దేవభూమి మరుభూమిగా మారడానికి కారణాలనేకం
కేరళకు ఇటువంటి విపత్తులు సర్వసాధారణం
అయినా శాశ్వత చర్యలు చర్యలు చేపట్టడంలో ఉదాసీనత
వయనాడ్ ఘోరకలిలో 250 దాటిన మృతుల సంఖ్య
ఇప్పటికీ లభించని 200 మందికిపైగా ఆచూకీ

‘‘ఈ విపత్తు గురించి కేరళ సర్కారును వారం ముందే అప్రమత్తం చేశాం. జూలై 29న విలయం సంభవిస్తే కేంద్రం 23నే ముందస్తు హెచ్చరికలు పంపింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు’’ అని రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.
‘‘కొండ చరియలు విరిగిపడిన ప్రాంతానికి సుదూరంగా ఉన్న గ్రామాలపై వరద తాకిడితో పాటు బురద వెల్లువెత్తింది. వాతావరణ హెచ్చరికల ఆధారంగా కొండ దిగువనున్న ప్రాంతాలకు ఖాళీ చేయించాం. కానీ ఊహించని విధంగా దూరంగా ఉన్న గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇది అత్యంత దురదృష్టకరం..’’ అని కేరళ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
‘‘రాష్ట్రంలో అడవులు విపరీతంగా నరికివేతకు గురవుతున్నాయి. ఫలితంగా భూమి గట్టిదనం కోల్పోయి కొండ చరియలు విరిగి పడటానికి, సముద్ర వాతావరణం వేడెక్కి కుంభవృష్టి కురుస్తోంది..’’ ఇది వాతావరణ నిపుణులు చెబుతున్న మాట.
ఎవరి వాదన ఎలా ఉన్నా.. దేవభూమి మరుభూమిగా మారిపోయింది. వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇంకా ఎందరో ఆచూకీ లేకుండాపోయారు. భూతలస్వర్గంగా భాసిల్లే కేరళలోని వయనాడ్ ప్రాంతం ఒక్కసారిగా ప్రేతకళ ఆవరించుకుని భయానకంగా మారిపోయింది. ఈ ఘోరకలికి ప్రకృతి విపత్తులు ఎంత కారణమో.. మానవ తప్పిదానిది కూడా అంతే బాధ్యత అని స్పష్టమవుతోంది.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ప్రకృతి అందాలకు ఆటపట్టుగా నిలిచే కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడి కొండ ప్రాంతాల్లో జూలై 29న అర్ధరాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రకృతి విపత్తు విరుచుకుపడిరది. అర్ధరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు విలయం సృష్టించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి తోడు కొండల్లోంచి పోటెత్తి ప్రవహిస్తున్న ఛళియార్ నది తీవ్రతకు వయనాడ్ జిల్లాలోని మెప్పాడి ప్రాంతంలో కొండలు విరిగి పడటం అవి వరద ప్రవాహంతో పాటు నాలుగు గ్రామాలపైకి దండెత్తాయి. వాటికి బురద తోడైంది. ఫలితంగా ముందక్కై, చూరమల, అత్తామల, నూల్ఫుజ గ్రామాలు కొట్టుకుపోయి నామరూపల్లేకుండాపోయాయి. రెండు గంటల వ్యవధిలోనే నాలుగుసార్లు కొండచరియలు దొర్లుకుంటూ గ్రామాలపై పడటంతో నిద్రలో ఉన్న ప్రజలు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే వందల సంఖ్యలో మృత్యుఒడిలోకి చేరుకున్నారు. ఈ విపత్తులో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూ ఇప్పటికి 256కు చేరుకుంది. మరో 200 మందికి పైగా ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వందల సంఖ్యలో క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నది చీలిపోవడమే కారణమా?
కేరళలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ కొండ చరియలు విరిగి పడటం సహజమే. అలాంటప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాల్సింది. కానీ అలాంటి ఏర్పాట్లు జరగలేదని అర్థమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పార్లమెంటులో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. విపత్తు ముంచుకు రాచ్చని వారం ముందే కేరళ ప్రభుత్వానికి వాతావరణ శాఖ హెచ్చరించిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కేరళ సర్కారు మరో వాదన వినిపిస్తోంది. రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సెక్రటరీ డాక్టర్ శేఖర్ లుకోస్ మాట్లాడుతూ ఇది ఏమాత్రం ఊహించని ఉపద్రవమని వ్యాఖ్యానించారు. ప్రధానంగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఛళియార్ నది వెడల్పు అకస్మాత్తుగా పెరగడంతో పాటు రెండుగా చీలిపోవడం వల్లే దారుణం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా ముప్పు ఉందని భావించిన మెప్పాడి ప్రాంతంలోని మూడు కాలనీలను ప్రమాదం జరగడానికి ముందురోజే ఖాళీ చేయించామని ఆయన చెప్పుకొచ్చారు. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతం నుంచి ప్రస్తుతం కొట్టుకుపోయిన గ్రామాలు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, కొండ చరియలు విరిగిపడినా ఎటువంటి ప్రభావం పడని ఆ గ్రామాలపైకి కొండ చరియలు దండెత్తడం అన్నది ఏమాత్రం ఊహించని పరిణామమని పేర్కొన్నారు. కానీ ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు ఛళియార్ నది వెడల్పు పెంచుకుని వరదతో పాటు బురదకు మెప్పాడి ప్రాంతంలో విరిగిపడిన కొండ చరియలను కూడా తనతో పాటు తీసుకెళ్లి నాలుగు గ్రామాలను ఊడ్చిపారేసిందని శేఖర్ వివరించారు.
