పంజాబ్ కింగ్స్ ‘వ్యూహాత్మక’ దాడుల వెనుక కుట్ర?
- SATYAM DAILY
- May 13
- 1 min read
నోరు విప్పిన ప్రీతి జింటా
వరుస ఓటములతో సతమతమవుతున్న జట్టు
తప్పుడు ప్రచారాలు, బాధ్యతారాహిత్యం పై ఫ్రాంచైజీ యజమాని హెచ్చరిక

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆరంభంలో అజేయంగా దూసుకెళ్లి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ప్రయాణం ప్రస్తుతం ఒడిదొడుకులకు లోనవుతోంది. వరుసగా నాలుగు ఓటములు జట్టును ఆందోళనకు గురిచేస్తుండగా, అంతకంటే ఎక్కువగా బయట జరుగుతున్న ‘వ్యూహాత్మక తప్పుడు ప్రచారం’ యజమాని ప్రీతిజింటాను ఆగ్రహానికి గురిచేస్తోంది.
విజయం అంచున బోల్తా..
ఒకప్పుడు వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో పతనం ప్రారంభమైంది. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్ తప్పిదాలు, బౌలింగ్ వైఫల్యం జట్టును దెబ్బతీశాయి. ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోవడంతో ప్లేఆఫ్ రేసు రసవత్తరంగా మారింది.
దుష్ప్రచారంపై ప్రీతి జింటా ఘాటు స్పందన
జట్టు ప్రదర్శన తగ్గిపోవడంతో, డ్రెస్సింగ్ రూమ్‌లో క్రమశిక్షణా సమస్యలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రీతి జింటా గట్టిగా స్పందించారు.
“ఆటపై విమర్శలను మేము స్వాగతిస్తాం, కానీ జట్టు ప్రతిష్టను దెబ్బతీసేలా చేసే కుట్రపూరిత ప్రచారాలను సహించం. ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు మీడియా నిపుణులు బాధ్యతగా వ్యవహరించాలి.”
- ప్రీతి జింటా (ట్విట్టర్ వేదికగా)
ఫ్రాంచైజీ స్పష్టీకరణ
కేవలం ‘సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట’ కోసం అబద్ధాలను వండకూడదని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. “చౌకబారు పబ్లిసిటీ కోసం కల్పిత గాథలను సృష్టించడం క్రీడా స్ఫూర్తికే విరుద్ధం” అని ఫ్రాంచైజీ పేర్కొంది.
ముంబైతో ‘ముఖాముఖి’.. ప్లేఆఫ్ ఆశలు సజీవం!
ప్రస్తుత ఒత్తిడిని పక్కన పెట్టి, ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగే కీలక పోరుకు పంజాబ్ సిద్ధమవుతోంది. ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ, పంజాబ్‌కి ప్లేఆఫ్ చేరాలంటే ఈ విజయం అనివార్యం. వరుస ఓటములకు చెక్ పెట్టి, విమర్శకుల నోళ్లు మూయించాలని ‘కింగ్స్’ పట్టుదలతో ఉన్నారు.
- సత్యం స్పోర్ట్స్ డెస్క్






Comments