
పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. అటు హమాస్.. ఇటు హిజ్బొల్లా.. మరోవైపు లెబనాన్, పాల స్తీనా, ఇరాన్.. ఇలా అన్నివైపుల నుంచి చుట్టుముట్టడంతో ఇజ్రాయెల్ సైతం తానేమీ తీసుపోనంటూ ప్రత్యర్థి లక్ష్యాలపై తీవ్ర దాడులు జరుపుతోంది. ఫలితంగా పశ్చిమాసియా మొత్తం యుద్ధక్షేత్రంలా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇప్పటికే దేశంలో ఎమర్జెన్సీ విధించగా మిగిలిన దేశాల్లోనూ పౌరజీవనం ప్రమాదంలో పడిరది. ఈ పరిస్థితికి మొదటి కారకురాలిగా పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న హమాస్‌ను పేర్కొనాలి. గత అక్టోబర్ ఏడో తేదీన రాకెట్ దాడులతో హమాస్ ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున రాకెట్ దాడులకు పాల్పడి కవ్వించడంతో మొదలైన ఉద్రిక్తతలు నెలలు గడుస్తున్నా తీవ్రతరమవు తున్నాయే తప్ప ఉపశమించడంలేదు. అప్పట్లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఐదువేల రాకెట్లను ప్రయోగించారు. అయితే ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న దుర్భేధ్యమైన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ రాకెట్ దాడులను చాలావరకు విజయవంతంగా అడ్డుకోగలిగింది. హమాస్ చర్యతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై వరుస దాడులకు పాల్పడటంతో హమాస్ స్థావరాలతో పాటు హాస్పిటల్స్ వంటి పౌరవ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందలాదిమంది చనిపోయారు. అప్పటినుంచి దాడులు, ప్రతిదాడులు కొనసాగు తూనే ఉన్నాయి. తమకు హాని చేసే వారికి తిరిగి హాని తలపెట్టేందుకు తాము వెనుకాడేది లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెగేసే చెప్పేశారు. అమెరికా, ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్నా, వారి స్తున్నా ఇరువైపులా ఎవరూ విని పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పుడు హమాస్‌తో పాటు లెబనాన్ సాయుధ దళాలైన హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగాయి. హెజ్బొల్లా తీవ్రవాదులు దాడులకు పాల్పడ వచ్చన్న ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ దానికంటే ముందు తానే లెబనాన్ భూభాగం లోని హిజ్బొల్లా స్థావరాలతో వందకుపైగా యుద్ధ విమానాలతో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దానికి ప్రతిగా హెజ్బొల్లా దళాలు 300 కత్యూషా రకం రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడ్డారు. ఇజ్రా యెల్ కొన్ని రోజుల వ్యవధిలోనే తమకు విరోధులైన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేతో పాటు హెజ్బొల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన ఫవాద్ షుకూర్‌ను తన గూఢచారుల సహాయంతో హతమార్చింది. దాంతో ఆ రెండు సంస్థలు ఇజ్రాయెల్‌పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వాటికి లెబనాన్, ఇరాన్ సహకరి స్తున్నాయి. తనను రెచ్చగొట్టిన హమాస్‌ను కోలుకోనీయకుండా చేసేందుకు ఇజ్రాయెల్ గత పది నెలలుగా పాలస్తీనాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేసి అపార నష్టం కలుగజేస్తోంది. హమాస్ చేతిలో బందీలైన తన పౌరులను కూడా ఇజ్రాయెల్ విడిపించుకుంది. హమాస్ చీఫ్‌ను మట్టుబెట్టినందున దాని కార్యకలాపా లు, దాడులు తగ్గుతాయని ఊహించింది. కానీ హనియా హత్యపై హెజ్బొల్లా, ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్‌పై దాడుల విషయంలో హమాస్‌కు సహకరిస్తున్నాయి. అలాగే అధ్యక్షుడి లేని హమాస్ బలహీనపడుతుందనుకుంటే అనూహ్యంగా మళ్లీ పుంజుకుంది. హమాస్ కొత్త అధిపతిగా యాహ్యా సిన్వార్ పదవీ బాధ్యతలతో పాటు యుద్ధ బాధ్యతను కూడా తీసుకుని ఇజ్రాయెల్‌పై దాడుల ఉధృతి పెంచారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా లక్ష్యం కూడా యాహ్యా సిన్వార్‌ను అడ్డుతొలగించుకోవడమేనని తెలు స్తోంది. కొన్ని నెలలుగా సిన్వార్ ఆచూకీ కోసం ఆ రెండు దేశాల నిఘావర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈలోగా హమాస్ వద్ద ఉన్న అమెరికన్ బందీలను విడిపించే విషయంలో ఇజ్రాయెల్, అమెరికాలు పరస్పరం సమా చారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. సిన్వార్‌ను అడ్డు తొలగించుకుంటే హమాస్ చాలావరకు అంతరించిపో తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే సిన్వార్ ఎలక్ట్రానిక్ కమ్యూనిషన్ వ్యవస్థను వాడకుండా పవర్ జన రేటర్లకు ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకుని అనలాగ్ మోడ్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తుండటంతో పాటు, ఎక్కువగా కొరియర్లపై ఆధారపడుతుండటంతో అతని అనుపానులు తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికాలను ముప్పుతిప్పలు పెడుతున్న సిన్వార్ హమాస్ తరఫున రాజీలేని పోరాటాలు చేస్తున్న వారిలో అగ్రగణ్యుడు. 1980 ప్రాంతంలో గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీలో జరిగిన ఆక్రమణల వ్యతిరేక పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ పలుమార్లు అతన్ని అరెస్టు చేసింది. గ్రాడ్యు యేషన్ పూర్తిచేసిన తర్వాత ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన లక్ష్యంతో ఒక ప్రత్యేక నెట్ వర్క్‌ను రూపొందించాడు. తర్వాత కాలంలో ఈ దళమే హమాస్ సైనిక విభాగంలో కస్పామ్ బ్రిగేడ్స్‌గా ప్రసిద్ధి చెందింది. ఇటీవలి దాడుల్లో మరణించిన కస్పామ్ బ్రిగేడ్స్ అధిపతి మహమ్మద్ దీఫ్‌తో కలిసి సిన్వార్ ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 నాటి దాడులకు ప్రణాళిక రచించి అమలు చేయడం ద్వారా ప్రస్తుత యుద్ధ పరి స్థితులకు కారకుడయ్యాడు. ఇజ్రాయెల్‌లో 23 ఏళ్లు జైలు జీవితం గడిపిన సిన్వార్ యూదు భాష అయిన హిబ్రూ నేర్చుకున్నాడు. అలాగే ఇజ్రాయెల్ రాజకీయ, సామాజిక పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. 2011లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ చెర నుంచి బయటపడి సిన్వార్ గాజాకు తిరిగివచ్చి హమాస్ దళాలను ముందుండి నడిపించడం ప్రారంభిం చాడు. హమాస్ చీఫ్‌ను ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించి ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులతో విరుచుకుపడుతున్నాడు.
Comments