2019 తరహాలోనే..
రుతుపవనాల ప్రభావంతో కేరళలో రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేల మొత్తం తేమగా మారింది. ఇదే సమయంలో వేడిగాలుల కారణంగా అరేబియా తీరంలో దట్టమైన మేఘాల వ్యవస్థ ఏర్పడిరది. ఫలితంగా 2019 తరహాలోనే క్లౌడ్ బరస్ట్ అయ్యి వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కన్నూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. దీన్ని శాస్త్రవేత్తలు ముందే గుర్తించారు. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని అట్మాస్ఫియర్ రాడార్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అభిలాష్ మాటల్లో చెప్పాలంటే అరేబియా సముద్రం వేడెక్కుతుండటం వల్ల కేరళ సహా పశ్చిమ కనుమల్లోని ప్రాంతాలు పర్యావరణపరంగా అనిశ్చితికి లోనవుతున్నాయి. దట్టమైన మేఘాలు ఏర్పడి తరచూ అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తరహా పరిస్థితి కేరళలో గత ఎనిమిదేళ్లుగా కనిపిస్తోంది.
వేగంగా తరిగిపోతున్న అడవులు
కేరళకు ఈ తరహా విపత్తులు కొత్త కాదు. జల ప్రళయాలు ఊహించనివి కావు. ఈ దుస్థితికి కారణం రాష్ట్రంలో అడవులు శరవేగంగా తరిగిపోతుండటమేనని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు తరచూ కొండ చరియలు విరిగిపడి కింద ఉన్న చెట్లుచేమలను నాశనం చేస్తున్నాయి. ప్రమాదకరమైన కొండ ప్రాంతాలు ఎక్కువగా కేరళలోనే ఉండటం కూడా మరో కారణంగా చెబుతున్నారు. భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) విడుదల చేసిన ల్యాండ్ స్లైడ్స్ పటం గుర్తించిన అత్యంత ప్రమాదకరమైన 30 కొండ చరియల్లో పది కేరళలోనే ఉన్నాయి. 2021లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం ఆ రాష్ట్రంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో 59 శాతం ప్లాంటేషన్ జరిగిన ప్రాంతాల్లోనే సంభవించాయి. 1950 నుంచి 2018 వరకు వయనాడ్ జిల్లాలో 62 శాతం అటవీ ప్రాంతం మాయమైనట్టు నిర్ధారించారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం 1950 వరకు వయనాడ్ జిల్లాలో 85 శాతం అటవీ ప్రాంతం ఉండేది. కానీ తర్వాత కాలంలో జనావాసాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అవసరాల పేరుతో అడవులను విచ్చలవిడిగా నాశనం చేసేశారు. అటవీ ప్రాంతం తగ్గేకొద్దీ భారీ వర్షాలు పడే కొండప్రాంతాలు వదులుగా మారిపోతాయి. అంటే భూమి పటుత్వం కోల్పోతుంది. ఫలితంగా కొండలు కదిలి వరద ప్రవాహాల ఉధృతిని తట్టుకోలేక విరిగి పడిపోతుంటాయి.
కేరళను ముంచెత్తిన జల ప్రళయాలు
`2018 ఆగస్టులో సంభవించిన వరద కేరళ చరిత్రలో అతి పెద్దది. అప్పట్లో ఏకంగా 483 మంది మరణించారు. 14.5 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. 57వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.
`2019లో వయనాడ్ జిల్లా పుత్తుమలలో కొండ చరియలు విరిగిపడి 17 మంది మరణించారు.
`2021 అక్టోబరులో ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడి 35 మంది మృత్యువాత పడ్డారు.
`2022 ఆగస్టులో సంభవించిన ఆకస్మిక వరదల్లో 18 మంది మరణించారు.
కొసమెరుపు: 2015 నుంచి 2022 వరకు దేశంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు 3,782 జరగగా, వాటిలో 2,239 ఘటనలు ఒక్క కేరళలోనే జరిగాయంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Comments