top of page

పాపాలు కడిగేస్తున్నారు..!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • ప్రభుత్వం మద్యం సిబ్బందికి మంగళం

  • అప్పులు చేసి ఉద్యోగాలు కొన్న అభాగ్యులు

  • ఎక్సైజ్‌ శాఖకు కిక్‌.. సేల్స్‌మెన్‌లకు బ్యాడ్‌లక్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారడం, విధానాలు మారినప్పుడల్లా చిరుద్యోగులు బలైపోవడం సాధారణం. కాకపోతే ఈసారి ప్రభుత్వం మారుస్తున్న విధానం వల్ల నష్టపోతున్న చిరుద్యోగులు ఉద్యోగాలను మాత్రమే కాదు.. వారు అంతకు క్రితం కూడేసుకున్న సొమ్ములు కూడా. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వ్యాపారాన్ని చేపట్టింది. ఇందుకోసం సేల్స్‌మెన్‌లను, సూపర్‌వైజర్లను నియమించుకుంది. అప్పటి వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉన్న ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొంది. దీంతో సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్‌ పోస్టుల కోసం అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలతో సిఫార్సులు చేయించుకొని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కమ్‌ డిపో మేనేజర్లకు లక్షల్లో డబ్బులు ముట్టజెప్పి ఈ ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంతో వీరి ఉద్యోగానికి భద్రత లేకుండాపోయింది. ఏ ఖర్చూ లేకుండా ఈ ఉద్యోగాలు తెచ్చుకొనివుంటే ఇంత సమస్య ఉండేదికాదు. ఒకసారి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా చేరితే పర్మినెంట్‌ అయినా, కాకపోయినా కొనసాగింపునకు ఢోకా ఉండదని భావించి అనేకమంది అడిగినప్పుడల్లా సొమ్ములు చెల్లించేశారు. తీరా వచ్చే నెల నుంచి మద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో తాము అప్పు చేసి వివిధ దఫాలుగా చెల్లిస్తున్న సొమ్ముల మాటేమిటని ప్రభుత్వ వైన్‌షాపుల్లో పని చేస్తున్న వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుండటం వల్ల ఎక్సైజ్‌ శాఖకు అంతకు ముందు మాదిరిగా విచ్చలవిడిగా సొమ్ములు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ప్రభుత్వ షాపుల మీద కేసులు రాయడం, సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లను బదిలీ చేయడం, కౌంటర్‌లో సొమ్ములు తక్కువ ఉన్నాయని, లిక్కర్‌ కల్తీ అవుతోందని.. ఇలా రకరకాల పేర్లతో కేసులు రాసి సంబంధిత షాపులు నిర్వహిస్తున్న సేల్స్‌మెన్లు, సూపర్‌వైజర్ల నుంచి డిపో మేనేజర్‌ సుబ్బారావు ఇబ్బడిముబ్బడిగా సొమ్ములు దండుకున్నారు. ప్రతీ వైన్‌షాపు నుంచి ఏదో ఒక రూపంలో సొమ్ములు వసూలుచేసే పని పెట్టుకున్నారు. దీనికి స్వయంగా సేల్స్‌మెన్‌లు, సూపర్‌వైజర్లే మధ్యవర్తులుగా వ్యవహరించారు. 2019 నుంచి ఇప్పటి వరకు అనేక రూపాల్లో సొమ్ములు సమర్పించారు. ఇవన్నీ అప్పుచేసో, తప్పు చేసో ఎక్సైజ్‌ అధికారులకు సమర్పించినవే. ఎలా ఉన్నా తమకు భవిష్యత్తు ఉంటుందని భావించడం వల్లే ఇవన్నీ చేసుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రైవేటు షాపులు రావడం వల్ల వీరందరూ ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ప్రైవేటు యాజమాన్యాలకు షాపులివ్వడం ఎక్సైజ్‌ ఉద్యోగులకు ఆనందం కలిగిస్తుండగా, షాపుల్లో పని చేస్తున్నవారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ షాపుల్లో పని చేస్తున్నవారినే ప్రైవేటు యాజమాన్యాలు తీసుకుంటాయి కదా.. ఇందులో వారికొచ్చిన నష్టమేమిటన్న ప్రశ్న తలెత్తకమానదు. 2019కి ముందు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వైన్‌షాపులు ఉన్నప్పుడు అనేకమంది పని చేశారు. ప్రభుత్వ షాపులు వచ్చిన తర్వాత ఇందులో మూడొంతుల మందికి ఉపాధి లేకుండాపోయింది. ఇప్పుడు వారందర్నీ కొత్త షాపుల్లో అకామిడేట్‌ చేస్తారు. దీంతో ప్రభుత్వ షాపుల్లో పనిచేసిన వారిలో చాలామందికి ఉపాధి లేకుండాపోతుంది. 2019 నుంచి సేల్స్‌మెన్‌లు, సూపర్‌వైజర్లతో అనేక పాపాలు చేయించి ఇప్పుడు ఉపాధి లేకుండా చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.


