top of page

ప్రభుత్వాలు చేయాల్సిన పని ఒక కుటుంబం చేస్తోంది

Writer: ADMINADMIN
ఘనంగా ముగిసిన కొన్న చిన్నారావు స్మారక క్రీడలు
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం స్పోర్ట్స్‌)

ఎక్కడైనా ప్రభుత్వాలు చేయాల్సిన గొప్ప పనిని ఒక కుటుంబం చేస్తుండటం విశేషమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. గడిచిన 17 ఏళ్లుగా కొన్న చిన్నారావు స్మారక క్రీడా పోటీలు నిర్వహించడం చిన్న విషయం కాదని, ఇందుకోసం సమయాన్ని, డబ్బును వెచ్చిస్తున్న కొన్న వెంకటేశ్వరరావు (వాసు)ను ఆయన అభినందించారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో కొన్న చిన్నారావు మెమోరియల్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2024 పోటీలు ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో 600 మీటర్ల పరుగు పందాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీలు జెండా ఊపి ప్రారంభించారు. అంతకు క్రితం చిన్నారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల నిర్వాహకుడు కొన్న వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన తండ్రి చనిపోయిన దగ్గర్నుంచి ఒక్క కరోనా ఏడాది తప్ప ప్రతీ ఏటా జిల్లాస్థాయి, కుదిరితే రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సాయంత్రం జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి కూన రవికుమార్‌తో పాటు ఒలింపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతి హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా వెటరన్‌ నేషనల్‌ అథ్లెట్‌ బి.బాలాజీని సత్కరించారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరుకాగా, ఇందులో విజేతలు గుంటూరులో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నౌపడ విజయ్‌కుమార్‌, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొంక్యాన వేణుగోపాల్‌, తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీను, పెన్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వైశ్యరాజు మోహన్‌, బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, పూడి బాలాదిత్య, కొన్న మధు తదితరులు పాల్గొన్నారు.

 
 
 

תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page