top of page

ప్రమాదంలో పసితనం

Writer: DV RAMANADV RAMANA

‘బాల్యం.. ఓ తీపి జ్ఞాపకం. పసితనం కాదది పసిడి వనం’ అంటారు ఓ కవి. కానీ ఆ మధుర జ్ఞాపకాలకు చాలామంది అమ్మాయిలు దూరమవుతున్నారు. బాలికలకు సరైన వయసు రాకముందే పెండ్లి చేసి తమ భారం దించుకోవాలని కొందరు తల్లిదండ్రులు ఈనాటికీ ఆలోచిస్తున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ఇటీవలె విడుదల చేసిన రిపోర్టు ఈ విషయాలను వెల్లడిస్తున్నది. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. కానీ అవి యథేచ్ఛగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని వయసులోనే కుటుంబ భారం అమ్మాయిల భుజాలపై పడుతోంది. కొందరైతే అదనపుకట్నం దాహానికి బలైపోతున్నారు. దేశ వ్యాప్తంగా ఏటా పదిహేను లక్షల మందికి బాల్య వివాహాలు జరుగుతున్నాయని కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దీని కారణంగా వారంతా చదువుకు దూరమవుతున్నారని, ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడంతో పేదరికం నుంచి బయటకు రాలేకపోతున్నారని ఆవేదన చెందుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బాలికల సంరక్షణే తమ ధ్యేయం అన్నట్టు ఉపన్యాసాల్లో తెగ ఊదరగొడుతుంటారు. మరోపక్క ప్రతి ఏటా బాల్య వివాహాల సంఖ్య పెరిగిపోతోంది. ఇక మోడీ పదే పదే చెబుతున్న ‘బేటీ బచావో-బేటీ పడావో’ నినాదం తర్వాత కూడా ఎన్‌సీపీసీఆర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 23 వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాల శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి బాల్యవివాహాల నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం వివరాలు సేకరించింది. వాటిని క్రోడీకరించి ఇటీవలె తన నివేదికను ప్రపంచం ముందు పెట్టింది. సామాజిక దురాచారం, అవిద్య, ఆడపిల్లలపై వివక్ష, తల్లి దండ్రుల ఆర్థిక పరిస్థితులు, బాల్యవివాహాల వల్ల సంభవించే నష్టాలు, సమస్యలపై, చట్టంపై అవ గాహన లేకపోవడం బాల్య వివాహాలకు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. బాల్య వివాహాలతో అమ్మాయిల చదువులు మధ్యలోనే అటకెక్కుతున్నాయి. ఇంటి పనికే పరిమితమై ఆర్థిక స్వాతంత్య్రానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వారి వ్యక్తిగత వృద్ధికే కాక దేశ ఆర్థిక వృద్ధికి సైతం ఆటంకం కలిగిస్తుందనేది ఎవ్వరూ కాదలేని సత్యం. ఇలా చదువుకోవాల్సిన వయసులో కుటుంబ భారాన్ని మోయాల్సిన దుస్థితిలోకి అమ్మాయిలు నెట్టివేయబడుతున్నారు. అంతేకాక వారిపై గృహ హింస, వేధింపులు కూడా పెరిగిపోతున్నాయి. ఆరోగ్యం, సంరక్షణ సైతం వీరికి ఉండటం లేదు. రక్తహీనతతో బాధపడుతున్నారు. చిన్నతనంలోనే గర్భం ధరించి నెలలు నిండని శిశువులకు జన్మనిస్తు న్నారు. ఇది తల్లీ, పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రస్తుతం 15-19 ఏండ్లలోపు బాలికల్లో పదహారు శాతం మందికి అప్పటికే వివాహాలైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముప్పు పరిధిలో ఉన్న చిన్నారులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఆంధప్రదేశ్‌ ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 9,202 మంది చిన్నారులు ప్రమాదంలో ఉన్నట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆరు లక్షల పాఠశాలల నుంచి తీసుకున్న గణాం కాల ప్రకారం సుమారు పదకొండు లక్షల మంది బాలికలు తీవ్ర ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా బాల్యవివాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప వెలుగులోకి రాకపోవడం శోచనీయం. 2022లో దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కేసులు నమోదైతే అందులో తెలంగాణ నుంచి యాభై ఐదు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్ని పరిశీలించగా నెల రోజులపాటు ముందస్తు సమాచారం లేకుండా వేల మంది బాలికలు పాఠశాలకు రావడం లేదని వెల్లడైంది. మరో 6,551 మంది తరగతులకు సక్రమంగా హాజరుకావడం లేదని పేర్కొంది. ఈ లెక్కలన్నీ పరిశీలిస్తే దేశంలో బాల్య వివాహల వల్ల అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. మానవ సమాజం ఇంకా మనువాదం ప్రభావంతోనే మహిళలను, ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేసే విధానాలను పక్కాగా పాటిస్తుంది. మనువాదం, సనాతన ధర్మాలను ముందుకు తెచ్చి మహిళల పరిస్థితి మరింత దిగజారేలా చేస్తోంది. మనలో మార్పు రానంతవరకు అమ్మాయిల అభివృద్ధి కోరుకోవడం అంటే ఎడారిలో నీటి చెలిమకై వెతకడమే. ఇప్పటికైనా బాల్య వివాహాలపై తమ తమ రాష్ట్రాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఆడపిల్ల భారం కాదు.. భవితకు ఆధారం అని ప్రతిఒక్కరూ గుర్తించేలా చేయాలి. చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల కలిగే అనర్థాలపై నిరంతరాయంగా ప్రజల్లో అవగా హన కల్పించాలి. తమ అమ్మాయిల తల్లిదండ్రుల్లోనూ చైతన్యం పెంచాలి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page