వైకాపా హయాంలో కాయల వెంకటరెడ్డి హవా
నిబంధనలను కాలరాసి 80 అడుగుల రోడ్డులో భారీ లేఅవుట్
ల్యాండ్ కన్వర్షన్ పూర్తిగా చేయలేదని ఆరోపణలు
ప్రభుత్వ, ఇతర వివాద భూములను కలిపేసుకున్నారని ఫిర్యాదులు
వాటిని పట్టించుకోకుండా లేఅవుట్‌కు అనుమతులు
రూల్స్‌ను అతిక్రమించి రిజర్వ్ స్థలాలపైనా పెత్తనం
ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు సర్కారు ఆదేశాలు

వైకాపా హయాంలో అటు ప్రభుత్వం.. ఇటు పార్టీలో కీలకంగా వ్యవహరించి.. సందట్లో సడేమియా అన్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నలుదిక్కులా విస్తరించిన నాయకుల గుండెల్లో ఎన్డీయే ప్రభుత్వం రైలు పరిగెత్తిస్తోంది. అటువంటి వారి లావాదేవీలపై దృష్టి సారించి కొరడా రaుళిపించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా టెక్కలి నియోజకవర్గ పరిశీలకుడిగా అన్నీ తానై వైకాపాను నడిపించిన కాయల వెంకటరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వేసిన లే అవుట్లపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. జిల్లాలో ఉన్న ప్రాంతీయ విజిలెన్స్ కార్యాలయం పరిధిలోకి వచ్చే విజయనగరంలో మూడిరటితోపాటు శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో వేసిన కేవీఆర్ లే అవుట్లపై విచారణ ప్రారంభమైంది. రెవెన్యూ, విజిలెన్స్, మైన్స్, జియోలాజికల్ విభాగాల అధికారులు ఈ విచారణలో భాగస్వాములయ్యారు. కేవీఆర్ లే అవుట్లకు సంబంధించి సుడా, వుడా అనుమతులతో పాటు భూమి కొనుగోలు, సర్వే, గ్రావెల్ తరలింపు, ల్యాండ్ మార్టగేజ్ తదితర అంశాలను తవ్వితీస్తున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలోని 80 అడుగుల రోడ్డులో కేవీఆర్ సంస్థ అభివృద్ధి చేసిన లే అవుట్‌కు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందారన్న ఆరోపణలున్నాయి. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన వివిధ రకాల రుసుములకు గండికొట్టినట్టు తెలసింది. రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులతో కుమ్మక్కై అడ్డగోలుగా లే అవుట్ వేసినట్టు కేవీఆర్ సంస్థపై విమర్శలు ఉన్నాయి. లే అవుట్ పేరుతో సేకరించిన భూమిలో ప్రభుత్వ భూమిని కూడా కలిపేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి అధికార పార్టీ నాయకుల అండ, రెవెన్యూ అధికారుల సహకారంతో వివాదాస్పద భూములను లే అవుట్‌లో కలిపేసినట్లు ఏడాది క్రితమే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. భూహక్కుదారులకు తెలియకుండా ఈ తతంగం నడిచిందన్న ఫిర్యాదుపై రెవెన్యూ అధికారులు స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. అరసవల్లి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 475/1,2,3,4,5లలో ఉన్న మొత్తం 18 ఎకరాల భూమిని సేకరించి లేఅవుట్‌గా రూపొందించారు. వ్యవసాయ భూమిగా ఉన్న దాన్ని ల్యాండ్ కన్వర్షన్ (భూ బదలాయింపు) చేయకుండానే అభివృద్ధి పనులు చేపట్టారు. అదే సమయంలో పక్కనే ఉన్న సర్వే నెం. 474/6లో ఉన్న 13 సెంట్ల వివాదాస్పద భూమిని కేవీఆర్ కొనుగోలు చేసినట్టు 2022 డిసెంబర్ 5న కృష్ణకుమారి, అపర్ణ అనే ఇద్దరు మహిళలు స్పందనలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు తెలియకుండా ఉమ్మడి ఆస్తిని రీసర్వేలో వేరొకరి పేరిట మార్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే అండగల్ జనరేట్ కాకుండా నిలిపివేసి సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించాల్సిన మండల రెవెన్యూ అధికారులు లేఅవుట్ యజమానికి అనుకూలంగా వ్యవహారం నడిపించారు.
అక్రమంగా గ్రావెల్ తరలింపు
ఈ వ్యవహారం పెండిరగ్‌లో ఉండగానే లేఅవుట్‌కు సేకరించిన భూమిలో కొన్నివేల మెట్రిక్ టన్నుల గ్రావెల్‌ను అక్రమంగా డంప్ చేశారు. దీనిపైనా ఫిర్యాదులు అందడంతో పలాస నుంచి గ్రావెల్ తరలిస్తున్నట్టు బిల్లులు సృష్టించి శ్రీకాకుళం పరిధిలో ఉన్న కొండల నుంచి అక్రమంగా గ్రావెల్‌ను తరలించారు. రూ.లక్షల విలువైన గ్రావెల్‌ను శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల ప్రాంతాల నుంచి తరలిస్తునట్టు ఫిర్యాదులు అందిన ప్రతిసారీ మైన్స్, రెవెన్యూ అధికారులు హడావుడి చేస్తూ వచ్చారు. మైన్స్ అధికారుల కనుసన్నల్లోనే వైకాపా నాయకులు సహజ వనరులను దోపిడీ చేసి సుమారు 10వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. ఈ సందర్భంలోనే గ్రావెల్ తరలింపునకు వినియోగించిన డంపర్ కేవీఆర్ లేఅవుట్ మీదుగా వెళుతున్న 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలి కాలి బూడిదైంది. ఈ వ్యవహారం వెలుగులోకి రాకుండా పోలీసులను మేనేజ్ చేశారు. ఇన్సూరెన్స్ కోసం కాలిపోయిన డంపర్ బయటకు కనిపించకుండా పచ్చటి పరదా కప్పేశారు.
