top of page

పాపాల ‘భైరి’వుడు..!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Oct 10
  • 2 min read
  • బంకులో వాటాలని నమ్మించి ఆస్తి కాజేశాడు

  • రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌

  • భార్య పేరుతో ఉన్న మరొకామె భూమికి ఎసరు

  • రికార్డులు మార్పించేసి తన ఖాతాలో కలిపేసిన 1.38 ఎకరాలు

  • గతంలో గెడ్డగట్టు ఆక్రమణపై ఫిర్యాదు

  • నకిలీ సంస్థతో బ్యాంకుకు టోకరా

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఈ ఫొటోలో కనిపిస్తున్నది మెట్ట బాలకృష్ణారావు, పక్కన ఆయన భార్య విశాలక్ష్మి. భారత్‌ పెట్రోల్‌బంక్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కొన్నేళ్ల క్రితం తీయించుకున్న ఫొటో ఇది. 50 శాతం వాటాదారులుగా భారత్‌ పెట్రోలియం బంకును శ్రీకాకుళం రూరల్‌ మండలం భైరి జంక్షన్‌లో ఏర్పాటు చేశామని తమ బంధుమిత్రులకు పంపడానికి తీయించుకున్న ఫొటో ఇది. ఆ సమయానికి ఈ వృద్ధ దంపతులకు తెలియదు.. ఎంతోమందిని మోసం చేసిన ఓ ఘరానా మోసగాడి చేతిలో వంచనకు గురవుతున్నామని.

కట్‌ చేస్తే..

మంచం మీద యూరిన్‌ బ్యాగ్‌తో ఉన్నది కూడా ఈ దంపతులే. నగదు, భూమితో పాటు సర్వం కోల్పోయిన తాము చావడం తప్ప మరో మార్గంలో లేమని మంచం పట్టిన ఈ కథకు కర్త, కర్మ, క్రియ భైరి వెంకటరమణ. కొద్ది రోజుల క్రితం ‘సత్యం’లో రబ్బరు పౌడర్‌ గొడౌన్‌కు తన భవనాన్ని అద్దెకిచ్చి, దాన్ని తగులబెట్టి షార్ట్‌ సర్క్యూట్‌ అన్న పేరుతో ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కోసం ప్రయత్నిస్తున్నారన్న కథనం ఒకటి ప్రచురితమైంది. అలాగే ఇదే గొడౌన్‌ను కాలువ గట్టు కొంతమేరకు ఆక్రమించి నిర్మించారని ‘సత్యం’ ప్రచురించింది. అలాగే చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాన్ని బ్యాంకు అధికారులకు చూపించి రూ.50 లక్షలు కేవీఏసీ రుణాన్ని సబ్సిడీతో నొక్కేసిన ఘనుడు ఈ భైరి వెంకటరమణే. ఇప్పుడు తాజాగా భైరి కేంద్రంగా ఆయన చేసిన అరాచకాలకు సామాన్యులు బలైపోయిన కథనాలు తెలుసుకుందాం.

