top of page

‘ప్రింట్‌’ పని సరి!

  • Writer: DUPPALA RAVIKUMAR
    DUPPALA RAVIKUMAR
  • Sep 18, 2024
  • 3 min read
  • డిజిటల్‌ వైపు మరలిన యువతరం

  • ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున మూతపడుతున్న పత్రికలు

  • ఆదాయం, ఆదరణ లేకపోవడమే కారణం!

- దుప్పల రవికుమార్‌

ది ఆస్ట్రేలియన్‌ దినపత్రికకు ఈ ఏడాదికి అరవై ఏళ్లు. ప్రపంచంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిన రూపర్ట్‌ మర్డోక్‌ ఈ పత్రికను స్థాపించాడు. అరవయ్యవ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ మరో పదిహేనేళ్లలో ప్రింట్‌ పత్రికలు చనిపోనున్నాయని జోస్యం చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కొటొక్కటిగా పత్రికలు మూత పడిపోతున్న సమయంలో మర్డోక్‌ ఇలా ఊహించడం, ఆ పరిశ్రమపై ఆధారపడి బతుకుతోన్న జర్నలిస్టులకు పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసినట్టనిపిస్తోంది. పరంపరానుగతంగా వస్తోన్న ప్రింట్‌ పత్రికలకు ఇది శరాఘాతంగా తగిలింది. గోరుచుట్టు మీద రోకటిపోటులాగా అన్ని దేశాలలో డిజిటల్‌ మాధ్యమానికి ప్రాబల్యం పెరగడం కూడా దినపత్రికలు కనుమరుగవడానికి కారణమవుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన మీడియా విశ్లేషణ సంస్థ ఆఫ్‌కామ్‌ విడుదల చేసిన నివేదిక కూడా దీనిని ధృవపరుస్తోంది. 1960ల నుంచి వార్తల కోసం దినపత్రికల తర్వాత ఎక్కువగా ప్రజలు టీవీమీద ఆధారపడేవారు. ఇప్పుడు పత్రికలు, టీవీని వదిలేసి డిజిటల్‌ మీడియా వైపు మళ్లుతున్నారని నివేదిక చెప్పింది. ఎన్నికల సమయంలో మాత్రం ప్రేక్షకులు ఇంకా టీవీ పట్ల ఆసక్తి చూపిస్తున్నారని, మిగిలిన సమయాల్లో డిజిటల్‌ మీడియా ముఖ్యంగా మొబైల్‌ ఫోన్లలో వస్తోన్న సమాచారం మీదనే ఆధారపడుతున్నారని ఆఫ్కాం తేల్చింది. నిజానికి కొన్ని ఇతర సంస్థలు చేసిన సర్వేలలో తేలిందేమంటే దినపత్రికల ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లను కూడా జనం చూడడం లేదు. సోషల్‌ మీడియానే నమ్ముకుంటున్నారు.

ఆదాయం కోసం అరవై మార్గాలు!

2018లో వార్తలు చూడడానికి సంప్రదాయబద్దంగా దినపత్రికల వెబ్‌సైట్లను చూసేవారి సంఖ్య 22 శాతముండేది. ఇప్పుడది 10 శాతానికి పడిపోయింది. మరి వారు వార్తలు ఎక్కడ తెలుసుకుంటున్నారు? ఎక్కువగా యువపాఠకులు వార్తల కోసం తక్కువ నిడివిగల వీడియో కంటెంట్‌ వైపు మరలుతున్నారని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన రాయిటర్స్‌ సంస్థ సర్వేలో తేలింది. అందులోనూ యువతరం పెద్ద సంఖ్యలో టిక్‌టాక్‌ (మన దేశంలో బ్యాన్‌ చేశారు), యూట్యూబ్‌ న్యూస్‌పైన ఆధారపడుతున్నారని ఈ సర్వే చెప్పింది. పెద్ద పెద్ద వార్తాసంస్థల కంటే సోషల్‌ మీడియా ప్రభావశీలురు (ఇన్‌ఫ్లూయెన్సర్లు) మంచి కంటెంట్‌ అందిస్తున్నారని దాదాపు 47 దేశాలకు చెందిన యువతీయువకులు అభిప్రాయపడ్డారు. మీకు తెలిసిన 30 ఏళ్లలోపు యువతరాన్ని ఎవరినైనా అడగండి, వారీమధ్య ఏదైనా దినపత్రికను చేతితో పట్టుకుని చదివారేమో? జడ్‌ జెన్‌ (ఇప్పుడు 18 నుంచి 26 ఏళ్లు ఉన్న యువతరం) పిల్లలలో మూడిరట రెండు వంతుల మందికి ప్రధానంగా వార్తలు లభించే చోటు సోషల్‌ మీడియానే. అందులో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌పై ఆధారపడుతున్నారు. తెలివిగల దినపత్రికలు ఇప్పుడు అన్నీ తమను తాము మార్చుకుని డిజిటల్‌ అవతారానికి తరలిపోతున్నాయి. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, తదితర సోషల్‌ మీడియా చానెళ్లలోకి దూరుతున్నాయి. నెమ్మదిగా వ్యాపార ప్రకటనలను పట్టుకుంటున్నాయి.

