కళాశాలకు అనుబంధమైనా సౌకర్యాల లేమి
ఐసీయూ కంటే జనరల్ వార్డు నయం
ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవానికి లక్షలు ఖర్చు
ప్రభుత్వాసుపత్రుల్లో లోపించిన మానవీయ కోణం
ఏసీలున్న చోట విసనకర్రలే దిక్కు
ఫ్యాన్లు తెచ్చుకోవడం పేషెంట్ల బాధ్యత

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇన్ని ఉచిత పథకాలెందుకు? ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అడిగిందెవరు? కేవలం విద్య, వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తే చాలన్న వాదన ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది నుంచి వినిపిస్తున్నా, ఆ దిశగా మాత్రం ప్రయత్నాలు జరగడంలేదు. మెడికల్ కాలేజీలు పెరుగుతున్నాయి. అందులో సీట్లూ పెరుగుతున్నాయి. ప్రతీ ఏటా బయటకు వచ్చే వైద్యులూ పెరుగుతున్నారు. కానీ రోగులకు అందే సేవలు మాత్రం గతం మాదిరిగానే ఉన్నాయంటే అందుకు కారణం ఎవరు? కోవిడ్ తర్వాత కూడా ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోపోతే ఆ తప్పెవరిది?
జిల్లాలో కిడ్నీ రోగులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ కిడ్నీ మార్పిడి చేసే ఆసుపత్రి ఉందా? హృద్రోగులు అన్నిచోట్లా ఉన్నారు. కనీసం రెండు స్టంట్లు వేసే ప్రభుత్వ ఆసుపత్రులు ఇక్కడ ఉన్నాయా? మేజర్ యాక్సిడెంట్ జరిగింది. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స చేసే పరిస్థితి ఇక్కడ ఉందా? పైవాటిలో అన్ని కేసుల్లోనూ రిఫర్ మాత్రమే ఇక్కడి పెద్దాసుపత్రి చేయగలిగేది. కారణం.. స్పెషలిస్ట్‌లు లేకపోవడం ఒకటైతే, అందుకు తగిన మెకానిజం లేకపోవడం రెండో కారణం. అంతేసి పెద్ద జబ్బులు రావడం మన పాపం కాబట్టి, మన ఖర్మకు మనమే ఏ ప్రైవేటు ఆసుపత్రుల్లోనో చేరి లక్షలాది రూపాయలు బిల్లు కట్టాలి. తప్పదు. కనీసం తల్లీ బిడ్డ క్షేమం కోసం ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు ఆ విభాగం మీద కూడా దృష్టి సారించకపోవడం బాధాకరం. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీకే లక్షలు తీసుకుంటున్నారు. ఇక సిజేరియన్‌తో పాటు బిడ్డ అడ్డం తిరిగినప్పుడు చేసే ఆపరేషన్లకైతే అంతే లేదు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు డాక్టర్ వద్ద చెప్పకూడనిది ఎంత డబ్బులు ఖర్చయినా ఫర్వాలేదు అని మరోసారి రుజువు చేస్తున్నారు. ప్రసూతి కోసం ఆసుపత్రికి వెళ్లినా కనీస సౌకర్యాలు గర్భిణీకి, లేదా బాలింతకు కల్పించడంలో విఫలమవుతున్నాం. ఈ కోణంలో స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసూతి విభాగం కోసం ఒక్కసారి చర్చించుకుందాం.
శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి డెలివరీకి వెళ్తున్నారా..? అక్కడ హైబ్రిడ్ ఐసీయూ అని ఒకటుంటుంది. నిండా ఏసీలు, ఒంటికి చెమట పట్టకుండా పరుపులు, సురక్షితమైన నీరు ఉంటాయి. కాకపోతే ఫ్యాన్లు, విసనకర్రలు, దుప్పట్లు మీరే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పైన చెప్పినవి పనిచేయవు. ఇక నీరంటారా మీ ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిళ్లు పట్టుకొని నాలుగు మెట్లు దిగి సత్యసాయిబాబా నిత్యాన్నదాన పథకం వారి వద్దకు వెళితే వారు వేడినీరు ఇస్తారులెండి.
