`పాలకొండ టీడీపీలో కొనసాగుతున్న అంతర్గత పోరాటం
`జనసేన నుంచి ఎమ్మెల్యే అయినా పట్టు వీడని జయకృష్ణ
`తన సోదరుడికే ఇన్‌ఛార్జి పదవి ఇప్పించడానికి యత్నం
`నిమ్మక పార్టీ మారినందున తమదే ఆధిపత్యమంటున్న భూదేవి వర్గం
`పోటాపోటీగా రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదులు
పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల పయనమెటు? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున టికెట్ దక్కించుకోవడం.. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో నియోజకవర్గ టీడీపీలో ఉన్న వర్గాలు ఇప్పుడు స్పష్టమైన విభజన రేఖను గీసుకొని పార్టీని తమ చట్రంలో బంధించాలన్న లక్ష్యంతో ఆధిపత్య పోరు మొదలుపెట్టారు. 2019లో టీడీపీ ఓడిపోయి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడి టీడీపీ నాయకులు గ్రూపుల గోలను లోపల దాచుకోలేదు. అప్పుడూ బాహాబాహీగా తలపడ్డారు. ఇప్పుడూ బలప్రదర్శనకే తెగబడుతున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఎమ్మెల్యేగా నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ గుర్తుపై గెలుపొందినా టికెట్ల ప్రకటన సమయంలో ఎన్డీయే కూటమి పొత్తుకు అనుగుణంగా టీడీపీ నుంచి జనసేనకు వెళ్లి టికెట్ తెచ్చుకున్నారు. దాంతో టెక్నికల్‌గా జనసేన ఎమ్మెల్యే అయినా తెలుగుదేశంతోనే ఆయన బంధం కొనసాగుతోంది. కానీ ఎన్నికల ముందు పార్టీ అభ్యర్థిత్వం విషయంలో జయకృష్ణతో పోటీ పడి ఆయన వ్యతిరేక గ్రూపునకు నాయకురాలిగా నిలిచిన పడాల భూదేవికే ఎన్నికల తర్వాత తెలుగుదేశం నాయకత్వం పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జీల మధ్య మళ్లీ పోరు మొదలైంది. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పదవిని భూదేవికి కాకుండా తన సోదరుడు నిమ్మక పాండుకు ఇప్పించుకోవాలని సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రయత్నించారు. కానీ మరో వర్గం నుంచి పెద్ద ఎత్తున కాపుల మద్దతు ఉండటం వల్ల పడాల భూదేవికి ఆ పదవి దక్కించుకోగలిగారు. ఫలితంగా నియోజకవర్గంలో ఉన్న టీడీపీ క్యాడర్ నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి వర్గాలుగా విడిపోయింది. జయకృష్ణ జనసేన ఎమ్మెల్యే కావడం వల్ల టీడీపీ నేతలు తమతోనే కలిసి రావాలని భూదేవి వర్గానికి చెందిన సామంతుల దామోదర్, ఖండాపు వెంకటరమణ, వారాది సుమంత్ నాయుడు లాంటి బలమైన కాపు నాయకులు పిలుపునిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాస్‌ను నిమ్మక జయకృష్ణ వర్గంలో ఉన్న టీడీపీ నేతలు కలిసి గత ఎన్నికల్లో భూదేవి వర్గం పొత్తు ధర్మాన్ని పాటించలేదని, వైకాపా అభ్యర్థికి అనుకూలంగా వారంతా పని చేసినందున వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వినతిపత్రం అందజేశారు. అంతకు ముందే నియోజకవర్గంలో జయకృష్ణ వైపు ఉన్న టీడీపీ నేతలంతా కలిసి ఓ సమావేశాన్ని ఏర్పాటుచేసి భూదేవి వర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే తీర్మానం చేసి సంతకాలు సేకరించారు. ఇప్పుడు అదే కాపీని పల్లా శ్రీనివాసరావుకు అందజేశారు. ఆ సమయానికి కాస్త అటూ ఇటులో ఎమ్మెల్యే జయకృష్ణ కూడా పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. మరోవైపు పడాల భూదేవి వర్గం కొత్త రాష్ట్ర అధ్యక్షుడ్ని కలిసి అభినందించి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితిని వివరించారు.
ఎవరి ఆట వారిదే

ఎన్నికలకు ముందు నుంచి రెండు వర్గాలుగా విడిపోయిన పాలకొండ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పూర్తిగా ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆమధ్య ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చినప్పుడు ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలు మీడియా ముందుకు వచ్చి ఇసుక విధానానికి విస్తృత ప్రచారం కల్పించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా పడాల భూదేవి ఇన్‌ఛార్జి హోదాలో ప్రెస్‌మీట్ పెడితే దానికి జయకృష్ణ వర్గం హాజరుకాలేదు. ఎన్నికలకు ముందు నుంచి జయకృష్ణను మాజీమంత్రి కళా వెంకట్రావు చేరదీయగా, పడాల భూదేవి వర్గం ఆయనకు దూరంగా జరిగి, అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుల ప్రాపకం సంపాదించింది. పాలకొండలో టికెట్ కోసం కొట్టుకునే పరిస్థితి రావడంతో ఏం చేయాలో తోచని అధిష్టానం పొత్తు పేరుతో ఆ నియోజకవర్గాన్ని జనసేనకు ఇచ్చేసింది. దీంతో చివరి నిమిషంలో కళా వెంకట్రావు చక్రం తిప్పి అప్పటి వరకు పాలకొండ జనసేనకు ఇన్‌ఛార్జిగా ఉన్న నేతను ఒప్పించి జయకృష్ణను జనసేనలోకి పంపి టిక్కెట్ ఇప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో జయకృష్ణ గెలుపొందారు. తాను జనసేన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పాలకొండలో టీడీపీ ఇన్‌ఛార్జిగా తనవారే ఉండాలన్న ఉద్దేశంతో తన సోదరుడు పాండుకు ఇన్‌ఛార్జి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. భవిష్యత్తులో జనసేనతో పొత్తు పొత్తు ఉన్నా లేకపోయినా రాబోయే స్థానిక ఎన్నికల్లో తన మాట చెల్లుబాటు కాదేమోనన్న భావనతోనే జయకృష్ణ ఇక్కడ టీడీపీ, జనసేనలను వేరుగా చూడకూడదని కోరుతున్నారు. అదే సమయంలో జయకృష్ణకు టికెటిస్తే పని చేయమంటూ మొదట్నుంచి చెప్పిన బలమైన కాపు నేతల అండ ఉన్న వర్గం జయకృష్ణను జనసేనకు పరిమితం చేసి టీడీపీని పూర్తిస్థాయిలో తమ చేతిలో పెట్టాలని కోరుతోంది. ఈ విషయం పల్లా శ్రీనివాసరావు దృష్టికి వెళ్లినప్పుడు జనసేన గెలిచిన 21 స్థానాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉందని, ముందుగా వైకాపా హయాంలో టీడీపీ కార్యకర్తల మీద పెట్టిన కేసుల నుంచి విముక్తి పొందే అంశం మీద దృష్టి సారించి, ఆ తర్వాత పార్టీని నియోజకవర్గాల వారీగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
Kommentare