పాతాళ భైరవులు
- NVS PRASAD
- Sep 16, 2024
- 2 min read
వాల్టా చట్టానికి వ్యతిరేకంగా నోటిఫికేషన్
పబ్లిక్ హియరింగ్‌లో ర్యాంపు వద్దన్న గ్రామస్తులు
ఇసుక కోసం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న అక్రమార్కులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇసుకాసురుల కల్పవృక్షం భైరి ర్యాంపు కోసం పాపాల భైరవులు రంగంలోకి దిగారు. భైరిలో వంశధార నది ఒడ్డును పాతాళానికి తవ్వేసిన అక్రమార్కులు ఈసారి అధికారికంగానే భైరి ర్యాంపులో పాగా వేయడానికి పన్నాగం పన్నుతున్నారు. ఇక్కడ ర్యాంపు వస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని స్థానికులు మొత్తుకుంటుంటే ఊరు నాశనమైపోయినా ఫర్వాలేదు కానీ ర్యాంపు వచ్చేతీరాలని ఒత్తిడి తెస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

శ్రీకాకుళం రూరల్ మండలం భైరిలో ఇసుక ర్యాంపు వద్దని స్థానికులు పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి, మైన్స్ శాఖ అధికారులకు తేల్చి చెప్పేశారు. కానీ కేవలం ఈ ర్యాంపు మీద పడి గత ఐదేళ్లకు పైబడి సొమ్ములు ఏరుకుంటున్న ఇసుక సిండికేట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భైరి ర్యాంపునకు అన్ని అనుమతులు వచ్చే విధంగా పావులు కదుపుతున్నారు. భైరి వంశధార నదిలో సర్వే నెంబరు 208లో 3.68 హెక్టార్ల విస్తీర్ణంలో అంటే సుమారు 9 ఎకరాల్లో ఏడాదికి 36,800 క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వడానికి కాలుష్య నియంత్రణ మండలి ఈ నెల 11న పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. అయితే ఇందులో పాల్గొన్న సర్వే నెంబరు 208 మీద ఆధారపడిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక తవ్వకానికి అనుమతులు ఇవ్వకూడదని బోర్డు ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సర్వే నెంబరులో 9 ఎకరాల్లో తవ్వకాలు మొదలుపెడితే పంట, తాగునీటి బోర్లు పూర్తిగా ఎండిపోతాయని, నది ఒడ్డున 16 సాగునీటి బోర్లు ఉండటం వల్ల వ్యవసాయం దెబ్బతింటుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే వంశధార నది నుంచి పొలాలకు వెళ్లే ఇరిగేషన్ ట్రంచ్‌లు కూడా ఉన్నాయని, 9 ఎకరాలు అంటే దాదాపు 40 బోర్లు ఎఫెక్ట్ అవుతాయని వీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయని, వాల్టా చట్టం ప్రకారం ఇక్కడ ఇసుక ర్యాంపునకు అనుమతులు ఇవ్వకూడదని వారు గనులు, భూగర్భ శాఖకు, ఎన్విరాన్‌మెంటల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పబ్లిక్ హియరింగ్ సందర్భంగా వినతిపత్రం ఇచ్చారు. గతంలో కూడా ఇక్కడ ఇసుక తవ్వకాలకు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీన్ని నిలిపివేశారు. కానీ గత ప్రభుత్వ హయాంలో పట్నాన కృష్ణ, నక్క గణేష్‌లతో పాటు అనేక మంది ఇక్కడ అక్రమంగా ఇసుకను తవ్వి తరలించి పెద్ద ఎత్తున సొమ్ములు చేసుకున్నారు. గడిచిన ఐదేళ్లలో జేపీ వెంచర్స్, ప్రతిమ వంటి సంస్థలు అధికారికంగా ర్యాంపులు సొంతం చేసుకున్నా భైరిలో మాత్రం అనధికారికంగా వీరే ర్యాంపును నడిపారు. ఇప్పుడు పార్టీ మార్చి తెలుగుదేశం జెండా కిందకు వచ్చి భైరి ర్యాంపునకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు తేవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు సంపాదించిన ఇసుక సొమ్మును కుమ్మరించి పబ్లిక్ హియరింగ్ నిర్వహించిన అన్ని శాఖలను కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని, జిల్లాలో ఇసుక కొరత ఎక్కువగా ఉన్నందున ఈ ర్యాంపునకు అనుమతులు ఇవ్వాలని స్వయంగా తెలుగుదేశం నాయకులతోనే మరోవైపు సిఫార్సు చేయిస్తున్నట్టు తెలుస్తుంది. విచిత్రమేమిటంటే.. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు భైరిలో ఇసుకను తరలించిన నక్క గణేష్ ఆ సమయంలో ఇప్పటి ఎమ్మెల్యే గొండు శంకర్‌ను ముప్పతిప్పలు పెట్టారు. ఇసుకలో సంపాదించిన సొమ్ముతో శంకర్ ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నించారు కూడా. ఎన్నికల అనంతరం కరజాడ టోల్‌గేట్ వద్ద గొండు శంకర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ గణేష్ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇది తెలుసుకున్న శంకర్ స్వయంగా ఆయనే అక్కడకు వెళ్లి ఆ ఫ్లెక్సీని తీయించేశారు. ఇప్పుడు అదే వ్యక్తులు భైరిలో అనధికారికంగా ర్యాంపు నిర్వహించడం కుదరదు కాబట్టి అధికారికంగానే దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ట్రాన్స్‌పోర్టర్ల ముసుగులో ఇసుకను పెద్ద ఎత్తున తరలించడానికి భైరి కల్పతరువుగా కనిపిస్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు తెచ్చి లెక్కాపత్రం లేకుండా వాటిని అమ్ముకోవాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఇసుక దందా మీద ఎమ్మెల్యే ఉద్యమించారు కానీ, ఇప్పుడు అంత తీరిక ఉండదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ముసుగులో తమ పని కానీయొచ్చని వీరు భావిస్తున్నారు. సాగునీరు, తాగునీటి బోర్లే కాకుండా ఇదే సర్వే నెంబరులో వంశధార ఒడ్డున శివాలయం కూడా ఉంది. భైరిలో నిత్యపూజలు అందుకుంటున్న శివుడూ ఉన్నాడు. ఇప్పుడు ఇసుక తవ్వకం మొదలుపెడితే శివాలయం కూడా కూలిపోతుందని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కూడా ర్యాంపు రావాల్సిందేనని అక్రమార్కులు పట్టుపడుతున్నారు.
భైరి గ్రామం వంశధార నది సర్వే నెం.208కు అనుకొని సుమారు 16 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ శాండ్ రీచ్‌కు 300 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకు సర్కిల్ పరిధిలో 16 తాగునీరు, సాగునీరు బోర్‌వెల్స్ ఉన్నాయి. వాల్టా చట్టం ప్రకారం బోరు నుంచి 500 మీటర్లు లోపు ఇసుక తియ్యకూడదు. అధికారులు ముందుగా స్థలాన్ని పరిశీలించకుండా, 500 మీటర్ల సర్కిల్లో భూగర్భ జలాలు, బోర్‌వెల్స్ గుర్తించకుండా, ఆ స్థలంలో ఇసుక నిల్వ ఉన్నది లేనిది చూడకుండా ప్రకటన చేసేశారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అధికారులు సాంకేతిక పరంగా కొలతలు వేసి చూడాలి. కానీ అలా చేయలేదు.
Comments