top of page

పేరులో ఆజాదీ.. పీవోకేలో లేనిదే అది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 23
  • 2 min read

యుద్ధాలు, దండయాత్రలు చేసి ఇతర దేశాలను ఆక్రమించి తమలో కలిపేసుకోవడం అందరికీ తెలిసిందే. వేల సంవత్సరాల క్రితం రాచరిక వ్యవస్థలు ఉన్నప్పటి నుంచీ జరుగుతున్నదే. చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు ఆధునిక యుద్ధరీతులను చూస్తున్నాం. అయితే ఇతర ప్రాంతాలను, దేశాల్లోకి చొరబడి ఆక్రమించుకోవడంతో ఆగకుండా ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, చివరికి భాషను మార్చేయడం, జనాభా స్వరూపాన్ని మార్చేసి రాజకీయాలను కబ్జా చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగిన దాఖలాల్లేవు. కానీ ఇప్పుడది జరుగుతోంది. ఈ దురాక్రమణను ఒక ప్రాంతం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. ‘మా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోండి’ అని గర్జిస్తున్నది. ఈ పోరాటం ఎక్కడో కాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ఈ స్వాతంత్య్ర పోరాటంతో జ్వలించిపోతున్నది. ఈ పోరాటం కొత్తదేం కాదు. కొన్ని దశాబ్దాలుగా తమ వనరులు దోచేసి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతాన్ని పోషిస్తున్నారని ఆరోపిస్తూ తమ నీరు, వనరులు తమకే చెందాలని డిమాండ్ చేస్తూ పీవోకేలో తరచూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పాక్ పాలకుల అణచివేత చర్యలకు ఉద్యమకారులు బలవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇదే ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంగా రూపు మార్చుకుంటున్నది. ఏకంగా తమ ప్రాంతంలో వనరులు, అధికారాలు తమకు అప్పగించే ఇతరులు బయటకు వెళ్లిపోవాలని ఉద్యమిస్తున్నది. పీవోకేను పాకిస్తాన్ పాలకులు ఆజాద్ కశ్మీర్‌గా బయట ప్రపంచానికి చూపిస్తున్నారు. ఆజాద్ అంటే స్వాతంత్య్రం. కానీ అక్కడ అది మచ్చుకైనా కనిపించదు. పైగా అణచివేత, దోపిడీ విధానాలు రాజ్యమేలుతున్నాయి. ఫలితంగానే స్వేచ్ఛ కోసం పరితపిస్తూ పీవోకే ఉద్యమబాట పడుతున్నది. ఇన్నాళ్లూ ఈ ప్రాంత సహజ వనరులను తరలించి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతాన్ని సంపన్నం చేస్తున్న అక్కడి పాలకులు ఇప్పుడు ఈ ప్రాంతీయుల రాజకీయ అధికారాన్ని కూడా లాక్కుని మెల్లగా భాషా సంస్కృతులను చెరిపేసి మొత్తం పంజాబ్‌గా మార్చేసేందుకు పాకిస్తాన్ సర్కారు కుట్ర పన్నుతున్నదని పీవోకే ఉద్యమకారులు మండిపడుతున్నారు. కొన్నేళ్లుగా పీవోకేలో పంజాబ్ ప్రభావం పెరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. భాష నుంచి రాజకీయాల వరకు, ఉద్యోగాల నుంచి భూముల వరకు, ఎన్నికల నుంచి అధికార వ్యవస్థ వరకు.. అన్నీ క్రమంగా స్థానికుల చేజారిపోతున్నాయని ఉద్యమకారులు చెబుతున్నారు. తాజాగా అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గాను 12 సీట్లను పీవోకేయేతరులకు రిజర్వ్ చేయడం ఉద్యమాన్ని పూర్తిగా మలుపుతిప్పింది. దాంతో పీవోకేలో ఒక కొత్త డిబేట్ మొదలైంది. పాకిస్తాన్ కశ్మీర్‌ను కంట్రోల్ చేస్తోందా లేక క్రమంగా పంజాబ్ మోడల్‌లోకి మార్చేస్తోందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వివాదానికి 1949లోనే బీజం పడిందని చెప్పాలి. భారత్ విభజన తర్వాత కశ్మీర్ విషయంలో యుద్ధాలు, రాజకీయాలు, అంతర్జాతీయ చర్చలు నడుస్తున్న ఆ సమయంలోనే û కరాచీ అగ్రిమెంట్ పేరుతో ఒక కీలక ఇప్పందం కుదిరింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పీవోకే భవిష్యత్తును లాగేసుకున్న ఒప్పందం అదే. దీని ఫలితంగా రక్షణ, విదేశీ వ్యవహారాలు, కశ్మీర్‌కు సంబంధించిన కీలక అధికారాలు.. అన్నీ పాక్ పాలకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అంటే కీలక నిర్ణయాల్లో పీవోకే ప్రమేయం లేకుండా పాకిస్తానీయుల పెత్తనం పెరిగింది. పీవోకేలో కశ్మీరీలే కాకుండా అక్కడ గుజ్జర్లు, రాజపుత్రులు, జాట్లు ఉన్నారు. పహారీ మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి. హింద్కో మాట్లాడే ప్రాంతాలూ ఉన్నాయి. గిల్గిత్`బాల్టిస్తాన్‌లో అయితే మరింత సామాజిక వైవిధ్యం కనిపిస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో పంజాబీకరణ జరుగుతున్నదంటే దానర్థం భాష మారడం కాదు. అధికారాలు, వనరులను ఎవరు తీసుకుంటున్నారన్నదే ముఖ్యం. ఎన్నికల్లో గెలిచిన స్థానిక నాయకులు కాకుండా ఇస్లామాబాద్‌లో కూర్చున్న వ్యవస్థ పీవోకేపై పెత్తనం చెలాయిస్తోంది. ఏళ్లతరబడి ఈ దురాచారం పెరిగిపోతుండటంతో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. పీవోకేకు ప్రత్యేకంగా ప్రధానమంత్రి, అధ్యక్షుడు కూడా ఉన్నారు. సొంత జెండా ఉంది. కానీ సొంత అజెండాకే అవకాశం లేకుండా సర్వాధికారాలను పాక్ పాలకులు హస్తగతం చేసుకున్నారు. స్థానిక ఉద్యమకారుల వాదన ప్రకారం దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చినవారి ప్రభావం పెరిగింది. వారంతా భూములు కొన్నారు. వ్యాపారాలు పెంచుకున్నారు. పరిపాలనలో కీలక స్థానాలు అందుకున్నారు. దీంతో స్థానికులు తమ ప్రాంతంలో తామే పరాయివారిగా మారుతున్నామనే భావనలోకి వెళ్లిపోయారు. ఈ అసంతృప్తి గిల్గిత్`బాల్టిస్తాన్‌లో మరింత తీవ్రంగా ఉంది. అక్కడ మరో అసంతృప్తి కూడా ఉంది. అదే మారుతున్న మత సమీకరణం. చారిత్రకంగా షియా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్రమంగా పరిస్థితులు మారిపోయాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వలసలు పెరిగి కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. మత ఘర్షణలు కూడా పెరిగాయి. దీంతో స్థానిక గుర్తింపు క్రమంగా బలహీనపడుతోందనే వాదనలు పుంజుకున్నాయి. 2025 పరిణామాల తర్వాత ఇది మరింత పెరిగింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. మొదట ప్రజలు విద్యుత్ బిల్లుల గురించి మాట్లాడారు. వనరుల దోపిడీని వ్యతిరేకించారు. కానీ కొద్దిరోజుల్లోనే అసలు కోపం బయటకు వచ్చింది. మా ప్రాంత నిర్ణయాలు మేమే తీసుకుంటామని నినదించడం మొదలుపెట్టారు. బయటివారి ప్రభావాన్ని అంగీకరించబోమన్నారు. ఆ క్రమంలోనే పంజాబీకరణ అనే పదం వార్తల్లోకి వచ్చింది. పీవోకే అసంతృప్తికి అదో పేరుగా మారింది. ఇది పాక్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page