`ఓటర్లు నాడి పట్టలేక పార్టీల ఫ్రస్టేషన్
`ప్రజల్లో దాడుల భయం.. పథకాలు అందవన్న ఆందోళన
`రెండు పక్షాల వైపు నుంచీ భారీగా ఓటింగ్
`మౌత్ టాక్, డబ్బుల ప్రభావం కూడా ఎక్కువే
రాష్ట్ర ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా భారీ పోలింగ్ శాతం నమోదు కావడం కచ్చితంగా ఒక పెద్ద వేవ్‌కు సంకేతం. ఏ పార్టీ గెలుస్తుందన్న అంశం పక్కన పెడితే పోస్ట్‌పోల్ సర్వేను కూడా కచ్చితంగా ఇచ్చే పరిస్థితి ఏ సంస్థకూ కనిపించడంలేదు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను అడిగి మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తుందని కొందరు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న అర్బన్ ప్రాంతాల్లో సర్వే చేసి కూటమి గెలుస్తుందని మరికొందరు సెఫాలజిస్ట్‌లు తమకున్న అరకొర వనరులతో, సిబ్బందితో సర్వేలు చేసి జనం మీదకు వదిలారు. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత ఓటరు ఎటువైపు మొగ్గు చూపాడో చెప్పలేని పరిస్థితిలో ఇవే సంస్థలు ఉన్నాయి. కానీ అటు రాజకీయాలకు, ఇటు సర్వే సంస్థలకు ఏమాత్రం సంబంధం లేని సగటు ఓటరు మాత్రం తాను ఓటేసిన పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తాడు. అయితే తన పక్కోడు ఎవరికి ఓటేశాడు, రాష్ట్రంలో మే 13 పోలింగ్ నాటి ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవాలని భావిస్తున్నాడు. కానీ ఈ విషయం చెప్పడం అంత తేలిక కాదు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అధికార పార్టీకి ప్రతిపక్షమో, పోలీసులో, యంత్రాంగమో భయపడటం కామన్. కానీ మొదటిసారి ఈ రాష్ట్రంలో ఓటరు కూడా తాను ఎవరికి ఓటేశానో బహిరంగంగా చెప్పలేని వాతావరణం కనిపిస్తోంది. కేవలం వైకాపాకు ఓటు వెయ్యను, డబ్బులు తీసుకోను అని చెప్పినందుకే మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి తదితర నియోజకవర్గాల్లో ఘర్షణలు, హింస చెలరేగాయి. దాంతో ఇప్పుడు ఓపెన్‌గా నేను ఫలానా పార్టీ ఓటేయను అని చెప్పే పరిస్థితిలో ఓటరు లేడు. కానీ భారీ ఎత్తున ఓటింగ్ జరిగినా ఓటరు సైలెంట్‌గా ఉండటానికి దీంతో పాటు మరికొన్ని కారణాలు ఉన్నాయి. ఏదో ఒక పార్టీ వైపు నిలబడితే పోలింగ్ రోజు ఎవరూ డబ్బులివ్వరు. చివరకు ఏ పార్టీ తరఫున నిలబడ్డాడో ఆ పార్టీ కూడా తన సొంత మనిషి అని డబ్బులివ్వదు. అలా అని డబ్బులు తీసుకోకుండా ఓటేయడానికి ఇటువంటివారు ఇష్టపడరు. తెలంగాణలో ఓటుకు నోటు బాగా పలికిందని ప్రచారం జరగడంతో రూ.వెయ్యి నుంచి రూ.5వేలు వరకు వస్తుందని సగటు ఓటరు ఊహించాడు.
