పార్టీయే ఉన్నతం.. కాంగ్రెస్ కాస్త తక్కువే!
- DV RAMANA

- Sep 12
- 2 min read

‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అన్నట్లే.. రాజకీయాల విషయానికొస్తే ‘పార్టీయే అత్యున్నతం’ అని చెబుతుంటారు. ఈ విషయంలో కాంగ్రెస్‌కు కొంత మినహాయింపు ఉందని చెప్పవచ్చు. దేశంలో అతి పురాతన పార్టీగా, దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టామని చెప్పుకొంటున్న పార్టీగా ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ నీడలోనే రాజకీయం చేస్తూ ఎదిగిన అనేకమంది నేతలు దాన్నే ధిక్కరించడానికి తెగించినా.. అటువంటి వారిపై చర్యలు తీసుకోకపోగా వారినే తిరిగి అందలం ఎక్కించిన ఉదంతాలు కాంగ్రెస్ చరిత్రలో అనేకానేకం కనిపిస్తాయి. ఇటీవల ఉప రాష్ట్రపతి పదవికి ఉప ఎన్నిక జరగడానికి కారకుడైన జగదీప్ ధన్‌కడ్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు.. ఒకప్పుడు శంకర్‌దయాళ్ శర్మ విషయంలో కాంగ్రెస్ అనుసరించిన వైఖరి చూస్తే.. ఆ రెండు పార్టీల మధ్య తేడా స్పష్టంగా వెల్లడవుతుంది. గతంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా శంకర్‌దయాళ్ శర్మ పని చేశారు. అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడైన ఎన్టీఆర్‌ను మళ్లీ పట్టాభిషిక్తుడిని చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారన్న పేరు సంపాదించిన ఈయనే ఆ తర్వాత అంటే 1988 ప్రాంతంలో దేశ ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించారు. అప్పట్లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన అండతోనే కాంగ్రెస్ అభ్యర్థిగా శర్మ పోటీచేసి ఉప రాష్ట్రపది అయ్యారు. ఉప రాష్ట్రపతే రాజ్యసభకు అధ్యక్ష వహించి నడిపిస్తుంటారు. ఆ క్రమంలో ఒకరోజు ఏదో అంశంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో మంత్రులతో సహా కొందరు కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రధాని రాజీవ్ గాంధీ కూడా సభలోనే ఉన్నారు. గందరగోళం సృష్టించడం పట్ల ఆగ్రహించిన శర్మ కాంగ్రెస్ సభ్యులను తీవ్రంగా మందలిస్తూ పోయి మీ నాయకుడికి చెప్పుకోండి అని పరోక్షంగా రాజీవ్ గాంధీ దగ్గరకు పొమ్మన్నారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ, దానికి కాంగ్రెస్‌ను బాధ్యురాలిని చేస్తూ కుమిలి కుమిలి ఏడుస్తూ సభలోనే పెద్ద సీన్ క్రియేట్ చేశారు. కాంగ్రెస్‌ను ప్రజాస్వామ్య హంతకురాలిగా చిత్రీకరించి.. తనను తాను కాంగ్రెస్ పాపాల ప్రాయశ్చిత్తం కోసం శిలువనెక్కిన నేతగా ప్రొజెక్టు చేసుకున్నారు. ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య మూలాలను పెకిలించేసి దేశాన్ని నియంతత్వం వైపు నడిపిన అప్రతిష్టను మూటగట్టుకున్న కాంగ్రెస్ జట్టు ఈ మొత్తం ప్రహసనాన్ని చేష్టలుడిగి కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. రాజ్యసభ సాక్షిగా కాంగ్రెస్ పరువును రచ్చకీడ్చిన అదే శంకర్‌దయాళ్ శర్మ తర్వాత కాలంలో నడవడానికి ఇబ్బంది పడుతున్న స్థితిలో కూడా అదే కాంగ్రెస్ తరఫున రాష్ట్రపతి పదవిని కూడా అలంకరించారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. వృత్తిరీత్యా న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు అయిన జగదీప్ ధన్‌కడ్ బీజేపీ తరఫున ప్రతి విషయంలోనూ ఒంటి కాలితో లేచే నాయకుడు. ఆ పార్టీ తరఫునే ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చున్న ఆయన ఆ మధ్య తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తొక్కిపెట్టేస్తే.. సుప్రీంకోర్టు కలుగజేసుకుని నిర్ణీత గడువులోగా గవర్నర్లు బిల్లులను ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాలంటూ ఇచ్చి ఆదేశాలను ఉప రాష్ట్రపతి హోదాలోనే తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి రూలింగ్ ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు ఏం హక్కు ఉందని కూడా నిలదీశారు. అలాంటి ధన్‌కడ్.. ఏమైందో గానీ మూడున్నరేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేశారు. అప్పటివరకు ఎలాంటి అనారోగ్య దాఖలాలు లేని ఆయన అకస్మాత్తుగా అనారోగ్యమే సాకుగా చూపించి పదవి నుంచి తప్పుకొన్నారు. ఆతర్వాత ఆయన గురించి ఎవరికి ఏమీ తెలియదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ధర్మాన్ని నాలుగు పాదాల మీద నిలబెట్టడానికి అవతరించామని చెప్పుకొంటున్న యోధుల కాలంలో జరిగిన ఘటన ఇది! ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే సంస్థాగతంగా కాంగ్రెస్ అధినాయకత్వ అసమర్థత, బీజేపీ నాయకత్వ పటిమ స్పష్టంగా ద్యోతకమవుతాయి. పార్టీకి చేటు చేసే చర్యలకు పాల్పడేవారి విషయంలో ఆ రెండు పార్టీల మధ్య తేడా ఇదే. నాయకుల ఎంపికలో ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ప్రజలు సమర్ధులను వదిలేసి నాయకత్వం లేని వాళ్లను ఎందుకు ఎన్నుకుంటారు? నిన్నటి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జరిగింది అదే. దూరం పాటిస్తున్న పార్టీలు మద్దతు ఇవ్వడానికి కూడా కారణం అదే.










Comments