top of page

ప్రతిభా సంపన్నుడు.. ఈ పోలీస్‌ నాయుడు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 22
  • 2 min read
  • డీసీపీ కృష్ణమూర్తినాయుడుకు మహోన్నత సేవా పతకం

  • ఎస్సై నుంచి ఎస్పీ స్థాయికి ఎదిగిన ఘనత

  • సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలు


(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఆయన చదివింది విద్యారంగానికి సంబంధించిన కోర్సు. కానీ చేస్తున్నది సమాజంలో శాంతిభద్రతలు పరిరక్షించే ఉద్యోగం. తన చదువుకు సంబంధించని ఉద్యోగమైనా పూర్తి అంకితభావంతో పనిచేస్తూ వృత్తిపరంగా ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి నేడు డిప్యూటీ కమిషనర్‌ స్థాయికి ఎదిగారు. ఆయనే ఎం.కృష్ణమూర్తి నాయుడు. ప్రస్తుతం విజయవాడ కమిషనరేట్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న ఆయన ఎంఏ, బీఈడీతో పాటు పీహెచ్‌డీ చేసినా టీచర్‌గా కాకుండా మక్కువతో పోలీస్‌ ఉద్యోగంలో చేరడం విశేషం. మూడున్నర దశాబ్దాలకు పైగా ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయన తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాల్లో మహోన్నత సేవా పతకానికి ఎంపిక కావడం విశేషం.

శ్రీకాకుళం జిల్లాతో అనుబంధం

1989 ఎస్సై బ్యాచ్‌కు చెందిన కృష్ణమూర్తినాయుడు తన బ్యాచ్‌లో వైజాగ్‌ జోన్‌ టాపర్‌గా నిలిచారు. శిక్షణ అనంతరం విశాఖ రూరల్‌ జిల్లాలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంలో తొలి పోస్టింగ్‌ పొందారు. 1999లో సీఐగా ప్రమోషన్‌ పొందిన నాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్‌ పొందారు. విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరిస్తూ రాజాం ప్రాంత ప్రజల ప్రశంసలు అందుకున్నారు. 2005లో డిప్యూటేషన్‌పై శ్రీకాకుళం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో పని చేశారు. 2009లో డీఎస్పీగా ప్రమోషన్‌ అందుకున్న కృష్ణమూర్తినాయుడు విశాఖ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈస్ట్‌ డివిజన్‌ ఏసీపీగా పని చేశారు. 2012 నుంచి 2014 వరకు ఏపీఎస్పీ ఐదో బెటాలియన్‌లోనూ, 2015 నుంచి 2017 వరకు రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోనూ పని చేశారు. అనంతరం మళ్లీ శ్రీకాకుళానికి బదిలీ అయిన నాయుడు 2018`2019 మధ్య శ్రీకాకుళం స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్బీ) డీఎస్పీగా పని చేశారు. 2019`2020 సంవత్సరాల్లో విద్యాశాఖకు డిప్యూటేషన్‌పై వెళ్లిన ఆయన విజయనగరంలో పని చేశారు. అనంతరం తిరిగి పోలీస్‌ శాఖకు వచ్చి 2020 నుంచి 2023 వరకు సీఐడీ విభాగంలో పని చేశారు.

అంచెలంచెలుగా

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా 1989లో పోలీసు శాఖలో చేరిన కృష్ణమూర్తినాయుడు విధి నిర్వహణలో ప్రతిభ చూపుతూ ప్రమోషన్లు పొందుతూ వచ్చారు. 1999లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా, 2009లో డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందిన నాయుడు 2014లో అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ (ఏఎస్పీ)గా ప్రమోషన్‌ పొంది విజయవాడలో పని చేశారు. కొద్ది నెలల వ్యవధిలోనే అంటే అదే ఏడాది పోలీస్‌ సూపరింటెండెంట్‌(ఎస్పీ)గా ప్రమోట్‌ అయ్యి విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ డీసీపీగా నియమితులయ్యారు.

ఎన్నో పురస్కారాలు

విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా కృష్ణమూర్తి నాయుడు పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2023లో జరిగిన పోలీస్‌ డ్యూటీ మీట్‌లో విజేతగా నిలిచారు. తన సుదీర్ఘ సర్వీసులో సేవా పతకాలు, ఉత్తమ సేవా పతకాలతో పాటు వందకుపైగా పురస్కారాలు అందుకున్నారు. అవుట్‌ స్టాండిరడ్‌ పెర్ఫార్మెన్‌ చూపినందుకు ఉత్తమ అధికారిగా ఉన్నతాధికారులు, ప్రభుత్వం నుంచి దాదాపు 50 సందర్భాల్లో ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ పనితీరుతో ముఖ్యమంత్రి గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న కృష్ణమూర్తినాయుడు తాజాగా మహోన్నత సేవా పతకం అందుకోవడం పట్ల ఆయన స్నేహితులు, సన్నిహితులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

Komentar


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page