top of page

పాతికేళ్ల ఓటు.. లేకుంటే వేటు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 25
  • 4 min read
  • ఇదే ‘సర్ ’ కార్యక్రమం ప్రత్యేకత

  • ఆనాటి జాబితాలతో సరిపోల్చడం తలకుమించిన భారం

  • చిరునామాలు దొరక్క బీఎల్‌వోలు..

  • వారెవరో తెలియక ఓటర్ల అవస్థలు

  • 2002 జాబితాతో సరిపోలకపోతే అంతే సంగతులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఓ యువకుడు మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలోని ఓ వార్డు సచివాలయానికి వచ్చి తమ కుటుంబ ఓట్ల గురించి ఆరా తీయడం కనిపించింది. ఆయన ప్రస్తావించిన సమస్య కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా రివిజన్(సర్) కార్యక్రమంలోని సంక్లిష్టతను ఎత్తిచూపింది. బీహార్‌కు చెందిన ఆ యువకుడి కుటుంబం చాలా ఏళ్ల క్రితమే ఉపాధి రీత్యా శ్రీకాకుళం ప్రాంతానికి మైగ్రేట్(వలస) అయ్యి.. ఇక్కడే స్థిరనివాసం ఉంటున్నది. ఆ ఇంటివారందరూ ఓట్లు, ఆధార్ కార్డులు ఇక్కడికే మార్పించుకున్నారు. కానీ ప్రస్తుతం చేపట్టిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితాను పోల్చి చూసి మొత్తం జాబితాను ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పుడు యువకుడి సమస్య ఏంటంటే.. 2002 నాటికి ఆయనకు ఓటు హక్కు లభించలేదు. ఆయన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు అప్పట్లో బీహార్‌లోని స్వగ్రామంలో ఓట్లు ఉన్నా.. రెండేళ్ల క్రితమే ఆ రాష్ట్రంలో నిర్వహించిన సర్ కార్యక్రమంలో స్థానికంగా లేనందుకు వారి ఓట్లను తొలగించేశారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కుటుంబానికి ఇక్కడ ఓట్లు ఉన్నా కూడా వాటిని నిర్థారించి మ్యాపింగ్ చేసే పరిస్థితి లేదు. ఫలితంగా వారి ఓట్లపై వేటు పడటం తథ్యంగా కనిపిస్తున్నది.

పాతికేళ్ల తర్వాతా?.. ఎంత కష్టం

ఇది ఒక్క బీహారీ కుటుంబ సమస్యే కాదు. వేలు, లక్షల మంది ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్య.. అంతకుమించిన ధర్మసంకటం. ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మనకంటే ముందు బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర పలు రాష్ట్రాల్లో నిర్వహించి సర్ ప్రక్రియలో ప్రతి రాష్ట్రంలో లక్షలాది ఓట్లు గల్లంతు కావడానికి ఎప్పుడో పాతికేళ్ల క్రితం జరిగిన సర్ తర్వాత రూపొందించిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోవడమే దీనికి కారణం. మనిషి జీవితంలో పాతికేళ్లు అంటే దాదాపు మూడోవంతు కాలం. ఈ కాలంలో మనుషుల రూపురేఖలు మారిపోతాయి. సొంతిళ్లు, ఆస్తులు ఉన్నవారు తప్ప ఉద్యోగాలు చేసుకునేవారు, అద్దె ఇళ్లలో ఉన్నవారు ఇన్నాళ్లూ ఒకే చోట నివాసం ఉండటం సాధ్యం కాదు. ఇటువంటి వారందరూ ఊళ్లూ చిరునామాలు మారి, ఆ నివాసాల్లోకి కొత్తవారు చేరి ఉంటారు. అలాగే పాతికేళ్లలో జనాభా విపరీతంగా పెరిగింది. అభివృద్ధి వేగం పుంజుకుంది. చాలా గ్రామాలు పట్టణాలయ్యాయి. పట్టణాలు నగరాలయ్యాయి. ఇళ్ల స్థానంలో బహుళ అంతస్తుల భవనాలు, భారీ అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ఎవరికి ఎవరో అన్నట్లుగా సమాజ జీవనం తయారైంది. ఈ పరిస్థితుల్లో 2002 ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్ల మసిబారిన ఫొటోలు, అప్పటి చిరునామాలు పట్టుకుని ఓటర్లను నిర్థారించాలన్న నిర్ణయమే అర్థం లేనిదిగా కనిపిస్తున్నది. ఇదే అవకాశాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయి. వీధుల్లోనూ, వార్డు పరిధుల్లోనూ తమ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని, తెలిసిన వారిని బీఎల్‌వోల ద్వారా నిర్థారింపజేసి మ్యాపింగ్ పూర్తి చేయిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ మద్దతుదారుల గురించి తెలిసినా కూడా బీఎల్‌వోలకు చెప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు నాయకులైతే వారెవరూ లేరని చెప్పి పంపేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఏటా చేస్తున్నారుగా.. మళ్లీ ఎందుకు?

