రాష్ట్ర కాంగ్రెస్ నియామకాల్లో షర్మిల నియంతృత్వ ధోరణి
పార్టీని బతికిస్తున్న వారినే పాతరేశారని ఆగ్రహం
శ్రీకాకుళం జిల్లాతోపాటు రాష్ట్రస్థాయిలో పలువురికి అన్యాయం
పనికిమాలినవారికి పదవులు కట్టబెట్టారని శ్రేణుల అసంతృప్తి
పీసీసీ అధ్యక్షురాలు సొంత అజెండా అమలు చేస్తున్నారని ఆరోపణలు

‘హౌ ఆర్ యు డాక్టర్ కిల్లి? డూ యూ హేవ్ ఎనీ పోస్ట్ ఇన్ అవర్ పార్టీ?’ ఇదీ కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ఆమధ్య కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలిసినప్పుడు ఎదురైన మొదటి ప్రశ్న. కృపారాణి కలిసింది సోనియాగాంధీని మాత్రమే కాదు.. రాహుల్ గాంధీని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను, కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్‌ను కలిసినప్పుడు కూడా ఆమెకు ఎదురైన ప్రశ్న ఇదే. పుట్టింటికి వచ్చిన కృపారాణిని గౌరవించాలన్నదే కాంగ్రెస్ అగ్రనేతల భావన. సీన్ కట్ చేస్తే.. ఆదివారం షర్మిల ప్రకటించిన పీసీసీ కార్యవర్గ జాబితాలో ఆమె పేరు లేదు.

బొడ్డేపల్లి సత్యవతి.. వరుసగా రెండుసార్లు ఆమదాలవలస ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక మహిళ. డీసీసీ అధ్యక్షురాలిగా సుదీర్ఘ కాలం పని చేశారు. వయసు, కుటుంబ కారణాల రీత్యా గతంలో ఆమెను ఆ పదవి నుంచి తప్పించినా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించారు. తీరా చేస్తే.. షర్మిలమ్మ జాబితాలో ఆమె పేరు భూతద్దం పెట్టి వెతికినా కనపడలేదు.