కన్వర్షన్ చేయకుండా మేనేజ్ చేశారు
ఎన్నో మతలబుల మధ్య వేసిన కేవీఆర్ లే`అవుట్‌లో సర్వే నెంబర్ 475/ 1,2,3,4,5లలో కేవలం తొమ్మిది ఎకరాలకు మాత్రమే ల్యాండ్ కన్వర్షన్ చేయించారు. మిగతా తొమ్మిది ఎకరాలకు ల్యాండ్ కన్వర్షన్ చేయించకుండానే మొత్తం 18 ఎకరాల్లో లే అవుట్ వేసి చుట్టూ ప్రహరీ నిర్మించేశారు. కన్వర్షన్ చేయించని తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమికి రీసర్వే కూడా జరగలేదు. రీసర్వే కోసం డ్రోన్ ఎగురవేసినా సాంకేతిక కారణాల వల్ల డిజిటలైజేషన్ కాలేదు. దాంతో కేవీఆర్ కొనుగోలు చేసినట్టు చెబుతున్న తొమ్మిది ఎకరాలను లే అవుట్‌గా మార్చే అవకాశం లేదు. ఇక కన్వర్షన్ కోసం నాలా పన్ను కట్టిన తొమ్మిది ఎకరాల్లో 13 సెంట్ల వివాదాస్పద భూమితో పాటు ప్రభుత్వానికి చెందిన 20 సెంట్ల భూమి ఉన్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. అక్రమాన్ని సక్రమం చేసుకోవడానికి అప్పటి తహసీల్దార్‌కు లేఅవుట్‌లో సుమారు రూ.80 లక్షలు విలువ చేసే మూడు సెంట్ల ప్లాట్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ ప్లాట్‌ను సదరు రెవెన్యూ అధికారి తన బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతలోనే ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో తొమ్మిది ఎకరాల భూమి రీసర్వే కాకుండా నిలిచిపోయింది. దాంతో రీసర్వేలో వివాదాస్పద ప్రభుత్వ భూమిని జిరాయితీగా చూపించి ల్యాండ్ కన్వర్షన్‌కు ఇబ్బంది లేకుండా కేవీఆర్ సంస్థ చేసిన ప్రయత్నం విఫలమైంది. ముందుగా సేకరించిన తొమ్మిది ఎకరాలకు కన్వర్షన్ ఫీజు చెల్లించి లే అవుట్ కోసం సుడా నుంచి అనుమతులు పొందారు. సుడా నిబంధనల మేరకు తొమ్మిది ఎకరాల లేఅవుట్‌లో పది శాతం అంటే 90 సెంట్ల రిజర్వు స్థలం కేటాయించారు.
రిజర్వ్ స్థలాల్లోనూ సొంత ప్రయోజనాలు
పార్కుల నిర్మాణం, ఇతర సామాజిక అవసరాల కోసం ఆ 90 సెంట్లను నగరపాలకసంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. కాగా నిబంధనల ప్రకారం 90 సెంట్ల రిజర్వు స్థలం అంతా ఒకేచోట ఉండాలి. కానీ దాన్ని తుంగలో తొక్కి నాలుగు వేర్వేరు చోట్ల రిజర్వు స్థలం చూపించినా సుడా అధికారులు అడ్డు చెప్పలేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్‌కు సుడా అధికారులు అనుమతి ఇచ్చేశారు. నాలుగు చోట్ల ఉన్న 90 సెంట్ల రిజర్వు స్థలాన్ని లేఅవుట్ యజమానే అభివృద్ధి చేస్తున్నట్టు నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. రిజర్వు స్థలాన్ని ఏ విధంగా వినియోగించాలన్నది నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించాలి. కానీ లేఅవుట్ యజమాని తన కస్టమర్లను ఆకర్షించడానికి రిజర్వు స్థలాల్లో టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ పార్కు నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ ఒక్కో ప్లాట్ ధరను రూ.70 లక్షల నుంచి రూ.కోటిగా నిర్ణయించి వ్యాపారం చేస్తున్నట్టు నగరంలో చర్చ జరుగుతోంది. రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం) నిబంధనల ప్రకారం లేఅవుట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ది చేసిన తర్వాతే ప్లాట్లు విక్రయించాల్సి ఉండగా దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడే అమ్మేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపైనా విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన అధికారులంతా కేవీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవారేనని విమర్శలు ఉన్నాయి. విచారణలో కీలకంగా వ్యవహరించే మైన్స్, రెవెన్యూ అధికారులు కేవీఆర్ మోచేతి నీళ్లు తాగినవారేనంటున్నారు. వీరి వల్ల విచారణ పారదర్శకంగా సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో టెక్కలి నియోజకవర్గ పరిశీలకుడిగా కేవీఆర్ వ్యవహరించారు. వైకాపా నుంచి పోటీ చేసిన దువ్వాడ శ్రీనుకు నిధుల సమీకరణ కోసం ఆ ప్రాంతంలో ఉన్న క్రషర్లు, గ్రానైట్ ఇండస్ట్రీ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువచ్చారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. దీంతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు క్రషర్లు, గ్రానైట్ తరలింపును నిలిపివేయించారు. ఆ తర్వాత మిగిలినవారికి సడలింపు ఇచ్చినా కేవీఆర్ కనుసన్నల్లో నడిచిన క్రషర్లను ఇప్పటికీ ఆపే ఉంచారు. గ్రానైట్ వ్యాపారం మాత్రం నడుస్తోంది.
댓글