top of page

పేరుకు పేకాట.. జరిగేది అసాంఘిక ఆట!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • May 13
  • 2 min read
  • నగరంలో పెరుగుతున్న డెన్‌లు

  • వాటిపై పంజా విసురుతున్న జిల్లా ఎస్పీ

  • తాజాగా రెండు చోట్ల దాడులు

  • సూత్రధారులను పట్టుకుంటేనే దీనికి చెక్‌

ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఎందుకో ఈమధ్య దూకుడు తగ్గించారు. నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘాకు డ్రోన్‌ ఎగరేయడం మినహా ఇతర వ్యవహారాల్లో ఆయన పెద్దగా ఇన్‌వాల్వ్‌ అవుతున్నట్టు కనిపించడంలేదు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో చూపించిన చొరవ, ఉత్సాహం ఇప్పుడు ఆయనలో కనిపించడంలేదు. బహుశా శ్రీకాకుళంలో పోస్టింగు ఆయనకు ఇష్టంలేదో.. లేక ఆయన అడిగిన చోటికి బదిలీ ఇవ్వలేదో.. జిల్లాలో రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందో తెలీదుగానీ నిజాయితీ గల అధికారి ఎందుకో సైలెంట్‌గా ఉన్నారు’

.. ఇదీ నెల రోజులుగా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి కోసం నగర ప్రజలు అనుకుంటున్న మాటలు. వస్తూనే గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపి, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను కటకటాల వెనక్కు నెట్టి, ఇంతవరకు జిల్లా చరిత్రలో లేని రికవరీ చూపించి ఒక బెంచ్‌మార్క్‌ సెట్‌ చేశారు అనుకుంటున్న సమయంలోనే ఎస్పీ సైలెంట్‌ కావడం చర్చనీయాంశమైంది.

ఎస్పీలో వాడి తగ్గలేదు

అది వాస్తవం కాదని ఆయన తాజా చర్యలు నిరూపిస్తున్నాయి. డిపార్ట్‌మెంట్‌లో రాజకీయంగా పాతుకుపోయిన సిబ్బంది ఎంతమంది ఉన్నా వారి నుంచి తాను అనుకున్న ఫలితాలు రాబట్టుకోవడంలో మొండిగా వ్యవహరించిన మహేశ్వర్‌రెడ్డి తనలో వాడి, వేడి తగ్గలేదని నిరూపించి మళ్లీ అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా మారి జూలు విదల్చడం మొదలుపెట్టారు. జిల్లాలో విస్తారంగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయని, ఇవి ఒక్క పేకాటకే పరిమితమైతే ఫర్వాలేదు గానీ.. ఈ శిబిరాల నుంచే సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారన్న సమాచారాన్ని ఎస్పీ తన ఇంటెలిజెన్స్‌ విభాగం ద్వారా బలమైన సమాచారం సేకరించారు. దాని ఆధారంగా నగర పరిధిలో ఉన్న పేకాట శిబిరాలపై దాడులు షురూ చేశారు. నేరుగా తన ఫోన్‌ నెంబర్‌నే ప్రకటించి, సమస్యలుంటే కాల్‌ చేయొచ్చని శివమణి తరహాలో అభయమిచ్చిన తర్వాత ఎస్పీ నెంబరుకు ఫోన్‌కాల్స్‌ ఆగడంలేదు. ఇంతవరకు వచ్చిన కాల్స్‌ను క్రోడీకరించి వీటికి మూలం ఎక్కడుందనేది కనుక్కోడానికి ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి సమయం పట్టినట్లు అనిపిస్తుంది.

టైమ్‌ పట్టినా ట్రేస్‌ చేశారు

స్థానిక పెద్దపాడు రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపం వెనుక రెండో లైన్‌లో పొట్నూరు చందు (నల్లచందు) పేకాట శిబిరంపై శనివారం దాడి చేయగా ఆ రోజు ఉదయమే దమ్మలవీధిలో కొన్నాళ్లుగా పేకాట శిబిరం నడుపుతున్నట్లు నేరుగా ఎస్పీకి స్థానికులు ఫోన్‌ చేయడంతో అక్కడ రైడ్‌ చేశారు. కానీ దమ్మలవీధిలో శిబిరం ఉన్న లొకేషన్‌ కనుగొనడానికి పోలీసులకు కాస్త టైమ్‌ పట్టింది. ఈలోగా పేకాట శిబిరం బయట కాపలా ఉన్న ఒక యువకుడు పోలీసులొస్తున్నారంటూ ఇన్‌ఫర్మేషన్‌ ఇచ్చి పరుగెత్తాడు. వాడి వెంట పోలీసులు పడేసరికే శిబిరంలో ఉన్న పేకాటరాయుళ్లు తప్పించుకున్నారు. అయితే కాపలాదారు మాత్రం పోలీసులకు దొరికిపోగా అతన్ని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి రెండు రోజులుగా దశలవారీగా ఇంటరాగేషన్‌ చేస్తున్నారు. అతని వద్ద ఉన్న మొబైల్‌ ఆధారంగా పేకాట శిబిరానికి ఎవరొస్తున్నారు? క్రికెట్‌ బెట్టింగులకు ఎవరు పాల్పడుతున్నారు? శిబిరాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? వంటి వివరాలను రాబట్టారు. వీరందరికీ మంగళవారం వన్‌టౌన్‌ సీఐ ముందు హాజరుకావాలని హుకుం జారీ చేశారు. వారిపై కేసులు పెడతారా? వార్నింగ్‌ ఇచ్చి వదిలేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

టీడీపీ నేతల అండ?

ఇక పద్మావతి కల్యాణ మండపం వెనుకనే మూడో లైన్‌లో గోపి అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. గతంలో విశాఖ`ఏ కాలనీలో ఉన్న ఈ డెన్‌ను కొన్నాళ్ల క్రితం కల్యాణ మండపం వెనుక స్పందన స్ఫూర్తి మైక్రో ఫైనాన్స్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌ పైన మూడో అంతస్తులోకి మార్చారు. అతి పెద్ద ఇంటిని రూ.11వేలకు అద్దెకు తీసుకొని ఇక్కడ విచ్చలవిడిగా పేకాడిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం నేతలు ఎక్కువగా ఈ శిబిరంలో పాల్గొంటున్నారని భోగట్టా. శనివారం ఆ పక్కనే ఉన్న శిబిరంపై పోలీసులు దాడి చేసినప్పుడు వీరు తప్పించుకోడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని తెలిసింది. నగరంలో ఇంత పెద్ద పేకాట డెన్‌ మరోచోట లేదని చెప్పుకుంటున్నారు. అందుకే ఓపక్క పేకాడుతుంటే, మరోపక్క బెట్టింగులతో పాటు యువకులు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుంటారని తెలిసింది. గత కొన్నేళ్లుగా నగరంలో పేకాట శిబిరాలు నడపడమనేది ఒక బిజినెస్‌ అయిపోయింది. కానీకి ఠికానా లేనివాడు రెండు కండలు చూపించి, నలుగురు గంజాయి బ్యాచ్‌ను వెనకేసుకు తిరిగి, బాక్సర్‌ అనే బిరుదు తగిలించుకొని, కులం కార్డు ముందు పెట్టి ఈ దందాను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. పేకాట డెన్‌లు నడుపుతున్నవారి పేర్లు పత్రికల ద్వారా బయటకొస్తున్నా, దీని వెనుక మాత్రం మరికొందరు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, వారినే పోలీసులు గుర్తించాలని పలువురు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page