లౌక్యం ప్రదర్శించిన ఓటర్లు
హోరాహోరీగా తలపడుతున్నప్పుడు ఓటేయడానికి వచ్చే పేద, మధ్యతరగతి ఓటరు తాను చేయాల్సిన పని గప్‌చుప్‌గా చేసేయాలనుకుంటాడు. రేపు ఎవరు గెలిచినా, ఓడినా తాను అధికార ప్రభుత్వంలో భాగం కావాలనుకుంటాడే కానీ అనవసర వైరం ఎందుకనే లౌక్యం ప్రదర్శిస్తాడు. మైకు ముందు పెడితే అస్సలు నోరిప్పడు. పల్లెల్లో ఆధిపత్య కులాలు ఒకవైపు, బహుజన మైనార్టీలు మరోవైపు నిలబడినట్లు కనిపిస్తోంది. చదువుకున్నవారు, ఉద్యోగులు, యువత, పట్టణవాసులు ఒకవైపున ఏకపక్షంగా నిలబడగా, నిరక్షరాస్యులు, సామాన్య ప్రజలు, వృద్ధులు ఏమేరకు అధికార పార్టీవైపు ఉన్నారన్న దానిపైనే ఇప్పుడు లెక్కలు చిక్కడంలేదు. జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్టు పెత్తందారులు, పేదలు రెండుగా విడిపోయారా.. అంటే ఇందులో మొదటి సగం వాస్తవం. రెండో సగంలో ఉన్న పేదలు శతశాతం ఓటును ముఖ్యమంత్రి భావించినట్లు వేశారా లేదా అన్నదే ఇప్పుడు పోస్ట్‌పోల్ సర్వేలకు కూడా తెలియడంలేదు. నిజానికి రాష్ట్రంలో రెండు వర్గాలూ కసితో పని చేశాయి. ప్రతిపక్షాన్ని సమర్ధించేవారు మొదట బాగా పని చేశారు. కసితో ఓటేశారు. దూరప్రాంతాల నుంచి, విదేశాల నుంచి సైతం తమవారిని రప్పించి మరీ ఓటేయించారు. ఎందుకంటే.. వారిది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయితే మధ్యాహ్నం నుంచి ఈ కసిని అధికార పార్టీ మద్దతుదారులు అందిపుచ్చుకున్నారు. ఎక్కడ తమ ప్రయోజనాలు ఆగిపోతాయేమోనన్న భయం ఇరువర్గాలను నడిపించింది.
రెండువైపులా భారీ ఓటింగ్
వైకాపా గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతుండటానికి కారణం.. ఎస్సీ, ఎస్టీలు ఉన్నచోట 70 నుంచి 80 శాతం వరకు పోలైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడానికి పట్టణాల్లో పెద్ద ఎత్తున పోల్ జరగడం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ పర్సంటేజ్ నమోదు కావడంగా కనిపిస్తోంది. చాలామంది అనుకున్నట్టు రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ కారణంగానే ఓటింగ్ జరిగిందని చెప్పలేం. ఇది సహజ సమాజ ఎదుగుదలలో భాగంగా కూడా చూడవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా వలంటీర్లు ఎన్నికల రోజున పెద్ద కీలకంగా ఏమీ వ్యవహరించలేదు. వారు చిన్న ఉద్యోగులు. భయపడ్డారు. పరిస్థితులు మారితే తాము బతకలేమనుకున్నారు. మళ్లీ పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులే అంతా నడిపించారు. డబ్బులు పంచడంలో అధికార పక్షంతో పోటీగా ప్రతిపక్షం చాలాచోట్ల పంపిణీ చేయగలిగింది. ఎన్నికల చివరి రోజు కూటమి గెలుస్తుందనే మౌత్‌టాక్ బాగానే పని చేసింది. దీనివల్ల పోటీలో ఉన్న అభ్యర్థులు డబ్బును బీరువాల్లో దాచుకోకుండా ఫీల్డ్‌లో పంచారు.