కేవలం పది నెలలు డీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన పేడాడ పరమేశ్వరరావు స్థానిక ఇందిరా విజ్ఞాన్‌భవన్‌కు ఒక అఫీషియల్ బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ఇందులో ప్రతి ఆర్థిక లావాదేవీని నమోదు చేశారు. అలా సమకూరిన రూ.10 లక్షలను పీసీసీ ఖర్చుల కోసం ఇక్కడి నుంచి పంపించారు. ఇచ్ఛాపురం, పాతపట్నం నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కార్యకర్తలే లేకపోయినా ఈ రెండుచోట్లా గత ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపే స్థాయికి కాంగ్రెస్‌ను పరుగెత్తించారు. కానీ.. పేడాడ పరమేశ్వరరావుకు సైతం షర్మిలమ్మ టీమ్‌లో స్థానం దక్కలేదు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పైన చెప్పుకున్నవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. కాంగ్రెస్ సంప్రదాయాన్ని పూర్తిగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పూర్తిగా తుంగలో తొక్కేశారు. తనను ప్రశ్నించేవారిని, తనపై ఫిర్యాదు చేసేవారిని తొక్కిపెట్టే ప్రయత్నంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎందుకూ కొరగాని టీమ్‌ను నియమించుకున్నారు. డీసీసీ అధ్యక్షుడిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన అంబటి కృష్ణారావును నియమిస్తూ షర్మిల ఉత్తర్వులు జారీ చేశారు. గత ఎన్నికల్లో జిల్లాలో మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థుల కంటే కృష్ణకు కొద్దిపాటి ఓట్లు ఎక్కువ వచ్చిన మాట వాస్తవం. అంతమాత్రాన ఆయన జనామోదం ఉన్న నాయకుడు కాదు. దీనికి తోడు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించి అనేక ఆరోపణలు ఆయన పై ఉన్నాయి. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో దాదాపు కోటి రూపాయలకు సంబంధించి బ్యాంకుతో గొడవ ఉందని ఆయనే స్వయంగా పేర్కొన్నారు. ఇది కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పుకునే అంబటి కృష్ణకు బయట కూడా అనేక ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని తీసుకువచ్చి డీసీసీ అధ్యక్షుడిగా షర్మిల నియమించారు. పోనీ ఆయన వ్యాపారం.. ఆయన ఇష్టం అని భావించినా సామాజికవర్గాల సమీకరణను కూడా షర్మిల ఎక్కడా పట్టించుకోలేదు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ సానుభూతిపరులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీలు గుర్రుగా ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడిని నియమించేటప్పుడు కనీసం తమను సంప్రదించకపోవడం అన్యాయమని వారంతా భావిస్తున్నారు. వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీకి సేవలందించినవారిని ఆ పదవుల నుంచి తప్పిస్తే రాష్ట్రస్థాయిలో ఏదో ఒక పదవి ఇవ్వడం కాంగ్రెస్ ఈరోజు వరకు బతికుండటానికి ప్రధాన కారణం. శ్రీకాకుళం జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే డీసీసీ అధ్యక్షురాలిగా బొడ్డేపల్లి సత్యవతిని తప్పించిన తర్వాత ఆమెకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ మొన్నటి వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సనపల అన్నాజీరావును తప్పించిన షర్మిల తాజా కార్యవర్గంలో ఆయన్ను ఎక్కడా అకామిడేట్ చేయలేదు. అలాగే నిన్నటి వరకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పేడాడ పరమేశ్వరరావుకు కూడా మరో పదవి ఇవ్వలేదు. ఇక కిల్లి కృపారాణికి రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఇస్తారని అంతా భావించారు. కనీసం ఆ ప్రస్తావన కూడా షర్మిల జాబితాలో లేకుండా పోయింది. ఆ మాటకొస్తే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పదవులు పోయినవారెవరికీ షర్మిల కొత్త జాబితాలో చోటు లభించలేదు.
ఫిర్యాదు చేసినందుకేనా?
దీనంతటికీ కారణం.. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లో అధిక శాతం మంది తనపై ఫిర్యాదు చేశారనే అక్కసుతోనే షర్మిల మొత్తాన్ని ఊడ్చేశారు. తప్పులేదు.. ఆమె పీసీసీ అధ్యక్షురాలు కాబట్టి తన టీమ్ ఎలా ఉండాలన్న దానిపై ఆమెకో ఆలోచన ఉంటుంది. కానీ ఆ సాకుతో పార్టీకి ఏమాత్రం పనికిరానివారిని రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల పదవుల్లో కూర్చోబెట్టారు. గత ఎన్నికల్లో పార్టీ నుంచి ఫండ్ వచ్చినా ఎక్కడా కాంగ్రెస్ అభ్యర్థులకు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి అయినా ఇవ్వలేదని అధిష్టానానికి ఫిర్యాదు వెళ్లింది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న పి.రాకేష్‌రెడ్డి, సుంకరి పద్మశ్రీ, జంగా గౌతమ్, షేక్ మస్తాన్ వలీలను ముందుగా షర్మిల పదవుల నుంచి లేపేశారు. వీరితో పాటు అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి వెళ్లారని శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావుపై వేటు వేశారు. అలాగే ఆయన సామాజికవర్గానికి చెందినవారని, ఆయనతో ఫాలో అవుతున్నారన్న ఒకే ఒక్క కోణంతో సనపల అన్నాజీ లాంటి వారిని కూడా పదవుల నుంచి తప్పించేశారు. మరీ విచిత్రమేమిటంటే.. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ కౌన్సిలర్ గోవింద మల్లిబాబు వివాదరహితుడు. గ్రూపులతో సంబంధం లేని ఈయనకు కూడా ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర మొత్తం మీద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన పి.రాకేష్‌రెడ్డి, సుంకరి పద్మశ్రీలనూ షర్మిల విడిచిపెట్టలేదు. జంగా గౌతమ్ లాంటి సీనియర్ నాయకులను పక్కన పెట్టేశారు. ఎన్నికల కోసం వచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించినందుకు, ఫిర్యాదు చేసినందుకే మొత్తం సీన్‌ను షర్మిల తలకిందులు చేసేశారు. వైకాపాలో వేగలేక, టీడీపీ గూటికి చేరలేక, బలపడితే కాంగ్రెస్ వెనుక వెళ్లిపోవాలని భావిస్తున్న అనేకమంది సీనియర్ నాయకులు షర్మిల చర్యలు అర్థంకాక తల పట్టుకుంటున్నారు.
Comments