top of page

‘ప్రాక్టికల్‌’గా ఆలోచించండి..

Writer: ADMINADMIN

మా అమ్మాయికి ఇంటర్లో 985 మార్కులు వచ్చాయి.. మా అబ్బాయి కాలేజ్‌ టాపర్‌ లాంటి మాటలు తల్లిదండ్రులు చెప్తూ తెగ మురిసిపోతుంటారు. కానీ అసలు రంగు వాళ్లకి తెలియదు. ఇంటర్లో ఎంపీసీ చదివిన పిల్లలు మొదటి ఏడాది 470 మార్కులకు పరీక్షలు రాస్తే, రెండో సంవత్సరం మరో 470 అంటే మొత్తం 940 మార్కులకు పరీక్షలు రాస్తారు. ఇక మిగిలిన అరవై మార్కులు ప్రాక్టికల్‌ పరీక్షలు. ఇదే బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులు రెండేళ్లు కలిపి 880 మార్కులకు పరీక్షలు రాస్తే, మరో 120 మార్కులకు ప్రాక్టికల్‌ పరీక్షలు రాస్తారు. ఐతే రెండేళ్లలో ఒక్కసారి కూడా ల్యాబ్‌ మొహం చూడని విద్యార్థికి నూటికి నూరు శాతం మార్కులు వేయించే బాధ్యత కళాశాలలు తీసుకుంటాయి. వెర్నియర్‌ కాలిపర్స్‌ అంటే ఏమిటో తెలియనివాడు, శృతిదండం ఇంటర్లో ఒక్కసారైనా చూడనివాడు ఫిజిక్స్‌ ప్రాక్టికల్‌లో 30కి 30 పూర్తి మార్కులు సాధించేస్తాడు. హైడ్రోజన్‌కు నైట్రోజన్‌కు తేడా తెలియకుండానే కెమిస్ట్రీ ప్రాక్టికల్స్‌లో శభాష్‌ అనిపించేసుకుంటాడు. ఇక జువాలజీ, బోటనీల కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మైక్రోస్కోప్‌ చూసినవాడిని అదే మైక్రోస్కోప్‌ పెట్టి వెతికినా దొరకడు. రెండు మూడు సార్లు మాత్రమే ప్రయోగశాలను దర్శించిన విద్యార్థికి ఇన్నేసి మార్కులు ఎలా వస్తాయన్న కనీస ప్రాథమిక ఆలోచన తల్లిదండ్రులకు ఉండదు. ఉండక్కర్లేదు అనుకుంటే అది వేరే సంగతి. మార్కులు ఎలా వచ్చాయి అన్న దానికంటే.. ఎన్ని వచ్చాయన్నదే కదా నేటి పేరెంట్స్‌కి కావాల్సింది. ఇంటర్‌ రెండో ఏడాదిలో జరిగే ఈ ప్రాక్టికల్‌ పరీక్షలు నిజానికి ప్రభుత్వం అత్యంత బాధ్యతగా, పద్ధతిగా పూర్తి చేయాలి అనుకుంటుంది. ఇక్కడ వారి తప్పు కనపడదు. ఒక సీనియర్‌ ప్రభుత్వ అధ్యపకుడిని ప్రతి కళాశాలకు చీఫ్‌గా నియమిస్తుంది. అన్ని కళాశాలల ల్యాబుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండేలా చూస్తుంది. వాటిని జిల్లాస్థాయిలో ఇంటర్మీడియట్‌ అధికారులకు, రాష్ట్ర స్థాయిలో ఇంటర్‌ కమిషనరేట్‌కు అనుసంధానం చేస్తారు. కానీ ఇంట్లో దొంగను ఎవరు పట్టుకోగలరు?! పరీక్షల నిర్వహణకు వచ్చే ఎక్స్‌టర్నల్‌ అధ్యాపకుల ధనదాహం, పిల్లల కంటే ఎక్కువగా కాలేజీ వారికి కావాల్సిన మార్కులు పిచ్చి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహణ తీరు దయనీయం చేస్తుంది. కళాశాలలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,500 నుంచి రూ.2,500 వరకు దండుకుని, అందులో కొంత మొత్తంతో ఎక్స్‌టర్నల్‌ జేబులు నింపుతాయి. ఆ వారం రోజులు విద్యార్థుల మధ్య లోంచి వారి కోసం తీసుకెళ్లిన బిర్యానీ పొట్లాలు చూసిన పిల్లలు ఆ గురువులకు ఏపాటి గౌరవం ఇస్తారన్న కనీసపు స్పృహ వారికి ఉండదు. వాళ్లని ప్రశ్నలు అడుగుతూ బత్తాయి రసాలు తాగుతున్న టీచర్లను నమస్కరించాలని ఎలా కోరుకుంటారు. కాలేజీలలో అడ్మిషన్స్‌ పెరగడం కోసం యాజమాన్యాల వేయని తప్పటడుగులు ఇన్ని అన్ని కావు. ఈ క్రమంలో పిల్లలకు వచ్చిన మార్కులు నిజమన్న భ్రమలో బ్రతికే పేరెంట్స్‌ మరోవైపు. ఈరకంగా మార్కులు తెచ్చుకున్న పిల్లలకు ఐఐటీలోనో, మెడిసిన్‌లోనో సీట్లు ఎలా వస్తాయి? 900 మార్కులు దాటిన పిల్లలకు ఎంసెట్‌లలో 50 వేలు దాటి ర్యాంకులు వస్తుండడం మనం చూస్తున్నాం. కారణం ఇదే.. అనేకమంది పిల్లలకు ఇంటర్‌లో వచ్చిన మార్కులు వారి ప్రతిభకు తగినవి కాదని తల్లిదండ్రులు గుర్తెరగాలి.

- కృష్ణ చైతన్య

 
 
 

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page