పేరుకే పెద్దాసుపత్రి.. అయినా సేవలు మాత్రం ఆ స్థాయిలో అందడంలేదన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాప్రతినిధులు రిమ్స్‌లో పర్యటించి హడావుడి చేయడం, ఆ తర్వాత కన్నెత్తి చూడకపోవడం సర్వసాధారణమైపోయింది. మన జిల్లాలో బీద బిక్కీ, రైతు, కూలీ మాత్రమే ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు వస్తారు. వీరికి అక్షర జ్ఞానం అంతంత మాత్రంగానే ఉంటుంది. పూర్తి నెలలు నిండేవరకు గర్భిణీ తిరుగాడుతుందని భావించే పెద్దలు డెలివరీ ముందు వచ్చే మార్పుల వల్లే ఆసుపత్రికి వస్తుంటారు. వీరు ఎక్కడ ఓపీ రాయించుకోవాలి? ఎక్కడికి ఇన్‌పేషెంట్‌గా వెళ్లాలి? తెలుసుకోవడం స్వర్గానికి దారి వెతకడంలా మారిపోయింది. అక్కడ బోర్డులుంటాయి కదా.. చూసుకుని వెళ్లాలి మరి అనే సమాధానాలే తప్ప మానవీయ కోణంలో అక్కడ సేవలందించడానికి రిసెప్షన్ వ్యవస్థ ఉండదు. దీంతో ఓవైపు నొప్పులు, మరోవైపు దెప్పులు, ఇంకోవైపు నిలబడటం వల్ల అక్కడే ప్రసవిస్తారేమోనన్న పరిస్థితి ఏర్పడుతోంది.
శ్రీకాకుళం రిమ్స్‌లో లేని వసతి ఏమిటీ అని అడక్కండి. అన్నీ ఉన్నాయి. కానీ అవి పని చేయవు. ఆసుపత్రిలో అడుగడుగునా సమస్యలు దర్శనమిస్తున్నాయి. ప్రసూతి సేవల సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యాతా రాహిత్యం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది వ్యవహరించే తీరు వల్ల వివిధ సందర్భాల్లో గర్భిణీలు, బాలింతలు ఇబ్బందిపడిన పరిస్థితులు ఉన్నాయి. సిబ్బంది రోగులతో వ్యవహరిస్తున్న తీరుపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రిమ్స్ ప్రసూతి విభాగంలో మూడు యూనిట్లకు పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉన్నా గర్భిణీలకు సేవలు అందడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఓపీ కోసం గర్భిణీలు గంటల తరబడి క్యూలైన్‌లో వేచివుండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సమాచారం ఇచ్చేవారు లేక గర్భణీలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రసూతి విభాగంలో గర్భిణులకు అత్యున్నత సేవలందించేందుకు, గర్భంలో శిశువులో లోపాలను గుర్తించడానికి, తల్లిబిడ్డల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు అవసరమైన టిఫా స్కాన్ మినహా మిగతా సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు ఓటీ అసిస్టెంట్స్, మెటర్నటీ అసిస్టెంట్స్ బొడ్డు తాడు కట్ చేయడం కోసం మగ, ఆడ శిశువుల తల్లిదండ్రుల నుంచి రూ.1 వెయ్యి నుంచి రూ.2 వేలు వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండు నెలల క్రితం ప్రసూతి వార్డు, ఆపరేషన్ థియేటర్‌లో అక్రమ వసూళ్లకు సిబ్బంది పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సమావేశం నిర్వహించి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఫిర్యాదులు వస్తే ఉద్యోగులను టెర్మినేట్ చేస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. అయినా వారి పనితీరులో మార్పు రాలేదు.. అది వేరే విషయం.
స్పందించని సిబ్బంది..