మహిళలను చీల్చిన మేనిఫెస్టోలు
రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ. అలాగే అర్బన్ ఓటరు కంటే రూరల్ ఓటరు ఎక్కువ. మహిళలందరూ జగన్మోహన్‌రెడ్డికే ఓటేశారా? అనే విషయం ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే.. చంద్రబాబు హామీలు అమలుచేయడంలో విఫలమవుతారని భావించినా పెన్షన్ రూ.4వేలు అవుతుందని, అది కూడా జులైలో ఏప్రిల్ నుంచి వెయ్యి చొప్పున ఎరియర్‌లు కలుపుతూ రూ.7వేలు అందుతుందని ఆశపడిన మహిళలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మహిళా ఓట్లు కూటమి వైపు వెళ్లలేదన్న గ్యారెంటీ ఏమీ లేదు. అన్నింటికీ మించి పోలింగ్ బూత్‌ల వద్ద బారులుతీరిన మహిళల్లో మధ్యతరగతివారు కూడా ఉన్నారు. వీరు అటు పెత్తందార్ల వద్ద పని చేస్తూ, పేదలకు అందే ఏ పథకాలూ దక్కనివారు. వీరంతా బతుకు బండిని బరువుగా ఈడ్చుకొస్తున్న సాధారణ మహిళలు. పక్కింటిలో ఉన్న ఒక తల్లికి అమ్మఒడి అందితే, తన ఇంటిలో ఉన్న బిడ్డను కార్పొరేట్ పాఠశాలలో చేర్చలేక, ప్రభుత్వ పాఠశాలకు పంపలేక సతమతమైన సగటు మహిళలు చాలామంది ఉన్నారు. వీరి ఓటు ఎటు? జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందించిన అమ్మఒడిలో ఇంటికొక బిడ్డకే ఆ పథకం పరిమితం కాగా, కూటమి ఇద్దరి వరకు ఇస్తుందన్న ప్రచారాన్ని బలంగా చేసింది. ఇది కూడా మహిళల మనసుపై బలమైన ముద్రే వేసింది. కాబట్టి మహిళల ఓట్లన్నీ అధికార పార్టీ వైపే వెళ్లాయని ఇప్పుడే చెప్పలేం. జగన్మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో ఈ రెండు అంశాలూ మరింత మెరుగ్గా ఉండుంటే లెక్క మరో విధంగా ఉండేది. జగన్మోహన్‌రెడ్డికి ఉన్న క్రెడిబిలిటీతో పాటు మేనిఫెస్టో కూడా ఆకట్టుకొని ఉంటే ఎన్నికలకు ఏడాది ముందే ప్రకటించిన సూపర్ 6 పథకాలనే మేనిఫెస్టోగా మార్చిన కూటమి ప్రచారం ప్రభావం అంతగా కనిపించి ఉండేది కాదు.
జనసేన ప్రభావం
ఉచిత ఇసుక గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపిందని ప్రాథమిక అంచనా. 2014`19 మధ్యలో నదీ తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ఒక్కో ఇంటికి రెండేసి ట్రాక్టర్లు కొనుక్కొని రెండు చేతులా సంపాదించారు. కానీ 2019`24ల్లో అందులో సగానికి పైగా ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేక అమ్మేశారు. ఈ ప్రభావం కూడా అంతో ఇంతో టీడీపీకి అనుకూలంగా ఉండొచ్చు. 2019లో తామంతా పవన్ అభిమానులం, కానీ జగన్మోహన్‌రెడ్డికి ఓటేస్తామన్న క్యాంపెయినింగ్ వైకాపా సోషల్‌మీడియా బలంగా వాడుకుంది. కానీ 2024 ఎన్నికల నాటికి పవన్‌కల్యాణ్ అభిమానులు కిర్రెక్కిపోయేలా చేసుకున్నది వైకాపా సోషల్‌మీడియానే. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థి నిత్యం నిర్వహించే ప్రచారంలో జనసైనికులే కీలకంగా పని చేశారు. పాలకొండ వంటి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతు ఇవ్వలేమని సీనియర్ కాపు నాయకులు ముఖం చాటేస్తే, ఆ గ్రామాల్లో జనసైనికులే ముందడుగు వేశారు. మహిళా ఓట్లు అధికంగా పోలై వైకాపా తరఫున మహిళా అభ్యర్థి రంగంలో ఉంటే పరిస్థితి ఒకలా కనిపించింది. అలా కాకుండా ఇద్దరూ మహిళలైతే మరోలా ఉంది. పురుష అభ్యర్థిపైన మహిళా అభ్యర్థి పోటీ చేసి అక్కడ మహిళా ఓట్లే ఎక్కువగా పోలైతే గెలుపు ఛాయలు కొంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎగ్జిట్‌పోల్ అంకెల మాదిరిగానే, పోస్ట్ పోల్ అంకెలు రిలీజ్ చేయడానికి పేరొందిన సంస్థలకు గుండెధైర్యం చాలడంలేదు. ఎందుకంటే.. ఈ అంచనాలు వచ్చిన కొద్ది రోజులకే ఫలితాలు వెలువడతాయి. అవి ఏమాత్రం తారుమారైనా సంస్థ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అందుకే పార్టీ సొమ్ములు తిన్న సంస్థలు ఆ పార్టీకి అనుకూలంగా పోస్ట్‌పోల్ సర్వేలు ఇవ్వడం తప్ప జనం నాడిని పోలింగ్ జరిగి దాదాపు వారమవుతున్నా పసిగట్టలేని ఏకైక ఎన్నిక ఇదే.
Comments