ఈ నేపథ్యంలో పాతికేళ్ల గ్యాప్ తర్వాత సర్ కార్యక్రమం చేపట్టడమేమిటి? ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి ఎన్నికల కమిషన్ ఇస్తున్న వివరణలు కూడా ఆలోచించదగ్గవిగానే ఉన్నాయి. మనదేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని రెండు రకాలుగా నిర్వహిస్తున్నారు. మొదటిది స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్ ఎస్ ఆర్). దీన్నే వార్షిక సవరణ అని కూడా అంటారు. దీనిద్వారా ప్రతి ఏటా అక్టోబర్`జనవరి నెలల్లో ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ఆ సందర్భంగా 18 ఏళ్లు నిండిన వారందరూ కొత్త ఓటర్లుగా నమోదు కావచ్చు. అదే సమయంలో చనిపోయినవారిని తొలగించవచ్చు. చిరునామాలు మార్చుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియలో ఇంటింటి సర్వే ఉండదు. ఆసక్తి ఉన్నవారు, అవసరమైన వారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి తగిన మార్పులు చేర్పులు చేస్తారు. నవీకరించిన తుది జాబితాను ప్రతి ఏటా జనవరి నెలల్లో ప్రకటిస్తుంటారు. ఇక రెండోది ఇప్పుడు మనందరినీ ఇబ్బంది పెడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) మొదటి దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. నిత్యం చాలామంది చనిపోతుంటారు.. ఇంకెంతోమంది ఇతర ప్రాంతాలు, దేశాలకు వలస పోతుంటారు. చనిపోయినవారి పేర్లను జాబితాల నుంచి తొలగింపజేయడంపై కుటుంబ సభ్యులు శ్రద్ధ చూపరు. అలాగే వలస వెళ్లినవారు స్వగ్రామాలతోపాటు కొత్త ప్రాంతాల్లోనూ ఓటుహక్కు పొందుతున్న ఉదంతాలు చాలానే ఉంటున్నాయి. ఏటా జరిగే మార్పుచేర్పుల్లో ఇవి జరగకపోవడం వల్ల కొన్నేళ్లకు ఒకసారి ప్రత్యేక రివిజన్ చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి అవసరం ఏర్పడిందని ఎన్నికల కమిషన్ భావించినప్పుడు 1950 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 21 ప్రకారం స్పెషల్ రివిజన్ చేపట్టవచ్చు. చివరిసారి దేశంలో 2002లో ప్రత్యేక ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టగా అది 2004లో పూర్తి అయ్యింది. అప్పటి జాబితాను ఇప్పటి జాబితాతో సరిపోల్చుతున్నారు. ఇందులో తేడా వస్తే ఓట్లు రద్దయ్యే ప్రమాదముంది. అప్పుడు మళ్లీ కొత్త ఓటరుగా నమోదవ్వాలంటే ఫారం`6 ద్వారా దరఖాస్తు చేసుకోవడం, ధ్రువపత్రాల ద్వారా తమను తాము నిరూపించుకోవడం ఓటర్లకు పెద్ద తొలనొప్పిగా మారుతుంది.

అందరికీ ఇబ్బందే..

పాతికేళ్ల విరామం తర్వాత ఓటర్ల జాబితాను ప్రక్షాళించాలనుకోవడం అటు ఓటర్లకు, ఇటు కార్యక్రమం నిర్వహిస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్ల(బీఎల్‌వో)కు కూడా చుక్కలు చూపిస్తున్నది. చాలామంది బీఎల్‌వోలు వీధి మొదలు ప్రాంతాలు, కమ్యూనిటీ  హాళ్లు, ఓపెన్ ప్లేసుల్లో కూర్చుని అక్కడికి వచ్చిన వారికి మాత్రమే ఎన్యూమరేషన్ పారాలు ఇచ్చి ఓట్ల నిర్ధారణ తతంగం ముగిస్తున్నారు. మరికొందరు మాత్రం పాత, ప్రస్తుత ఓటర్ల జాబితాలను పట్టుకుని క్షేత్రస్థాయికి వెళ్తుంటే ఓటర్ల వివరాలు ట్రేస్ చేయడం ఒకపట్టాన సాధ్యం కావడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో పడి తిరుగుతున్నా రోజుకు పట్టుమని పది పదిహేను ఓట్లు కూడా నిర్ధారణ కావడం లేదని అంటున్నారు. తన పరిధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో 50 ఫ్లాట్లు ఉన్నాయని, ఒకేసారి వారిందరి నిర్థారణ జరిగిపోతుందని భావించి వెళితే పది ఓట్లు కూడా మ్యాపింగ్ కాలేదని ఒక బీఎల్‌వో వివరించారు. ఉదయమంతా రోడ్ల మీద తిరుగుతూ మ్యాపింగ్ చేసిన ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను అదేరోజు సాయంత్రం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి వస్తున్నదని, పైగా ప్రతిరోజు దీనిపై ఉన్నతాధికారుల సమీక్షలు, రోజువారు రెగ్యులర్ విధులు బీఎల్‌వోలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో కనీసం వెయ్యి ఓట్లు ఉంటాయి. అంటే ప్రతి బీఎల్‌వో తనకు ఇచ్చిన నెలరోజుల వ్యవధిలో ఆ వెయ్యిమంది ఓటర్లను నిర్థారించి మ్యాపింగ్ చేసి, ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. అయితే పగలూరాత్రీ కష్టపడుతున్నా రోజుకు పది ఓట్లను కూడా మ్యాపింగ్ చేయడం కనాకష్టంగా ఉంటున్నదని, ఇప్పటికే పదిరోజులు పూర్తి కాగా తనకు కేటాయించిన వెయ్యి ఓట్లలో 80 మాత్రమే మ్యాపింగ్ చేయగలిగానని ఒక బీఎల్‌వో చెప్పారు. బీఎల్‌వోల కష్టాలు ఇలా ఉంటే.. ఓటర్ల కష్టాలు మరోలా ఉన్నాయి. చాలామందికి సర్ ప్రాముఖ్యతపై పూర్తి అవగాహన లేదు. అవగాహన ఉన్నవారు ఎన్యుమరేషన్ ఫారాల కోసం, బీఎల్‌వోల కోసం ఎదురుచూస్తున్నా చాలా ప్రాంతాలకు ఇంకా బీఎల్‌వోలు చేరుకోలేదని ఫిర్యాదులు అందుతున్నాయి. మరోవైపు తాము కాళ్లరిగేలా తిరుగుతున్నా ఓటర్ల చిరునామాలు చిక్కడంలేదని అంటున్నారు. ఇంకొంతమంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడం తెలియక, 2002 నాటి ఓటర్ల జాబితాతో సరిపోల్చడం కుదరక ఓట్లు పోతాయన్న ఆందోళనకు గురవుతున్నారు.

