top of page

ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు

Writer: ADMINADMIN
  • సబ్జెక్ట్‌ టీచర్స్‌ నియామకం వైపు అడుగులు

  • యూనివర్సిటీల్లో అక్రమాలపై నివేదిక కోరాం

  • విద్యావ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం

  • సూపర్‌`6ను చిత్తశుద్ధితో అమలుచేస్తాం

  • నగరంలో మంత్రి లోకేష్‌ ఆకస్మిక పర్యటన

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియమించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. అదే పద్ధతిలో సబ్జెక్ట్‌ టీచర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విశాఖపట్నంలో ప్రజాదర్బార్‌లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేష్‌ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పాతర్లపల్లి పాఠశాలలో షేడ్‌ కూలి విద్యార్థి మరణించిన ఘటన స్థలానికి వెళ్లారు. ఈ విషయం ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులెవరికీ తెలియదు. అదే సమయంలో ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ మరో కార్యక్రమంలో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం చేరుకొని నగరంలోని ఎచ్చెర్లవీధిలో మున్సిపల్‌ ఎలిమెంటరీ స్కూల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక్కడ కూడా టీడీపీ నాయకులకు నారా లోకేష్‌ వచ్చిన విషయం ఏమాత్రం తెలియదు. ముందుగా పసిగట్టిన మీడియా కన్ఫర్మేషన్‌ కోసం తెలుగుదేశం నేతలకు వాకబు చేసిన తర్వాత మాత్రమే వారికి తెలిసింది. విద్యార్ధులతో ముచ్చటించి, మధ్యాహ్న భోజనం, ఆంగ్ల మాధ్యమం, పాఠశాలలో మౌలిక సదుపాయాలు, విద్యాబోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌పై విద్యార్ధులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఒక విద్యార్ధి మధ్యాహ్న భోజనంలో పెరుగు సరఫరా చేయాలని కోరగా, సాధ్యం కాదని తెలిపారు. మరో విద్యార్ధి తరగతి గదిలో బెంచీలు కావాలని కోరగా, తప్పనిసరిగా సమకూర్చుతామన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షించి విద్యావ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిందని, దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర విద్యాపరమైన అంశాలపై ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాఠశాల పేరెంట్‌ కమిటీతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకొని వీటి ఆధారంగా బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్నారు.

వీసీలుగా చేసినవారంతా వైకాపా కార్యకర్తలే వైకాపా హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీల్లో వీసీలుగా చేసిన వారంతా వైకాపా కార్యకర్తలేనన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో వైకాపా హయాంలో ఏమి జరిగిందో అందరూ చూశారని గుర్తుచేశారు. అదే మాదిరిగా అన్ని యూనివర్సిటీల్లో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఉన్నతాధికారులకు నివేదిక కోరామన్నారు. పూర్తిస్థాయి విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వైకాపా హయాంలో చట్టాన్ని చేతుల్లో తీసుకొని టీడీపీ కార్యకర్తలు, ప్రజలను వేధించి హింసించారని, అలాంటి వారిని చట్టం పరిధిలో శిక్షిస్తామన్న అంశాన్నే బహిరంగ వేదికలపై ప్రస్తావించానన్నారు. దాని ఫలితంగానే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్‌ అయ్యారన్నారు. మత విశ్వాసాలను కాపాడాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐదేళ్లు పరదాల మాటున తిరిగిన జగన్‌ ప్రజల్లోకి వచ్చి తిరుగుతామంటే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాన్ని చిత్తశుద్ధితో అమలుచేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆయాలకు వేతన బకాయిలు ఉన్నాయని, వాటిని త్వరితగతిన మంజూరు చేయడానికి చర్యలు చేపట్టామని, నాడు`నేడు పథకాన్ని వైకాపా ప్రభుత్వం ప్రారంభించి మధ్యలోనే నిలిపేసిందన్నారు. దీనికి సంబంధించి జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలిస్తున్నామని, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచన చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో సూపర్‌ సిక్స్‌లో మూడు అమలు చేశామని, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని దీపావళి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.



 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page