top of page

పునర్విభజన పెనుభారమేనా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 18
  • 3 min read
  • నియోజకవర్గాల పెంపుతో అదనపు ఖర్చులు

  • ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు

  • ఎంపీలకు రూ.1629కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.11113 కోట్లు

  • పదవులకు, వేతనాలకు న్యాయం జరగడంలేదన్న వాదనలు

  • అది జరగాలంటే జవాబుదారీతనం ఉండే చట్టం రావాలి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపర్చిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతున్నది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు నిబంధనల ప్రకారం మూడింట రెండొంతుల ఓట్లు లభించకపోవడంతో లోక్‌సభలో వీగిపోయింది. పునర్విభజన బిల్లుతో ముడిపెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తనకు అనుకూలంగా ఆమోదింపజేసుకోవాని ప్రభుత్వపక్షం ప్రయత్నించినందున ఆ బిల్లును తాము ఓడగొట్టాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు సమర్థించుకుంటున్నాయి. మహిళా బిల్లు సంగతి పక్కన పెడితే.. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా వెనక్కి వెళ్లిపోవడం ఒకరకంగా మంచిదే అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెరిగిన జనాభా దామాషా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అధికార, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ దానివల్ల జనసామాన్యానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేకపోగా జీతభత్యాల రూపంలో ప్రజాధనం వారికే ఎక్కువగా ధారబోయాల్సి వస్తుందని మేథావులు, సామాజికవేత్తలు చెబుతున్నారు. ఈ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ీVAంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ ప్రస్తుతం జనాభా భారీగా పెరిగినందున ఎంపీలు వారిందరి యోగక్షేమాలు కనుక్కోలేక ఆపసోపాలు పడుతున్నారని ఉవాచించారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరిగితే పార్లమెంటులో రాష్ర ప్రాతినిధ్యం, అసెంబ్లీల్లో ఆయా ప్రాంతాల ప్రాతినిధ్యం పెరుగుతుందని, నియోజకవర్గాల సమస్యలు ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. అయితే దీనికి భిన్నమైన వాదనలు ఇతర వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

రాజకీయ ఉపాధి

ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచడాన్ని ప్రధానంగా రాజకీయ పార్టీలే ఆహ్వానిస్తున్నాయి.. సంబరపడుతున్నాయి. దీనికి కారణం.. ఆయా పార్టీల నుంచి ఔత్సాహిక నాయకులకు అవకాశాలు పెరుగుతాయి. ఎన్నికల సమయంలో టిక్కెట్ల పోటీ తగ్గుతుంది. ఆ మేరకు పార్టీల నాయకత్వాలకు సర్దుబాటు చేసే తలనొప్పులు తగ్గుతాయి. ఆ విధంగా రాజకీయ నిరుద్యోగంతో అలాడిపోతున్న నాయకులకు పునరావాసం, ఉపాధి లభిస్తాయి. కానీ వారిలో ఎంతమంది నాయకులుగా రాణిస్తారు.. ప్రజాసమస్యలపై చట్టసభల్లో గళం విప్పుతారన్నది అనుమానమే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజాప్రతినిధుý పనితీరును పరికిస్తే వారు చట్టసభల్లో ఏమాత్రం చురుగ్గా ఉంటున్నారో ఇట్టే అర్థమవుతుంది. అలాగే తమ ప్రాంత సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించడంలోనూ చాలాకొద్దిమంది మాత్రమే సఫలమవుతున్నారన్నది అనుభవైకసారం. మెజారిటీ ప్రజాప్రతినిధులు పార్టీ లైను ప్రకారం రాజకీయ అజెండాను మోయడం, స్వకార్యాలు చక్కబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నది చేదునిజం. ఇక ప్రస్తుతం సుమారు 14 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు తమ ఐదేళ్ల పదవీకాలంలో ఒక్కసారైనా ఒటర్లను కాకపోయినా.. అన్ని ప్రాంతాలను సందర్శించగలిగారా? అన్న ప్రశ్నించుకుంటే లేదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో కొత్తగా పెద్దసంఖ్యలో పెరిగే ఎంపీలు, ఎమ్మెల్యేల వల్ల ఇంతకుమించి జరిగేదేమీ ఉండదు. అటువంటప్పుడు పెంపుదల ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు పునర్విభజన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాపై భారీ భారం పడుతుంది. చట్టసభలకు ఎన్నికయ్యే ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రభుత్వాలు నెలవారీ వేతనాలతోపాటు ఇతర భత్యాలు, పెన్షన్లు, కార్యాలయ ఖర్చుల రూపంలో భారీగానే చెల్లిస్తున్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పెరిగితే.. ఆ మేరకు ప్రభుత్వాలపై పడే భారం కూడా అమాంతం పెరిగిపోతుంది. అదెలాగో చూద్దాం..