ఆందోళన వద్దు.. ఇలా చేయండి

ఓటర్ల జాబితా రివిజన్ విషయంలో చిరునామాలు దొరక్క బీఎల్‌వోలు, బీఎల్‌వోలు అందుబాటులో లేక ఓటర్లు అవస్థలు పడుతున్నారన్నది సుస్పష్టం. బీఎల్‌వోలకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓటర్లు ఏ ఒక్క వీధిలోనూ, వార్డులోనూ కేంద్రీకృతం కాలేదు. ఉదాహరణకు నెంబర్ 199 బూత్ పరిధిలోని ఓటర్లు కృష్ణాపార్క్ సమీపంలోని పుణ్యపు వీధితోపాటు నానుబాల వీధి, అలాగే ఏటవతల హయాతీనగరం ప్రాంతాల్లోనూ ఉన్నారు. అందువల్ల ఓటర్ల అనుపానులు పట్టుకోవడం బీఎల్‌వోలకు కష్టతరం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఓటర్లు కూడా తమవంతు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. తాము గత ఎన్నికల్లో ఓటు వేసిన పోలింగ్ కేంద్రం నెంబరు ఆధారంగా తమ పరిధిలోని సచివాలయానికి వెళ్లి బీఎల్‌వో వివరాలు, కాంటాక్ట్ నెంబర్ తెలుసుకుని సంప్రదించవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో కూడా తెలుసుకోవచ్చు. గూగుల్‌లో ‘నో యువర్ ఓటర్ డిటెయిల్స్ ’ అని కొడితే మీ ఓటు వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. అదే కాలమ్‌లో చివర ఉండే డీటెయిల్స్ అన్న దానిపై క్లిక్ చేస్తే బీఎల్‌వో పేరు, కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తాయి. తద్వారా బీఎల్‌వోను ఫోనులో కాంటాక్ట్ చేసి వారు ఎక్కడ, ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకోవచ్చు లేదా వారు మీ ఏరియాకు ఎప్పుడు వస్తారో కూడా తెలుసుకోవచ్చు. దీని వల్ల మీ కార్యం నెరవేరుతుంది.వారి పనీ సులభమవుతుంది.

ఎన్యుమరేషన్ ఫారాలు నింపడం కూడా కస్త కష్టంగానే ఉంది. ఫారం పైభాగంలో ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న మీ వివరాలు, ఆ తర్వాత క్యూఆర్ కోడ్, దాని పక్కన మీ పాత ఫొటో ఉంటాయి. దాని పక్కనే ప్రస్తుత ఫొటో అతికించాల్సిన చోటు ఉంటుంది. వీటన్నింటి కింద ఫొటోలో కనిపిస్తున్న విధంగా మÖడు విభాగాలు ఉంటాయి. ఎడమవైపు ఉన్న కాలమ్‌లలో గత సర్ ఓటర్ల జాబితాలో ఓటరు వివరాలు అని ఉంటాయి. దానికి కుడివైపు 2002 ఓటర్ల జాబితాలో లేనివారు.. తమ బంధువులు అంటే.. అమ్మ, నాన్న, తాత, వంటివారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వీటికి కిందన కుడివైపు కాలమ్‌లలో ఆధార్ కార్డులో ఉన్న ప్రకారం మీ వ్యక్తిగత వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఫారం పూర్తి చేసిన తర్వాత బీఎల్‌వోకు అప్పగిస్తే వాటిని పరిశీలించి మ్యాపింగ్ చేసి ఆన్‌లైన్ చేస్తారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page