సిక్కోలు చదరంగం చిచ్చర పిడుగు సేతుమాధవ్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మన దేశం పుట్టినిల్లుగా విశ్వమంతా కీర్తించే చదరంగం ఆ కుర్రాడు చిన్నతనం నుంచీ ఎంచుకున్న కలల రంగం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన తన తండ్రి నేర్పిన మెళకువలతో చదరంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. గురువుల శిక్షణలో ఏటికేడాది ఎదుగుతూ, రాటుదేలుతూ వచ్చిన ఆ కుర్రాడు రేటింగ్ టోర్నమెంట్లలో ప్రతిభ చూవడం మొదలుకొని పారిస్‌లో ‘ఫిడే మాస్టర్’ కిరీటం అందుకున్న అరుదైన ఆంధ్ర ఆణిముత్యం, సిక్కోలు ముద్దుబిడ్డ. ఆ కుర్రాడి పేరు యెల్లుమహంతి సేతుమాధవ్. తెలుగు రాష్ట్రాలలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన ఫిడే మాస్టర్ టైటిల్ గ్రహీతలలో సేతుమాధవ్ ఒకడుగా నిలవడంతో సిక్కోలు గడ్డకే అరుదైన ఖ్యాతిని సంపాదించి పెట్టినట్టయింది.
చిన్ననాటి నుంచి..

శ్రీకాకుళం పట్టణానికి చెందిన చదరంగం క్రీడాకారుడు సేతుమాధవ్ తండ్రి శ్రీనివాస వనంతకుమార్ ఉపాధ్యాయుడు కాగా, తల్లి అనూష గృహిణి. చదరంగంలో తనకున్న ఆసక్తితో, కళాశాల స్థాయిలో చూపిన ప్రతిభతో సరిపెట్టుకున్న తండ్రి తన కుమారుని మాత్రం చదరంగంలో రాణించేలా చేయాలన్న సంకల్పం బలంగా పెట్టుకున్నారు. చిన్నతనం నుంచే చదరంగంలో మెళకువలు నేర్పిస్తూ చిన్న చిన్న పోటీలలో పాల్గొని విజయాలు సాధించేలా శిక్షణ ఇచ్చారు. ఇదే అదనుగా సేతుమాధవ్ కూడా ప్రతిభను ప్రదర్శిస్తూ రావడం విశేషం. ఆటలో మరింత పదును తేలడానికి శిక్షణ అవసరమని గుర్తించిన తండ్రి శ్రీకాకుళం చదరంగం అసోసియేషన్‌కు సేతుమాధవ్‌ను పరిచయం చేశారు. చంద్రమౌళి, భీమారావు, బగాది కిషోర్లతో కూడిన అసోసియేషన్ ప్రతినిధులు సేతుమాధవ్‌ను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఓవైపు ఆన్‌లైన్‌లో శిక్షణలు పొందుతూనే ఆసోసియేషన్ టోర్నమెంట్లలో ప్రతిభను చాటుతూ వచ్చాడు.
అప్రతిహత విజయయాత్ర

రామచంద్ర అకాడమీ కోచ్ అయిన కె.ఆర్.జి.వి.చంద్రమౌళి శిక్షణలో రాటుదేలుతున్న క్రమంలోనే చదరంగంలో తొలి విజయకేతనం ఎగరవేశాడు సేతుమాధవ్. 2018లో శ్రీకాకుళం జిల్లా స్థాయిలో జరిగిన చదరంగంలో పోటీల్లో ప్రథమస్థానం పొందాడు. ఇదే సమయంలో ఏ.సి.ఏ అధ్యక్షుడు సనపల భీమారావు, డి.సి.ఎ అధ్యక్షుడు బగాది కిషోర్ ప్రోత్సాహంతో 2019లో పాలకొల్లులో జరిగిన ఎస్.జి.ఎఫ్ అండర్-14 పోటీల్లో ఐదో స్థానాన్ని పొందాడు. అదే ఏడాది దాద్రానగర్ హవేలీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున తొలిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. హైదరాబాద్‌లో ఆల్ ఇండియా ఓపెన్‌లో జాతీయస్థాయి పోటీల్లో అండర్-13 విభాగంలో ప్రథముడిగా నిలిచాడు. మహిళా గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికకు కోచ్‌గా వ్యవహరించిన రామరాజు శిక్షణలో మరింత పదును తేలిన ఆటతో ముందడుగు వేశాడు. కోవిడ్ కారణంగా 2020, 2021 ఏడాదుల్లో ఆన్లైన్ పోటీల్లో పాల్గొని అండర్-16 విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథముడిగా నిలవగా, జాతీయస్థాయి స్కూల్ చెస్ ఛాంపియన్ షిప్ అండర్-15 పోటీల్లో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. 2021లో ఆన్లైన్లో జరిగిన ఏసియన్ స్కూల్ గేమ్స్ ఛాంపియన్షిప్‌లో భారత్ తరఫున టీం-బికి ప్రాతినిధ్యం వహించాడు. వ్యక్తిగత విభాగంలో 9వ స్థానంలో నిలిచాడు.
