పోరాటయోధుడా.. పిరికివాడా?!
- DV RAMANA
- Nov 13, 2024
- 2 min read

మాక్ అసెంబ్లీ.. మాక్ ఎమ్మెల్యేలు మాక్ ముఖ్యమంత్రి. మాక్ స్పీకర్.. ఇవి కాదు జగన్ మోహన్ రెడ్డి ముందు అసెంబ్లీకి వెళ్లి.. బడ్జెట్ మీద, బడ్జెట్ కేటాయింపుల మీద మాట్లాడాలి. గతించిన ఐదేళ్లలోనూ తను చంద్రబాబు ఏ23-4 పట్ల పాటించిన హేళన వైఖరి కళ్లముందు కనిపించటం వల్ల అందుకు ప్రతిగా తెలుగోడి పౌరుషానికి గుత్త అయిన పసుపు జట్టు తన పట్ల ఎలా స్పందింస్తారోననే భయంతో కామోసు ఆయన అసెంబ్లీకి దూరంగా ఉండిపోయి ఏదో అలా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమిత మైపోతున్నారు. మరొక విషయం ఆలోచిస్తే అసెంబ్లీ సభ్యత్వం అనేది ఆ నియోజకవర్గానికి వహించే ప్రాతినిధ్యం. అదేదో ప్రైవేటు ఆస్తి అనుకుంటే పొరపాటు.అనుకూల వాతావరణం ఉంటేనే అక్కడికి పోతాను లేకుంటే పోను అనే స్వేచ్ఛ బహుశా ఏ సభ్యుడికీ లేదు. అలా హాజరుకావటం తనకి కుదరద నుకుంటే ఆయన చెల్లెలు షర్మిల చెప్పినట్టు ఆ సభ్యత్వాన్ని ఆయన వదులుకోవాలి. అసెంబ్లీకి పోయి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే మరొకరు ఎన్నిక కావటానికి ఈయన దారిచ్చేయాలి. ఇంకొక మాటేంటంటే ఎవరినో ఓదార్చటానికి వస్తానని ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ఆయన సోనియాను కూడా ఎదిరించి ఎన్ని కష్టాలెదురైనా ఒంటరి పోరాటం చేసింది ఈరకం స్ఫూర్తితోనేనా? ఎదురుగా ముఖ్యమంత్రి పీఠం కనబడుతుంటే దానికోసం పడిన ఆరాటాన్ని పోరాటం అనుకోకూడదు, రెంటికీ తేడాను గ్రహించాలి. ఇప్పుడు కనుచూపుమేరలో పదవి లీలగా కూడా అగుపించటంలేదు. ఎందుకొచ్చిన జంజాటం ఇంట్లో కూర్చుని పబ్జీ ఆడుకుంటే పోదా అని అనుకున్నారు పాపం.. ఫలితం ఇదీ. కాకపోతే అమాయకపు భక్తులు మాత్రం ఇంకా మా అన్న మడమ తిప్పడూ, మాట తప్పడూ అనుకుంటూ అనవసరంగా హైరానా పడుతున్నారు. చంద్రబాబు ట్రాప్‌ను జగన్ తెలివిగా తప్పించు కున్నారు. శాసనమండలి సమావేశాలకు మాత్రం వైకాపా ఎమ్మెల్సీలను పంపిస్తూ శాసనసభకు తాను పులివెందుల ఎమ్మెల్యేగా హాజరుకావడం లేదని, తాను ఒక్కడే హాజరుకాకపోతే.. పిరికి సన్నాసి అనుకొనుకొంటారని తనతో పాటు మిగిలిన 10 మంది తన పార్టీ ఎమ్మెల్యేల చేత కూడా బంక్ కొట్టిస్తున్నారు. పైకి నాకు ప్రతిపక్ష హోదాను చంద్రబాబు బిక్షగా వేస్తేనే వస్తాను అని చెబుతున్నా.. అసలు విషయం, సభలో రఘురామరాజు ఉండడం. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి వచ్చిన రోజు, బిక్కజచ్చి, అసెంబ్లీకి దొడ్డిదారిన వచ్చారు. లోపలికి బిక్కుబిక్కుమంటూ వస్తున్నా.. అధికార కూటమి పక్షం అంతా హుందాగా వ్యవహరించారు. అనూహ్యంగా సభలో రఘు రామరాజు జగన్ను కలిసి పలకరించారు. అది చర్చనీయాంశంగా మారింది. జగన్ ఆ హుందాతనాన్ని శంకించారు. మంత్రుల తర్వాత పిలుస్తారా అని గోల పెట్టారు. ప్రజలు ఇవ్వని హోదాను బిక్షగా వేస్తామని గానీ, వెయ్యమని గానీ అధికార పక్షం చెప్పలేదు. కానీ ప్రమాణస్వీకారం చేసేసి పులివెందుల లో పనుందని, ఏదో నిజంగానే పనున్నట్లు ఒక రోజు పులివెందులలో గడిపి, మరుసటి రోజే బెంగళూరుకు వెళ్లపోయారు. కనీసం తన వైకాపా ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లమని గానీ.. వెళ్లవద్దని గానీ చెప్పకుండా చెక్కేసారు. వారంతా అసెంబ్లీ వరకు వచ్చి, జగన్ నుంచి ఏ వర్తమానం లేక, వేచి చూసి, సభలోకి వెళ్లకుండా తిరిగి వెళ్లిపోయారు. రాఘరామరాజు అసెంబ్లీలో పలకరించాక, అయ్యన్న పాత్రుడు సభాపతి అయ్యి ఎన్నోసార్లు జగన్ సభకు వస్తే.. మైకు ఇస్తాం, సమయం ఇస్తాం అని టెంప్ట్ చేసినా కూడా జగన్ బెట్టువీడలేదు. అది బెట్టు కాదు భయం. అప్పటికీ నిన్నటి వరకు రఘురామరాజు కు ఏ పదవీ ఇవ్వకుండా.. డిప్యూటీ స్పీకర్ పదవిని వ్యూహాత్మకంగా ఇన్నాళ్లూ దాచివుంచారు చంద్ర బాబు. ఇక జగన్ రెడ్డి సభకు రారని నికరం అయ్యాక, రఘురామరాజుకు పదవిని ప్రకటించారు. హమ్మయ్య బతికిపోయా.. నేను అనుకున్నదే కరెక్ట్ అయ్యింది, సభకు బంక్ కొట్టి మంచిపని చేసా.. జస్ట్ మిస్.. ఎవరెంత టెంప్ట్ చేసినా.. తప్పించుకొన్నా అని ఎన్నికల ఓటమి తర్వాత ఇవ్వాళ జగన్ ఆనందిస్తూ వుండవచ్చు. సభకి ఎగ్గొడితే రాజీనామా చెయ్యి అని చెల్లెలు ఛీకొడుతున్నా.. ఆమెకేం తెలుసు తన అసలు బాధ, భయం అని మొట్టమొదటిసారిగా సభకు వెళ్లని ఒక పిరికివాడిగా జగన్ గెలిచారు. చరిత్ర సృష్టించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం.. శాసనసభ సభ్యుడు.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా 60 రోజుల పాటు శాసన సభకు గైర్హాజరు అయితే.. ఆ స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటిస్తారు. ఈ విషయం జగన్‌కు ఎవరూ చెప్పినట్లు లేరు.
Comments