top of page

ప్రభుత్వం మారినా పైసలు రాలేదు!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • దసరాకూ అప్పు తప్పని కాంట్రాక్టర్లు

  • కండువా మార్చినవారికి మొదటి ప్రాధాన్యం

  • కోర్టుకెళితే రెండో వరుస

  • నీరు-చెట్టు బకాయిలు జిల్లాలో రూ.52 కోట్లు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల కింద చేపట్టిన వివిధ రకాల పనులకు గడిచిన ప్రభుత్వం బిల్లులు నిలిపేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా రూ.52 కోట్లు బిల్లులు చెల్లింపులకు నోచుకోలేదు. 2014`19 మధ్యకాలంలో చేపట్టిన పనులకు మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఆ నిధులను పసుపు, కుంకుమ కింద పంచేసి వెళ్లిపోయిన టీడీపీ ప్రభుత్వం మొదటిగా ద్రోహం చేస్తే, ఆ హయాంలో చేపట్టిన పనులన్నీ టీడీపీ నేతలే చేశారని, బిల్లులు చెల్లిస్తే ఆర్థికంగా పరుపుష్టి చెంది స్థానిక ఎన్నికల్లో పోటీకి వస్తారనే కోణంలో వైకాపా బిల్లులు చెల్లించకుండా చేతులెత్తేసింది. ఈ కథలో ఎవరైతే సంబంధిత మంత్రిత్వ శాఖ వద్దకు వెళ్లి కమీషన్లు ఇచ్చుకున్నారో వారికి మాత్రమే ఫైనాన్స్‌ శాఖ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొందరు కోర్టును ఆశ్రయించి అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నా సొమ్ములివ్వకుండా బిల్లులు చేయించుకోలేకపోయారు. చివరకు మిగిలిపోయింది ప్రభుత్వం వద్ద సొమ్ములున్నరోజు ఇస్తుందని భావించిన వారే. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటినా గతంలో చేపట్టిన పనులకు ఇంకా చెల్లింపులు జరగలేదు. ఈ బిల్లులు చెల్లించకుండా అన్ని ప్రభుత్వ శాఖల సీఎఫ్‌ఎంఎస్‌లో హెడాఫ్‌ అకౌంట్స్‌ను మార్పుచేసి వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంది. విజిలెన్స్‌ విచారణ పేరిట బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తోందని టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బిల్లుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చింది. తర్జన భర్జనల తర్వాత ఒక తేదీని ప్రకటించారు. అయినా కూడా అప్పట్లో బిల్లులు చెల్లింపు జరగలేదు. దీంతో టీడీపీయే ఈ కేసును టేకప్‌ చేసింది. బిల్లులు రాని కాంట్రాక్టర్లు, నాయకులు, కార్యకర్తల నుంచి వివరాలు తీసుకున్నారు. వీటితో పాలు 14వ ఫైనాన్స్‌ క్రింద 10, 30, 50 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించని వివరాలను మాజీ సర్పంచ్‌ల నుంచి తీసుకున్నారు. టీడీపీ హాయంలో నామినేటెడ్‌ పద్దతిలో చేసిన వివిధ రకాల పనులకు సంబంధించిన వర్క్‌ ఆర్డర్‌ కాపీ, అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ ఆర్డర్‌ కాపి, అగ్రిమెంట్‌ కాపీ, పే ఆర్డర్‌ కాపీలను టీడీపీ కేంద్ర కార్యాలయానికి సమర్పించారు. నీరు`చెట్టు మినహా మిగతా పనులకు న్యాయస్థానంను ఆశ్రయించిన కొందరికి బిల్లులు చెల్లించారు. నీరు`చెట్టు కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 756 పనులకు సంబంధించి రూ.52కోట్ల మేర బిల్లులను ఇప్పుడు చెల్లించాల్సి ఉంది. విజిలెన్స్‌ నివేదిక అధారంగా బిల్లు చెల్లింపుల సమయంలో జరిమానా రూపంలో కొంత మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించింది ప్రస్తుత ప్రభుత్వం. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి క్యాబినెట్‌ భేటీలో 2016`18 మధ్య కాలంలో పార్టీ కార్యకర్తలు, నాయకులకు నిలిచిపోయిన నీరు`చెట్టు బకాయిల బిల్లులపైనే చర్చ సాగింది. దీనికోసం రూ.238 కోట్లు విడుదలకు సిద్ధమైంది. అయితే ఇంతలో విజయవాడకు వరదలు రావడంతో వీటి విడుదలకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page