`దేశవ్యాప్తంగా ప్రస్తుతం 543 మంది ఎంపీలు ఉన్నారు. పునర్విభజన తర్వాత వీరి సంఖ్య 307 పెరిగి 850(815 రాష్ట్రాలు, 35 కేంద్రపాలిత ప్రాంతాలు)కి చేరుతుంది. ప్రస్తుతం ఒక ఎంపీకి నెల జీతం రూ.1.24 లక్షలు చెల్లిస్తున్నారు. దాంతోపాటు నియోజకవర్గంలో కార్యాలయ నిర్వహణకు రూ.70 వేలు, పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు రోజుకు రూ.2500 భత్యం, ఆఫీసు సిబ్బంది, ఇతర ఖర్చులకు మరో రూ.60వేలు చెల్లిస్తారు. ఇవి కాకుండా ఢిల్లీలో ఉచిత నివాస వసతి, కరెంటు, నీరు, ఫోన్, ఇంటర్నెట్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్, కుటుంబంతో సహా ఢిల్లీకి ఏటా 34సార్లు ఉచిత విమాన ప్రయాణం, ఉచిత వైద్యం వంటి సౌకర్యాలతో కలుపుకుని కనీసం రూ.5 లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. అది కాకుండా ఒక్కసారి ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే చాలు ఎంపీకి జీవితాంతం రూ.31 వేల పెన్షన్ చెల్లిస్తారు. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న 543 మంది ఎంపీలకు నెలకు 27.15 కోట్లు,, అదే వారి పదవీకాలమైన ఐదేళ్లకు లెక్కిస్తే రూ.325 కోట్లకుపైనే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇదే లెక్క ప్రకారం పునర్విభజన తర్వాత పెరిగే 850 మంది ఎంపీలకు ఏటా రూ.42.50 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.1629 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇదే లెక్క ప్రకారం పునర్విభజన తర్వాత వచ్చే 850 ఎంపీలకు ఏటా రూ.510 కోట్లు చొప్పున ఐదేళ్ల పదవీకాలంలో ఏకంగా రూ.2550 కోట్లు భరించాల్సి ఉంటుంది.

`ఇక రాష్ట్రాల పరిధిలోని ఎమ్మెల్యేల విషయానికొస్తే.. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పునర్విభజన తర్వాత వారి సంఖ్య 6186కు పెరుగుతుంది. ఎమ్మెల్యేల జీతభత్యాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. అందువల్ల ఖర్చులు మారుతుంటాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం 225 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీలిమిటేషన్ తర్వాత వీరు 263 మంది అవుతారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేకు బేసిక్ జీతం రూపంలో రూ.12వేలు, కార్యాలయ నిర్వహణకు రూ.1.13 లక్షలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు రోజుకు రూ.వెయ్యి నుంచి రెండువేలు దినభత్యం చెల్లిస్తారు. ఇవి కాకుండా రాష్ట్ర రాజధానిలో ఉచిత ప్రభుత్వ వసతి అది తీసుకోకపోతే అద్దె భత్యం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైలు ప్రయాణ ఖర్చుల రీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ ఖర్చుతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం, పీఏను పెట్టుకుంటే అతని జీతం, తక్కువ వడ్డీకి రూ.40 లక్షల వరకు రుణాన్ని రాష్ట్రప్రభుత్వం అందిస్తున్నది. ఇక ఒకసారి పూర్తిస్థాయి ఎమ్మెల్యేగా ఉన్నవారికి జీవితాంతం పెన్షన్ అందుతుంది. దీనిప్రకారం ఒక్కో ఎమ్మెల్యే జీతభత్యాలు కలిపి నెలకు కనీసం రూ.3 లక్షలు వేసుకున్నా ఏడాదికి రూ.36 లక్షలు అవుతుంది. అలా ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యేకు ప్రభుత్వం ఏటా రూ.63 కోట్లు, అదే ఐదేళ్లకు రూ.315 కోట్లు ఖర్చవుతోంది. ఇది ఒక్క ఏపీ ఖర్చు మాత్రమే. ఇదే లెక్క దేశవ్యాప్తంగా పెరిగే 6186 మంది ఎమ్మెల్యే ఖర్చును తీసుకుంటే ఏడాదికి 2226.96 కోట్లు, ఐదేళ్లకు రూ.11113 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

జవాబుదారీతనం ఏదీ?

ఈ ఖర్చులన్నీ భరించేది ప్రభుత్వమే కదా.. అనుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి ఆదాయం ప్రజల నుంచే వస్తుంది. రకరకాల పన్నుల వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయంలో నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలకు జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న ప్రజాప్రతినిధులతోపాటు పెరిగే ఎంపీ, ఎమ్మెల్యే జీతభత్యాలను కూడా అంతిమంగా ప్రజలే భరించకతప్పదన్నది నిష్ఠుర సత్యం. ఆ అదనపు ఆర్థికభారాన్ని తట్టుకునేందుకు లేదా సర్దుబాటు చేసేందుకు పథకాలు, అభివద్ధి పనుల్లో కోత వంటి చర్యలకు ప్రభుత్వాలు పూనుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. దీనివల్ల మళ్లీ నష్టపోయేది కూడా ప్రజలే. ఇంత భారం భరిస్తూ కొత్త ప్రజాప్రతినిధులను ఎందుకు తెచ్చువాలన్నది చాలామంది ప్రశ్న. ఒకవేళ నియోజవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు తప్పనిసరి అని ప్రభుత్వాలు భావిస్తే.. తమను ఎన్నుకున్న ప్రజలకు వారు జవాబుదారులుగా ఉంటూ బాథ్యతలకు కట్టుబడేలా నిబంధనలను కూడా పునర్విభజన బిల్లుతోపాటు తీసుకొస్తే బాగుంటుందని జనసామాన్యం సూచిస్తున్నది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page