పాపాన్ని ఇండిగోపైనే నెట్టేస్తే ఎలా?!
- DV RAMANA

- Dec 13, 2025
- 2 min read

దేశ విమానయాన రంగంలో ఇండిగో సృష్టించిన సంక్షోభానికి అప్పుడే వారం రోజులు నిండిపోయాయి. కానీ ఇప్పటికీ అది పూర్తిస్థాయిలో సద్దుమణగలేదు. సంక్షోభం సమసిపోయిందని, వ్యవస్థ గాడిలో పడిరదని కేంద్రం ప్రకటించినా.. ఇంకా చాలా సర్వీసులు పునరుద్ధరణ కాలేదు. ఒకవేళ కేంద్రం చెప్పినట్లు ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగినా అది తాత్కాలికమేనని చెప్పాలి. ఎందుకంటే.. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్(ఎఫ్డీటీఎల్)కు అనుగుణంగా ఇండిగో వ్యవస్థలో మార్పులు చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తగిన సమయం ఇచ్చినా మార్పులు చేయకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. అందులోనూ 2400 విమాన సర్వీసులు కలిగిన బడా సంస్థను ఒక వ్యక్తి నడపటం బహుశా ఈ దేశాన్ని నడపటం కంటే కష్టమైనది కావచ్చు. ఎందుకంటే దేశాన్ని నడిపించే విషయంలో వంద అపశ్రుతులు దొర్లినా వాటిని సరిదిద్దుకోగలగడం అధికారులు, పాలకుల చేతుల్లోనే ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం లేదా అధికార వ్యవస్థ చేసే పెద్ద ప్రభావం చూపదు. కానీ ప్రైవేట్ సంస్థల విషయంలో అలా ఉండదు. నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకోవాలో.. వాటి ఫలితాలనూ అంతే వేగంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం, ప్రయాణికులు, ప్రతిపక్షాలు, పోటీ సంస్థలు.. ఇలా అన్నివైపుల నుంచీ వచ్చే ఒత్తిళ్లను తట్టుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. తప్పు జరిగినప్పుడు.. దాన్ని తట్టుకుని నిలబడగలగాలి కనుక వీటన్నింటినీ తట్టుకుని ఇండిగో క్రమక్రమంగా సర్వీసులను పునరిద్ధరిస్తూ సాధారణ పరిస్థితులను నెలకొల్పుతూ వస్తోంది. ఈ విషయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. ఈ సంక్షోభంలో ఇండిగోతో పాటు ఆయన కూడా ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. అవమానాలు పడే కంటే రాజీనామా చేయవచ్చు కదా.. అన్న వాదనలు రావచ్చు. కానీ అలా చేస్తే బాధ్యతలు అప్పగించిన దేశాన్ని, ప్రజలను సంక్షోభ సమయంలో నడిరోడ్డు వదిలి వెళ్లిపోవడమే అవుతుంది. బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు అవుతుంది. అందుకే అవమానాలకు ఎదురు నిలబడి పరిస్థితిని చక్కదిద్ది వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టడం ద్వారా సమర్థతను నిరూపించుకోవడమే ఉత్తమ మార్గం. సంక్షోభ కాలంలో విమర్శలు, అవమానాలు మన దేశంలో మామూలే. ఈ వాస్తవాలను గ్రహించే అటు ఇండిగో.. ఇటు రామ్మోహన్ నాయుడు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. క్రమంగా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. సరే.. ఈ సమస్యకు మరో పార్శ్వాన్ని పరిశీలిస్తే.. దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగానూ విమానయాన రంగం ఇటువంటి సవాళ్లనే ఎదుర్కొంటోంది. ప్రపంచంలో విమానాలు తయారుచేసే