2018 జూన్‌ 23న భైరిలో 31/2సి సర్వే నెంబరులో 29 సెంట్ల స్థలాన్ని దేవరశెట్టి విఠలేశ్వరరావు నుంచి మెట్ట విశాలక్ష్మి కొనుగోలు చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో 4406 డాక్యుమెంట్‌ ప్రకారం వీరికి ఈ స్థలం దఖలుపడిరది. అదే రోజు అదే దేవరశెట్టి విఠలేశ్వరరావు నుంచి భైరి వెంకటరమణ తండ్రి భైరి సూర్యనారాయణ 4407 డాక్యుమెంట్‌ నెంబరుతో 29 సెంట్లు కొనుగోలు చేశారు. ఈ రెండూ కలిపితే గాని పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి భారత పెట్రోలియం సంస్థ అనుమతులివ్వదని, 50 శాతం బంకులో వాటా ఇస్తామని చెప్పి విశాలక్ష్మి దంపతులకు వెంకటరమణ ఎరవేశాడు. ఆ తర్వాత బంకును కేవలం ఆయన పేరు మీదే రాయించుకున్నాడు. కొద్ది రోజుల అనంతరం భైరి సూర్యనారాయణ విశాలక్ష్మి తనకు 29 సెంట్ల భూమి ఇచ్చేశారని, మొత్తం ఇదే సర్వే నెంబరులో ఉన్న 54 సెంట్లు తన కుమారుడు భైరి సూర్యనారాయణకు గిఫ్ట్‌ డీడ్‌ కింద ఇచ్చేశాడు. ఈమేరకు నకిలీ పత్రాలు సృష్టించి 2024లో 19525 డాక్యుమెంట్‌ ప్రకారం భైరి వెంకటరమణ తన తండ్రి పేరు మీద కొన్న 29 సెంట్లతో పాటు పార్టనర్‌గా నమ్మి వచ్చిన విశాలక్ష్మికి చెందిన భూమిని నొక్కేశారు. దీంతో వీరు కోర్టును ఆశ్రయించి కేసు నమోదు చేయాలని కోరారు. కోర్టు ఉత్తర్వుల మేరకు భైరి వెంకటరమణతో పాటు మరో ఐదుగురిపై రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. బంకు కోసం రూ.3 కోట్లు పెట్టుబడి, రూ.2 కోట్లు విలువ చేసే స్థలం ఒకేసారి పోవడంతో ఈ దంపతులు మంచం పట్టేశారు. ప్రస్తుతం వీరి పరిస్థితి జీవన్మరణంగా ఉంది. దీనిపై కోర్టులో పోరాడుతుండటం వల్ల ఈ కేసు ఎప్పటికి తేలుతుందో తెలియక వృద్ధ దంపతులు నిరాశతో బతుకును వెళ్లదీస్తున్నారు.

ఇంతకంటే దారుణమైన విషయమేంటంటే.. భైరి వెంకటరమణ భార్య పేరు భైరి లలితకుమారి. ఈమె పేరుతో ఈ ప్రాంతంలోనే 166/2/1, 173/2 సర్వే నెంబర్లలో 2024 ఫిబ్రవరిలో 50 సెంట్ల స్థలాన్ని భైరి వెంకటరమణ కొనుగోలు చేశారు. అంతవరకు బాగానే ఉన్నా, ఇదే గ్రామంలో భైరి లలితకుమారి అనే మరో మహిళ ఉన్నారు. సామాజికవర్గం రీత్యా ఈమె బ్రాహ్మిణ్‌. ఈమె భర్త పేరు భైరి వెంకటసూర్యసత్యసాయి జగదీశ్వరప్రసాదరావు. ఈ లలితకుమారికి సర్వే నెంబరు 128/3, 128/4లో 1.38 ఎకరాల భూమి ఉంది. ఇద్దరు మహిళల పేర్లు ఒకటే కావడంతో ఇది కూడా తన భార్యకు చెందిన భూమేనని ఈ ఏడాది మే 28న భైరి వెంకటరమణ వీఆర్వో శ్రీనివాస్‌ను పట్టుకొని రికార్డులు మార్పించేశాడు. మ్యూటేషన్‌ కూడా జరిగిపోయింది. 1బిలో తన భార్య పాస్‌బుక్‌ ఖాతాలోనే ఈ భూమిని కూడా చేర్పించేశాడు వెంకటరమణ. అయితే ఈ విషయం ఇప్పటికీ జగదీశ్వరప్రసాదరావు భార్యకు తెలియదు. కేవలం తన భార్య పేరుతోనే మరొకరున్నారని, ఆమెకు దాదాపు ఒకటిన్నర ఎకరాల భూమి ఉందని తెలిసినప్పటి నుంచి భైరి వెంకటరమణ చేయని ప్రయత్నం లేదు. చివరకు కొద్ది నెలల క్రితం రికార్డులు మార్చేసి ఈ భూమిని సొంతం చేసుకున్నారు. అన్నింటికంటే విచిత్రమేమిటంటే.. భైరి వెంకటరమణ అక్రమాలపై స్వయంగా అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు పోరాటం చేస్తున్నా ఎటువంటి ఫలితం దక్కడంలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page