ఇవన్నీ ఒక ఎత్తయితే 2019-20 ఏడాదిలో 636 ఎలో రేటింగ్ పాయింట్లు ఒక్కసారిగా పొందడం ద్వారా ఒక్క ఏడాదిలో జాతీయస్థాయిలో అత్యున్నతంగా పాయింట్లు పొందిన ఆటగాడిగా సేతుమాధవ్ నిలిచాడు. ఇది అతని చదరంగం ప్రస్థానాన్ని మరో మలుపు తిప్పింది. 2021లో రాష్ట్రస్థాయిలో జరిగిన ఓపెన్ ఛాంపియన్ షిప్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. అదే ఏడాది శ్రీకాకుళంలో జరిగిన ఆల్ ఇండియా ఫిడే ఓపెన్ ఛాంపియన్ షిప్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నెల్లూరులో జరిగిన ఇంటర్నేషనల్ టోర్నీలో 1600 రేటింగ్ పాయింట్ల దిగువ విభాగంలో ఛాంపియన్‌గా అవతరించి, రూ.50వేల నగదు పురస్కారాన్ని కూడా పొందాడు.
మరో కలికితురాయి
ఇప్పటి వరకూ దాదాపు 40కి పైగా ఫిడే రేటింగ్ టోర్నమెంట్లలో ప్రతిభ చూపిన సేతుమాధవ్‌కు అంతర్జాతీయ పొటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఒరిస్సా గ్రాండ్ మాస్టర్ దెబాషిస్ దాస్ శిక్షణలో మెళకువలు ఒడిసిపట్టిన సేతుమాధవ్ 2024 జులై నెలలో ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ఏక్సెషన్ కేటగిరీలో 9 రౌండ్లలో ఎనిమిది పాయింట్లు సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. 1000 యూరోలను బహుమతిగా అందుకున్నాడు. ఫ్రాన్స్ ఇటలీ, పోలాండ్ దేశాల్లో వలు అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్‌లో 1941 పాయింట్లతో అడుగుపెట్టి 400 ఎలోరెటింగ్ పాయింట్లు సాధించాడు. మొత్తంగా 2341 పాయింట్లకు ఎగబాకాడు. తద్వారా అరుదైన ‘ఫిడే మాస్టర్’ టైటిల్ సాధించి తన విజయాల ఖాతాలో మరో కలికితురాయిని నమోదు చేసుకున్నాడు.
వెంటాడుతున్న ఇబ్బందులు:
చదరంగం ఆటలో ఎన్ని ఎత్తులు ఉంటాయో. ఆటలో ఎదిగే క్రమంలో అంతకంటే ఎక్కువ మిట్టపల్లాల్ని చవిచూడాల్సి వస్తుందంటాడు సేతుమాధవ్. ఎందుకంటే చదరంగంలో అంతర్జాతీయ స్థాయి శిక్షణ కోసం ఆన్లైన్లో తీసుకునే శిక్షణలకు, రేటింగ్ టోర్నమెంట్ల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం ఖర్చుతో కూడుకున్న పని. రేటింగ్ పాయింట్లు పెరిగే కొద్దీ అంతకంటే ఎక్కువ పాయింట్ల కోసం పోటీలు జరిగే వేదికలు వేర్వేరు రాష్ట్రాలు, దేశాల్లో జరుగుతూ ఉండడం వల్ల ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఆటగాళ్లు టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఏ చిన్న పొరపాటు కారణంగా ఓటమిపాలైనా మళ్లీ ముప్పయి పాయింట్ల దిగువకు రేటింగ్ పడిపోవడం జరుగుతుంది. వాటిని మళ్లీ తిరిగి పొందేందుకు రేటింగ్ టోర్నమెంట్లలో పాల్గొని ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఈ వ్యయప్రయాసలు చదరంగం క్రీడలో రాణించడానికి ఆటగాళ్లకు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయని అన్నాడు. ప్రభుత్వాలు చేయూతనిస్తే గ్రాండ్‌మాస్టర్‌గా ఎదగాలని సేతుమాధవ్ కోరుకుంటున్నాడు.
భారతదేశానికి గర్వకారణమైన చదరంగం ఆటను ఒక కెరీర్‌గా ఎంచుకునే అవకాశాలు మెరుగుపడాలి. ఎన్నో ఆశలతో ఈ రంగంలో అడుగుపెడుతున్న చిన్నారులకు, వాళ్ల ఆశల్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులకు ప్రభుత్వాలు సహకారం అందించాలి. సొంత ఖర్చులు భరించి శిక్షణలు ఇప్పించడం, దేశ, విదేశాలలో జరిగే రేటింగ్ టోర్నమెంట్లకు పంపడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. చదరంగం అసోసియేషన్లతో సమన్వయం చేసుకుంటూ అకాడమీలు నెలకొల్పడం, రేటింగ్ టోర్నమెంట్ల నిర్వహణ, ప్రభుత్వం తరఫున రేటింగ్ టోర్నమెంట్లకు హాజరయ్యే ఆటగాళ్లకు ఆర్థిక సాయం వంటి చర్యలు చదరంగం ఆటకు నవతరంలో జీవం పోస్తాయి. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని సేతుమాధవ్ తండ్రి శ్రీనివాస వసంత్ కుమార్ కోరుతున్నారు.
Comments