సంస్థల్లో ప్రముఖమైనవి రెండే రెండు. మరికొన్ని సంస్థలు ఉన్నా వాటికి అంత గుడ్‌విల్ లేదు. ఆ కారణంగా వాటికి ఆర్డర్లు ఇవ్వడానికి విమానయాన సంస్థలు ఇష్టపడటం లేదు. ఫలితంగా రెండు ప్రధాన సంస్థల వద్ద పదేళ్లకు సరిపడా ఆర్డర్స్ ఉన్నాయి. ఒక విమానం కొనుగోలుకు మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే అది మనకు అందడానికి పదేళ్లు వరకు పట్టే అవకాశం ఉంది. పైలెట్ల నియామకానిదీ అదే పరిస్థితి. నియమించి, అన్ని రకాల శిక్షణలు పూర్తిచూసి ఒక పైలెట్‌ను విమానం నడిపేందుకు పూర్తిస్థాయిలో నడపగలిగేలా సిద్ధం చేయటానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది. దీనికితోడు అందరూ ఇష్టపడే ప్రొఫెషన్ కానందున ప్రపంచవ్యాప్తంగా పైలెట్స్ షార్టేజ్ ఉంది. మరో విషయమేంటంటే.. ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్‌లకు సంబంధించి రాత్రి సర్వీసులు ఎక్కువగా ఉండవు. కానీ ఇండిగో అన్ని ప్రధాన నగరాలకు నైట్ సర్వీసులు నిర్వహిస్తోంది. 425 ఎయిర్‌క్రాఫ్ట్స్, 2400 సర్వీసులతో సుమారుగా 65 శాతం ఇండియా మొత్తాన్ని గమ్యం చేరుస్తున్నది ఇండిగో సంస్థే. అందుకే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నైట్ టైమ్ డ్యూటీ లిమిటేషన్స్ ఎక్కువగా ఇండిగో మీద ప్రభావం చూపించాయి. ఈ విషయం తెలియక నాయకుల నుంచి ప్రయాణికుల వరకు ఇండిగోపై విరుచుకుపడుతున్నారు. ఎఫ్డీటీఎల్ ప్రకారం మిగిలిన ఎయిర్‌లైన్స్ సంస్థలు అదనపు పైలెట్లను సమకూర్చుకున్నా ఇండిగో ఆపని చేయకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించడం సబబు కాదు. పైలెట్ల విషయంలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి ముందుచూపు లేకుండా ఒక ఆర్డర్ ఇచ్చి డూ ఆర్ డై అన్నట్లు పీక మీద కత్తి పెడితే.. బాధితులయ్యేది ప్రజలే. ప్రపంచంలో అతి తక్కువ ఏవియేషన్ కంపెనీలు ప్రయాణికులకు చేరువ అవుతాయి. వాటిలో ఇండిగో ఒకటి. అతి తక్కువ ఛార్జీలతో మరే సంస్థ విమానాలు నడపడం చూడలేదు. కానీ ఆ సంస్థే ఇప్పుడు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. ఎకాఎకిన పదిశాతం సర్వీసెస్ కట్ చేసి పడేశారు. ఇదే జోక్‌గా మారింది. ఎందుకంటే 2400 సర్వీసులకు అనుమతి ఉన్నా ఇండిగో ఎప్పుడూ పూర్థిస్థాయిలో సర్వీసులు నడపలేదు. అటువంటప్పుడు ఈ కోత వల్ల ఉపయోగమేమిటో అధికారులే చెప్పారు. ఇప్పటికిప్పుడు కొత్త సంస్థలను రంగంలోకి తెచ్చినా అవి సెటిలవ్వడానికే పదేళ్ల సమయం పడుతుంది. అంతవరకు ఇండియాను నడిపేది ఇండిగోనే. దీన్ని మోనోపలి అని కొందరంటున్నారు. కానీ మన అవసరం అని చెబితే బాగుంటుంది. అద్భుతమైన ఎయిర్ ఇండియాను నడపడం ప్రభుత్వానికి చేత కాలేదు. నష్టాల పేరుతో దాన్ని మళ్లీ టాటాల చేతుల్లో పెట్టేశారు. అదే ఇండిగోకు కలిసి వచ్చింది. ప్రయాణికులకు అక్కరకువచ్చింది. ఇప్పటికైనా మించినది లేదు. నియమాల పేరుతో వ్యవస్థలను, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడాలన్న మొన్నటి ప్రధాని మోదీ మాటల్లోని అంతరార్థాన్ని గ్రహిస్తే మంచిది.






Comments