పొందూరుకు సోలార్ మేకింగ్ పరిశ్రమ తెస్తా!
- Prasad Satyam
- Oct 15
- 1 min read
రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్

(సత్యంన్యూస్, పొందూరు)
ఈ ప్రాంత ప్రగతిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సోలార్ మేకింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పీయూసీ ఛైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రకటించారు. అలాగే అతిపెద్ద జాబ్‌మేళాను కూడా ఏర్పాటు చేయించగలమని పేర్కొన్నారు. బుధవారం స్థానిక సిస్టం కళాశాల ఆవరణలో ఆడపిల్లల సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన పోటీ పరీక్షల ఉచిత శిక్షణ తరగతులను రవికుమార్ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన యువతనుద్దేశించి మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటు వల్లనే ప్రగతి సుసాధ్యమన్నారు. అయితే వీటిని వ్యతిరేకిస్తున్న వారిని చరిత్ర క్షమించదన్నారు. తమ ఉనికిని చాటుకొనేందుకే కొన్ని అవాంఛనీయ శక్తులు ఉద్యమాలు నిర్వహించడం దారుణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం పరిశ్రమల హబ్‌గా మారుతోందన్నారు. ఎంతోమంది నిరుద్యోగవంతులకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేనందున ఉద్యోగాల్లో ఎంపిక కాలేకపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల సేవా సొసైటీ అధ్యక్షురాలు, స్థానిక గ్రామ సచివాలయ మహిళా కానిస్టేబుల్ మడ్డి లావణ్య ముందుకు వచ్చి తన సొంత డబ్బుతో 38 రోజుల పాటు యువతీయువకులకు శిక్షణనిప్పించడం స్వాగత పరిణామమన్నారు. ఈ సందర్భంగా లావణ్య సేవా నిరతిని కూన అభినందించారు. అలాగే ఉచిత వసతిని కల్పించిన సిస్టం కళాశాల కరస్పాండెంట్ ఎం.మోహనరావు ఉదారతను ప్రశంసించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచి రేగిడి లక్ష్మి, పీఏసీఎస్ అధ్యక్షులు వండాన మురళి, మాజీ సర్పంచి ఎ.విజయలక్ష్మి, నాయకులు ఎ.శ్రీరంగ నాయకులు, బలగ శంకరభాస్కర్, సీపాన శ్రీరంగ నాయకులు, అన్నెపు రాము, దండా రవి, మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










Comments