చేస్తూ ఇటీవల పోస్టుగ్రాడ్యుయేషన్‌కు ఎంపికైన 23 మంది వైద్యుల నుంచి సొమ్ములు వసూలుచేశారని ప్రజా గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష విచారణ జరుపుతున్నారు. ఈమేరకు 23 మంది పీజీకి వెళ్తున్న వైద్యులను, కార్యాలయంలో ఈ సీటు చూస్తున్న సీనియర్ అసిస్టెంట్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ కె.శివకుమార్, ఏవో బాబూరావులను ఆమె ఇప్పటికే విచారించారు. తాజాగా సంబంధిత వైద్యాధికారుల వద్ద గుమస్తాలుగా పని చేస్తున్నవారిని సాయిప్రత్యూష విచారించనున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇక్కడ వివిధ పీహెచ్‌సీల్లో వైద్యులుగా సేవలందిస్తున్నవారిలో 23 మందికి పోస్టుగ్రాడ్యుయేషన్ చేయడానికి అవకాశం వచ్చింది. వీరికి సర్వీస్ కోటా వర్తిస్తుంది. కాబట్టి డీఎంహెచ్‌వో పైచదువులకు రిలీవ్ ఆర్డీర్స్ ఇవ్వాల్సివుంటుంది. ఇందుకోసం డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది ఒక్కో వైద్యుడి దగ్గర నుంచి రూ.13,500 చొప్ప్పున వసూలు చేశారని కొద్ది రోజుల క్రితం కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్‌కు మెట్టూరు పీహెచ్‌సీలో వైద్యుడిగా పని చేసిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలంటూ డీఎంహెచ్‌వో డాక్టర్ కె.అనితకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అసలు ఈ కలెక్షన్లకు మూలకారణమే అక్కడి ఉన్నతాధికారులని, దీనిపై డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఎవరు విచారణ చేపట్టినా వాస్తవాలు వెలుగులోకి రావంటూ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో శ్రీకాకుళం ఆర్డీవో ప్రత్యూషను ఇందుకు నియమించారు. ఈమేరకు ఆమె మినిస్టీరియల్ సిబ్బంది, బాధితుల నుంచి రెండు రోజుల క్రితమే స్టేట్‌మెంట్ తీసుకున్నారు. పీజీలో సీటు వచ్చిన వెంటనే హెల్త్ డైరెక్టర్‌కు ఒక నోట్ పెట్టి ఈ 23 మందికి రిలీవ్ ఆర్డర్స్ ఇవ్వాల్సివుంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.13,500 చొప్ప్పున రేట్ ఫిక్స్ చేశారు. దీన్ని చెల్లించిన తర్వాత కూడా తమనెందుకు రిలీవ్ చేయలేదని అడిగితే కసురుకోవడం, అవమానకరంగా మాట్లాడటం వంటివి చేయడంతో ఆత్మాభిమానం దెబ్బతిన్న మెట్టూరు డాక్టరు నేరుగా ప్రజాగ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.






Comments