అక్టోబర్‌ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ

అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం అక్టోబర్‌ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ మద్యం షాపుల స్థానంలో ప్రైవేట్‌ మద్యం దుకాణాలు రానున్నాయి. దీని కారణంగా జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారితో పాటు స్వీపర్లను కలుపుకొని 1,351 మంది ఆందోళన వ్యక్తంచేస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయనున్నారు. మద్యం ప్రైవేట్‌ చేతిలోకి వెళితే ఐదేళ్లుగా అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న సిబ్బందిని తొలగిస్తారన్న ప్రచారంతో ఉద్యోగులంతా ఆందోళనబాట పట్టారు. గత నెల రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించి నిరసన తెలిపారు. ఉద్యమ కార్యచరణలో భాగంగా ఈ నెల 7న మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం నూతన పాలసీ అమలుచేస్తే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల కుటుంబాలు రోడ్డున పడనున్నాయని ఉద్యోగులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్‌ ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించిన అప్పటి ప్రభుత్వం ఆ తర్వాత ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను కొనసాగిస్తూ వచ్చింది. ఐదేళ్ల పాటు అభద్రతా భావంతో విధులు నిర్వహించి ఉద్యోగ భద్రతకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా వేతనాలు

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న ఉద్యోగులంతా ఏపీ బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి బాధితులనే ఆరోపణలున్నాయి. కార్పొరేషన్‌ ఉద్యోగులుగా గుర్తిస్తామని హమీ ఇచ్చి ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లించడం, సిబ్బంది వేతనాల్లో కోతలు విధించడం చేశారని ఆరోపణలు వినిపించాయి. మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందిని ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌లో కలుపుతానని హామీ ఇచ్చినా దీన్ని అమలుచేయనీయకుండా వాసుదేవరెడ్డి అడ్డుకున్నట్లు ప్రచారం ఉంది. ఐదేళ్ల నుంచి వేతనాల్లో పీఎఫ్‌, ఈఎస్‌ఐ పేరుతో కోతలు విధించి అదనపు గంటలు పని చేసినందుకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి.

జిల్లాలో 193 ప్రభుత్వ మద్యం షాపులు

జిల్లాలో 193 ప్రభుత్వ మద్యం షాపుల్లో ఒక్కో షాపునకు ఒక సూపర్‌వైజర్‌, ముగ్గురు సేల్స్‌మెన్స్‌, వాచ్‌మెన్‌, సెక్యూరిటీగార్డ్‌, ఒక స్వీపర్‌ను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమించి వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది. పట్టణాల్లో మద్యం దుకాణాల్లో ఆరుగురు చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లో ఐదుగురు చొప్పున సిబ్బందిని నియమించారు. వీరితో పాటు ఒక స్వీపర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. బీకాం అర్హతతో సూపర్‌వైజర్‌, ఇంటర్‌ అర్హతతో సేల్స్‌మెన్‌లను ఏడాది కోసం విధుల్లోకి తీసుకొని ఆ తర్వాత రెడ్డి ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఒక ఏజెన్సీ ద్వారా రెండేళ్ల పాటు వీరికి వేతనాలు చెల్లించారు. తర్వాత థర్డ్‌ ఐ అనే మేన్‌పవర్‌ ఏజెన్సీ ద్వారా రెండున్నరేళ్లు కొనసాగించారు. ఆ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల కోసం ఆగస్టు 13న ఎన్డీయే ప్రభుత్వం మేన్‌పవర్‌ ఏజెన్సీ కోసం ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఈ`టెండర్‌ ప్రకటన విడుదల చేసి కొత్త ఏజెన్సీకి రెండు నెలల కోసం ఉద్యోగుల వేతనాలు చెల్లింపులకు టెండర్‌ ఇచ్చింది. కొందరి పనితీరు సంతృప్తికరంగా లేదని, అక్రమాలకు పాల్పడ్డారని తొలగిస్తూవచ్చారు. రెన్యువల్‌ కోసం, బదిలీల కోసం పెద్ద మొత్తంలో ఎక్సైజ్‌ అధికారులు సొమ్ములు దండేశారు. ఇది కాకుండా స్టాక్‌లో తేడాలు వంటివి వారితోనే కట్టించారు. ఎక్సైజ్‌ ఈఎస్‌ సుబ్బారావు లాంటివారు తమకు అవసరమైన ఫుల్‌బాటిళ్లు షాపు నుంచి తీసుకువెళ్లిపోయినా, అవి సిబ్బంది ఖాతాలోనే జమయ్యేవి. జిల్లాలో ఒక్కో పోస్టుకు రూ.60వేలు నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేశారు. నాయకులు సిఫార్సు చేసినా జేసీ స్థాయి వ్యక్తులు ఇంటర్వ్యూ చేసి తీసుకున్నామని చెప్పినా ఎక్సైజ్‌ ఈఎస్‌ మాత్రం సొమ్ములివ్వందే అపాయింట్‌మెంట్‌ ఆర్డరివ్వలేదు.. అది ఇప్పటి సుబ్బారావు గాని, అంతకు క్రితం పని చేసిన ఆదినారాయణమూర్తి గాని.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page