
ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలం అయిందన్న వాస్తవాన్ని పాప్‌కార్న్ పన్ను వివాదం మరోసారి రుజువు చేసింది. సమస్యల పరిష్కారానికి బదులు సమస్యల బూచిని చూపించి ప్రభుత్వం ప్రజలను భయాందోళనలకు గురిచేయ బూనుకోవడం అంటే క్షేత్రస్థాయి వాస్తవికతతో ప్రభుత్వ ఆలోచనా విధానానికి మధ్య పొంతన లేదని ఒప్పుకోవడమే. ప్రభుత్వ ప్రకటనలు, విధాన నిర్ణయాలపై జరుగుతున్న బహిరంగ చర్చతో కేంద్ర ఆర్థిక మంత్రికి కోపం తెప్పించినట్లుంది. సామాజిక మాధ్యమాలు ఆర్థికమంత్రి పాప్‌కార్న్‌పై విధించిన పన్నుపై చర్చించుకుం టున్నప్పటికీ ప్రజలను భయభ్రాంతులను చేసి బీజేపీ ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించటమే అసలు చర్చ. ఈ వైఖరి కీలకమైన సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం వైఫల్యాలను చెప్పకనే చెప్తున్నాయి. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో జవాబుదారీతనాన్ని దాటవేస్తూ భక్తజనరంజక విషయాలపై ఎక్కుపెడుతోంది. పాప్‌కార్న్‌పై పన్ను వేయాలని డిసెంబరు 2024లో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ తీర్మానించింది. తదనుగుణంగా దేశంలో కాలక్షేపం కోసం తినే రకరకాల పాప్ కార్న్‌పై వేర్వేరు మోతాదుల్లో పన్ను విధిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. తాజా విధానం ప్రకారం ఎటువంటి బ్రాండూ లేకుండా ఉప్పు కలిపి అమ్మే పాప్‌కార్న్ మీద ఐదుశాతం పన్ను విధిస్తే, బ్రాండెడ్ పాప్‌కార్న్ మీద 12 శాతం పన్ను, కారమెల్ కాండీ చక్కెరలో ముంచి అమ్మే పాప్‌కార్న్ మీద 18 శాతం పన్ను అమల్లోకి రానుంది. కొంతమందికి ఇదేదో సాధారణ చర్యగానే కనిపించినా ఎక్కువమంది తీవ్రంగా స్పందించారు. రోజువారీ సాధారణ ప్రజల ఘోష అమాత్యుల చెవికెక్కటం లేదని చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ. ఇప్పటికే దేశంలో ప్రజలు ధరాభారంతో కుంగుతుంటే జనం కాలక్షేపం కోసం తినే పాప్‌కార్న్‌పై పన్నులు వేయటం అర్థరహితం. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు గమనిస్తే ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రజాగ్రహం కేవలం సామాజిక మాధ్యమాలకే పరిమితం కాలేదు. సంప్రదాయక మీడియాలో సైతం ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే కీలకమైన సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వ స్పందన దున్నపోతు మీద కురిసిన వానలాగా మారిపోతుందని చెప్పటానికి పాప్‌కార్న్ పన్ను మీద వస్తున్న విమర్శలకు ప్రభుత్వ స్పందన చూస్తే అర్థమవుతుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అంతరాలు వంటి మౌలిక సమస్యలను పట్టించుకోకుండా చిల్లర వ్యవహారాలపై కేంద్రీకరిస్తోంది. ఏనుగులు దూరే కంతలు వదిలిపెట్టి చీమలు దూరే కంతలు పూడ్చుకోవడంపై కేంద్రీకరించిన వైనం కనిపిస్తోంది. ఇటువంటి నిర్ణయాలు ప్రజల విని మయ సామర్ధ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. పాప్‌కార్న్ పన్ను ఒక్కటే కాదు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పన్నుల విషయంలో రూపొందించిన పలు విధానాలు వాస్తవ ఆర్థికచిత్రానికి సంబంధం లేకుండా పోవడంతో పలు విమర్శలకు కారణమయ్యాయి. ఉదాహరణకు పప్పు ధాన్యాలతో సహా కొన్ని లేబుల్స్ వేసిన ఆహార ధాన్యాలపై కూడా 18 శాతం పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రధానంగా దిగువ మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లు పెడుతుంది. గతంలో కూడా మహిళలు ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్‌పై 12 శాతం జిఎస్టీ విధించి ఆనక దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో ఉపసంహరించుకున్నారు. ఈ ఉదాహరణలు పరిశీలిస్తే ప్రజల వాస్తవిక జీవితం తో సంబంధం లేకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్న వైనం మనకు కనిపిస్తుంది. ప్రజల నిత్య జీవితావసర వస్తువులపై పదే పదే విధిస్తున్న జీఎస్టీ యావత్ సాధారణ ప్రజల జీవితాన్ని మరింత సంక్షుభితం చేయటంతో పాటు సంక్లిష్టంగా మారుస్తోంది. సరళతరమైన పన్నుల విధానాన్ని ఎవరైనా స్వాగతిస్తారు కానీ ప్రస్తుతం అమలు జరుగుతున్న పన్నుల విధానం రోజురోజుకూ సమస్యాత్మకంగా మారు తోంది. పాప్‌కార్న్ మీద ఇన్నిరకాల పన్నులు విధించటం గమనిస్తే అధికారుల చేతిలో కీలుబొమ్మగా మారిన పన్నుల వ్యవస్థ అటు ఉత్పత్తిదారులకూ ఇటు వినియోగదారులకూ కొత్త కొత్త సమస్యలు తెచ్చి పెడు తోందని అర్థమవుతుంది. ప్రజాప్రయోజనం, ప్రజాసంక్షేమం విధాన రూపకల్పన లక్ష్యం అన్న దిశ నుంచి ప్రభుత్వం ఎప్పుడో దారిమళ్లిన తీరుకు ఇది ఉదాహరణ. ఓవైపు ఆర్థిక రంగం నుంచి ప్రభుత్వం వైదొల గటమే సంస్కరణల సారాంశం పరమోద్దేశ్యం అని చెప్తూనే మరోవైపు సామాన్య ప్రజల దైనందిన జీవితం తో ముడిపడి ఉన్న ఆర్థిక విషయాలపై ప్రభుత్వ గుత్తాధిపత్యం పెరిగిపోవడాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ విధానం చిన్న మధ్యతరహా పరిశ్రమలపై హానికారకమైన ప్రభావాన్ని చూపుతోంది.
Comments