ఇదేదో సినిమాలో విన్న డైలాగులా ఉంది కదా.. కాదు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాలు వచ్చాక కార్పోరేట్ కాలేజీల్లో వారి పిల్లల్ని చేర్పించిన తల్లిదండ్రులు జపిస్తున్న మంత్రం. ‘మీ పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేయండి.. ఐఐటికి పంపండి..’ అన్న నినాదంతో లక్షల సంఖ్యలో పిల్లల్ని జాయిన్ చేసుకున్న కాలేజీలు ఇప్పుడు ‘మీ పిల్లల్లో ఆ సామర్థ్యం లేకపోతే మేమేం చేయగలం’ అని చేతులెత్తేస్తున్నాయి.

ఇంటర్ రెండేళ్లలో లక్షల్లో ఫీజు వసూలుచేసిన కార్పోరేట్ కాలేజీలు ఈ ఏడాది కనీస ప్రతిభ కనబరచిన దాఖలాలు లేవు. తమ పిల్లల ఫలితాల గురించి ప్రశ్నించిన తల్లిదండ్రులకు ఏప్రిల్ సెషన్ ఇంకొకటి ఉందని ఆశ చూపిస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ సెషన్‌లో విద్యార్థులు రాయబోయే పరీక్షల్లో పెద్దగా మార్కులు వ్యత్యాసం కనబడదు. అనేక మంది విద్యార్థులకు జనవరి సెషన్‌లో కంటే ఏప్రిల్ సెషన్‌లో మార్కులు తక్కువ వస్తుంటాయి. దీనికి కారణం లేకపోలేదు. ఒకసారి జనవరి సెషన్‌లో ఫలితాలు వచ్చాక విద్యార్థి రిలాక్స్ అయిపోతాడు. ఇదే తన సామర్థ్యం అని తమ తల్లి దండ్రులకు తెలిసేలా చేసేసి ఉంటాడు కాబట్టి పెద్దగా శ్రద్ధ కనబరచడు. అప్పటికే ఆ తల్లిదండ్రులు సదరు విద్యార్థిని ఎక్కడ జాయిన్ చేయాలో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అనేక ప్రైవేటు యూనివర్సిటీల గురించి వాకబు చేస్తారు. ఇది పిల్లలు గ్రహిస్తారు. ఇదే వారి అశ్రద్ధకు దారి తీస్తుంది.
గతంలో మనం అనేక సందర్భాల్లో చెప్పినట్టు పదో తరగతి వరకు స్టేట్ సిలబస్ చదివిన విద్యార్థి జాతీయ స్థాయి పరీక్షలైన మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్ తరహా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడం కష్టం. ఇంటర్ రెండేళ్లలో స్టేట్ బోర్డు పరీక్షలకు సన్నద్ధం అవుతూ ఎన్‌సిఆర్‌టీ ప్రిపేర్ అవడం అంత సులభతరం కాదు. ఇది చాలా కొద్దిమందికే సాధ్యపడుతుంది. ఇది కాలేజీ వాళ్లు చెప్పరు, దీన్ని అర్థం చేసుకోగల స్థితిలో తల్లిదండ్రులు ఉండరు. వీధిలో ఎవరికో వచ్చిందని, పేపర్లలో ఒకరిద్దరు ఫోటోలు చూసి తమ పిల్లలు ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. దాంట్లో తప్పు కూడా లేదు. కానీ పిల్లల మేధస్సు అర్థం చేసుకోకుండా లక్ష్యాలు నిర్దేశించడం సరికాదు. సరిగ్గా ఇక్కడే కార్పొరేట్ కాలేజీల వారు తల్లిదండ్రుల బలహీనత గ్రహించి లాంగ్ టర్మ్‌కు ఉసిగొల్పుతారు. లాంగ్ టర్మ్‌లో సక్సెస్ రేట్ 10 లేదా 20 శాతానికి మించదు. ఇది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఈ ఏడాది సుమారు 12.50 లక్షల మంది విద్యార్ధులు మెయిన్స్ పరీక్షలు రాశారు. ఇక సీట్ల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 17,740, ఎన్‌ఐటీలలో 24, 229, ట్రిపుల్ ఐటీల్లో సుమారు 8,500 సీట్లు ఉన్నాయి. అంటే అన్ని కలుపుకుని 50వేల సీట్లు. వీటిలో మన పిల్లలకు సీట్లు రావాలి. ఇలాంటి ఆట మనం వారితో ఆడిస్తున్నాం.
ఐఐటి, ఎన్‌ఐటిలలో సీటు వచ్చినంత మాత్రాన పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అర్థం కాదు. వాటిల్లో గత కొద్ది కాలంగా ఉద్యోగావకాశాలు శాతం గణనీయంగా తగ్గుతుండడం చూస్తున్నాం. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం చెప్పాలి, వారిని అర్థం చేసుకునేలా మాట్లాడాలి. సాధారణంగా కార్పోరేట్ కాలేజీల్లో మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్ పరీక్షలు మినహా మరో పరీక్షకు పిల్లల్ని సిద్ధం చేయరు. వీటికి ప్రత్యామ్నాయంగా అనేక పరీక్షలు ఉన్నాయని మనమే తెలియజేయాలి. వీలైతే సంబంధిత నిపుణులతో మాట్లాడండి. మీ పిల్లల అలవాట్లు, చదువుపై వారికున్న శ్రద్ధ, లక్ష్యాలు వారికి తెలియజేయండి. మీకు అనేక వర్సిటీల వివరాలు వారే తెలియజేస్తారు.
` సీహెచ్ దుర్గాప్రసాద్
మీరు చెప్పేది ఎలా ఉందంటే ఇంగ్లీష్ మీడియం వద్దన వారు వాళ్ళ పిల్లలను ఇంగ్లీష్ మీడియం లో చేర్చినట్లుంది. నిజమే అనేక రకాల చదువులు ఉండవచ్చు. కానీ ఎందులో ఎక్కువ అవకాశాలు ఉంటే దానికే ఎవరైనా ప్రాధాన్యమిస్తారు. రన్నింగ్ రేసు లో మొదటి ముగ్గురు కే బహుమతులు ఇస్తారు కాబట్టి ముగ్గురే పరిగెత్తండి మిగతా వారు వద్దు అన్నట్లు ఉంది ఈ సారాంశం.