ప్రసూతి వార్డులో పూర్తిస్థాయిలో వైౖద్యులు ఉన్నా సిబ్బందే గర్భిణీలకు, బాలింతలకు వైద్యసేవలు అందిస్తారని ఆరోపణలు ఉన్నాయి. వైద్యులు అందించాల్సిన సేవలు సకాలంలో అందడం లేదని, వారి స్థానంలో సిబ్బందే వైద్యం చేస్తున్నారని రోగుల సహాయకులు చెబుతున్నారు. సిబ్బంది ఉన్నా రోగుల ఇబ్బందులపై సకాలంలో స్పందించరనే విమర్శలు ఉన్నాయి. వైద్యులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చిన తర్వాత రోగులకు వైద్యం అందిస్తున్నారని రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు. ప్రసూతివార్డుల్లో మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉంటున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. రిమ్స్ ప్రసూతి విభాగంలో విధులు నిర్వహిస్తున్న వైద్య నిపుణులందరికీ ప్రైవేట్ క్లినిక్‌లు ఉన్నాయి. వీరంతా హైరిస్క్ కేసులను వారి ఆసుపత్రులకు తరలించుకుపోతున్నట్టు విమర్శలున్నాయి. వార్డులో వైద్య సిబ్బంది ఉన్నా రోగుల ఇబ్బందులను పట్టించుకోరని ఆరోపణలున్నాయి. వైద్యులు స్పందించకపోవడం, సిబ్బంది తీరు వల్ల గర్భిణీలు ప్రైవేట్‌లో వైద్యం చేయించడానికి మొగ్గు చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. హైబ్రిడ్ ఐసీయూలో ఏసీలు పనిచేయడం లేదని, ఫ్యాన్లతో నెట్టుకొస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
సేవలు మృగ్యం
ప్రాణాలు నిలుస్తాయని ఆశతో రోగులు, ఉత్తమ చికిత్స, వసతులు అందుబాటులో ఉంటాయని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఇక్కడికే కేసులు రిఫర్ చేస్తుంటారు. 900 పడకల ఆసుపత్రిలో 32 వార్డులు, 8 ఐసీయూలు ఉన్నాయి. ఒక్కో వార్డులో రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసేందుకు కనీసం ముగ్గురు, ఐసీయూలో పని చేసేందుకు ఆరుగురు చొప్పున వైద్య సిబ్బంది ఉండాలి. ప్రసూతి విభాగంతో పాటు మొత్తం 32 వార్డులకు కనీసం 96 మంది, 8 ఐసీయూలకు 48 మంది ఎంఎన్‌వోలు అవసరం. ఆసుపత్రి మొత్తానికి కేవలం 28 ఎంఎన్‌వోలు మాత్రమే ఉన్నారు. 116 మంది సిబ్బంది కొరత ఉంది. ఆసుపత్రిలో 14 విభాగాలు ఉండగా 8 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రమే ఉన్నారు. వీరంతా సూపరింటెండెంట్ ఆఫీసులోనే పని చేస్తున్నారు. మిగిలిన విభాగాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసిన ఇతర ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు.
కోవిడ్ సమయంలో రిమ్స్‌కు పెద్ద ఎత్తున వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయి. కోవిడ్ అనంతరం వాటి వినియోగం పూర్తిగా తగ్గిపోవడంతో ఆ పరికరాలను మూలన పడేశారు. ఆసుపత్రిలో పూర్తి సామర్థ్యంతో కేవలం 10 వెంటిలేటర్లు మాత్రమే పని చేస్తున్నాయి. కోవిడ్‌లో కొనుగోలు చేసిన వెంటిలేటర్లను కరోనా అనంతరం వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో 80 వెంటిలేటర్లు నిరుపయోగమయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. కోవిడ్‌లో మనుగడలోకి తీసుకొచ్చిన ఆక్సిజన్ ప్లాంట్లలో కొన్ని నిరుపయోగంగా మారాయి. 900 పడకల ఆసుపత్రికి కేవలం రెండు అంబులెన్స్‌లు మాత్రమే సేవలందిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో అధికారులు ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాలపై ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకొనే నాధుడు లేడు.
Comments