‘వీవింగ్ లైవ్స్’ పేరుతో ప్రదర్శన
ఉత్తమ అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రపంచ ప్రఖ్యాత పొందూరు ఖాదీ బ్యాక్‌డ్రాప్‌గా చేనేత కార్మికుల జీవితాలను ప్రతిభింబించేలా తీసిన లఘు చిత్రం ‘వీవింగ్ లైవ్స్’ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డ్ గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీని సంపత్ పవన్ ఫిల్మ్ కంపెనీ, శ్రీకాకుళం హవా కలిసి నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌లో పలువురు ప్రతిభావంతులైన వ్యక్తులు సహకారాన్ని అందించారు. అంతర్జాతీయ వేదికపై ఇలాంటి గుర్తింపు పొందడం శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ‘వీవింగ్ లైవ్స్’ పేరుతో తీసిన లఘుచిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు రావడం పట్ల కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత ‘వీవింగ్ లైవ్స్’ మేకర్స్ బృందం సభ్యులతో కలిసి లఘుచిత్రాన్ని వీక్షించారు. అనంతరం క్యాంపుకార్యాలయంలో ఫిల్మ్ మేకర్స్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జిల్లాకు చెందిన సినీ మేకర్స్ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకోవడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పొందూరు ఖాదీ చరిత్రను ప్రధానంగా చూపించే డాక్యుమెంటరీ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ఎంపిక కావడం జిల్లా ఖ్యాతిని మరింత పెంచిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా పొందూరు ఖాదీ ప్రాముఖ్యత, చారిత్రక నేపథ్యం, ఆ ప్రాంత ప్రజల కృషిని ప్రపంచానికి తెలియజేయడం పట్ల చిత్ర బృందానికి జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు. నేతకార్మికుల జీవితాల్ని ప్రతిబింబించేలా రూపొందించిన ‘వీవింగ్ లైవ్స్’ లఘు చిత్రం అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్‌లో ఘనంగా ప్రదర్శించడాన్ని పలువురు జిల్లా ప్రముఖలు కొనియాడారు. ఈ చిత్రానికి రవీంద్ర భారతి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ ప్రదర్శనలకు సినీ రంగ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, సినీ ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ‘వీవింగ్ లైవ్స్’ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. కథా విషయంగా నూతన ఒరవడిలో సాగిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను దోచుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిత్రప్రదర్శనకు అవకాశం ఇచ్చి తిలకించిన అందరికీ చిత్రబృందం కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సినిమా నేపధ్యం, తీయడానికి పడిన కష్టం, మానవ సంబంధాలను అందంగా అల్లుకున్న విధానం గురించి మేకర్స్‌కు వివరించారు. అవార్డు ఇచ్చిన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు, ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మేకర్స్, టెక్నీషియన్స్ బృందంలో పవన్ రాజీవ్ లోచన్, తేజసాయి కొల్లి, అజిత్ బల్లెడ, కూర్మినాయుడు వరుదు, ప్రగ్యాన్ గోకెడా, సంతోష్, నాని, ఓంకార్, ఆదిత్య, నిఖిల్ మంగలంపల్లి, తరుణ్ నాయుడు, బాబ్జి రేగాన, అరవింద్ యాదవ్, నాగు లండా, లోకేష్ కందుకూరి ఉన్నారు. కొన్ని నెలల పాటు సమయాన్ని వెచ్చించి ఎన్నో వ్యయప్రయాసలతో తీసిన లఘుచిత్రానికి తగిన గుర్తింపు లభించందని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ความคิดเห็น