ఒక ఉదాహరణగా ఆస్ట్రేలియాను తీసుకుంటే మర్డోక్‌కు చెందిన స్కై గ్రూపు 2023లో 490 వాయిస్‌ యూట్యూబ్‌ వీడియోలు విడుదల చేసి, 9 మిలియన్‌ ప్రేక్షకులను చేరుకుంది. వారి ప్రత్యర్థి గార్డియన్‌ సంస్థ 110 వాయిస్‌ వీడియోలను యూట్యూబులో పెడితే 1.6 మిలియన్‌ వ్యూస్‌ దక్కాయి. దాంతో పత్రికలు తమ ఆదాయాన్ని ఆర్జించడానికి రెవిన్యూ మార్గాలను విస్తరించుకున్నట్టు తేలుతోంది. ప్రకటనలు, చందాలు కట్టించుకోవడం, విరాళాలు సేకరించడం, కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, డేటా అమ్మడం, ప్రభుత్వం నుంచి నిధులు సేకరించడం వంటి అదనపు ఆదాయ మార్గాల వైపు మళ్లారు. 2021లో పరిచయమైన ఎన్‌ఎంబిసి (న్యూస్‌ మీడియా బార్గెయినింగ్‌ కోడ్‌) ఇప్పుడు పెద్ద ఎత్తున డిజిటల్‌ మీడియాకు ఆదాయ దన్నుగా నిలుస్తోంది. అంటే గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ మనం తెరవగానే కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి కదా. అలా అవి చూపించిన వార్తలకు కొంత సొమ్మును ఆయా వార్తా సంస్థలకు రాయల్టీగా చెల్లించడం మొదలైంది. ఫేస్‌బుక్‌ మొదటి మూడు సంవత్సరాలు ఇలా డబ్బు చెల్లించి, తర్వాత చేతులెత్తేసింది. దీనిమీద ఇంకా వార్తాసంస్థలు పోరాడుతున్నాయి. మన దేశంలో ది హిందూ గ్రూపు తన పత్రికలన్నింటినీ డిజిటల్‌ రూపంలోకి తీసుకొచ్చింది. అవి మనం చూడాలంటే చందా రూపంలో కొంత సొమ్ము చెల్లించవలసిందే. ఇప్పుడిప్పుడే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఇదే బాట పడుతోంది. అయితే బ్రాండ్‌ వాల్యూ బట్టే పాఠకులు డబ్బులు చెల్లిస్తారని మనకు తెలిసిందే. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు పది మిలియన్ల చందాదారులు ఉన్నారు. ప్రతి నెలా ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కంటే చందాల ద్వారానే ఎక్కువ ఆదాయం వారికి వస్తుంది.

మన తెలుగు పత్రికల భవిష్యత్తు ఏమిటి?

అయితే ఇతరేతర కారణాల వలన మర్డోక్‌ ఇప్పటివరకూ తన పత్రికలకు చందాలు పెట్టలేకపోయాడు. ఇప్పటికీ ఆన్‌లైన్‌ పత్రికలు ఉచితంగానే పాఠకులు చదవగలుగుతున్నారు. అంటే ఆ సంస్థకు కేవలం ప్రకటనల ఆదాయం మాత్రమే రాబడి. ఇప్పుడే పులిమీద పుట్రలా కృత్తిమ మేధ దినపత్రికల ఆఖరి ఉసురు తీయడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. దానిని కూడా పెద్ద మీడియా సంస్థలు వార్తల సృష్టికి వాడుతున్నప్పటికీ ఆదాయం పెంపుదలకు జనరేటివ్‌ ఎఐ ఎలా తోడ్పడుతుందో ఇంకా స్పష్టంగా తేలలేదు. మర్డోక్‌ భయపడుతున్నట్టు పత్రికలు పూర్తిగా మాయమవుతాయని చెప్పలేము గాని, పత్రికల భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగానే ఉంది. ఈ నేపథ్యంలో మన తెలుగు దినపత్రికల భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదీ మనం అంచనా వేయలేం. ఎందుకంటే మన తెలుగు దినపత్రికలకు అటు అవి చదువుతున్న పాఠకులలో, ఇటు సాధారణ ప్రజలలో విశ్వసనీయత కొరవడిరది. అవి అనివార్యంగా రాజకీయ అభిప్రాయాలకు మొగ్గు చూపుతున్నట్టు కనిపించడం విషాదం. ఒకవైపు వాటి మనుగడే ప్రశ్నార్ధకం అవుతున్న విపత్కర పరిస్థితిని అవి పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తమ రాజకీయ అభిప్రాయాలు చలామణి కావడానికి, పాఠకులు తమ పత్రికలు కొనకపోయినా, అవి ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధపడడం మొన్నటి ఎన్నికలలో మనం చూసాం.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page