top of page

ప్రైవేటీకరణ షురూ!

Writer: ADMINADMIN

Updated: Aug 8, 2024

  • ` పాతబస్తీలో కరెంటు బిల్లు అదానీ వసూలు!

  • ` సొంత పార్టీకే షాకిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌

  • ` పంపిణీతో పాటు పైసా వసూల్‌ కూడా అదానీ : టీ`సీఎం

  • ` శిష్యుడు పొలంలో మేస్తుంటే గురువు గట్టున మేస్తాడా అన్న భయంలో ఏపీ

(డి.వి. మణిజ)

కొందరు ముఖ్యమంత్రులు ఎన్నికల్లో చెప్పిందే సరిగా చెయ్యడం లేదు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికల్లో చెప్పనవి కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలతో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులే తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులను కాంగ్రెస్‌లోకి ఎడాపెడా తీసుకోవడం కొందరికి మింగుడు పడడం లేదు. ఇటీవల ఒక సమావేశంలో రేవంత్‌ రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితి గురించి ఆడిన మాటలు కూడా దుమారం రేపుతున్నాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం అతి త్వరలో పాతబస్తీలో కరెంటు పంపిణీతో పాటు బిల్లుల వసూళ్లు కూడా అదానీ గ్రూపు చేపడుతుందని బాంబు పేల్చారు. అలా వసూలైన బిల్లు మొత్తంలో 75 శాతం ప్రభుత్వానికి ఆదాయంగా లభిస్తుందని చెప్పారు. అంటే పాతిక శాతం అదానీ జేబులోకి పోతుందని చెప్పకనే చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమించి, పోరాడి విద్యుత్‌ రంగంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు సాధించుకున్న ఫలాలను చిదిమి పారేయడానికి రేవంత్‌ సిద్ధపడ్డారు.

విద్యుత్‌ తయారీ, పంపిణీ, కొనుగోళ్లు, డిస్కం ఏర్పాటు తదితర విషయాల్లో తెలంగాణ రాష్ట్రం అదానీతో ఎటువంటి ఒప్పందమూ చేసుకోలేదు. మరి అలాంటప్పుడు రేవంత్‌ బిల్లుల వసూళ్లకు అదానీని ఎందుకు పిలుస్తున్నట్టు? అందరిలోనూ ఇదే పజిల్‌. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా ఈ విషయమై పెద్దగా చర్చ జరిగినట్టు లేదు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులను ఎవరిని కదిపినా పెదవి విరుస్తున్నారే తప్ప దీని గురించి ఏమీ మాట్లాడడం లేదు. విద్యుత్‌ రంగంలో ప్రైవేటీకరణకు తెర తీస్తారా, లేదంటే మరేదైనా రంగంలో అదానీకి భవిష్యత్తు ఒప్పందం కుదరబోతుందా అన్నది తేలాలి. విద్యుత్‌ కంపెనీల ప్రైవేటీకరణ డిస్కంల ప్రైవేటీకరణతో ఆరంభమవుతోందని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ధ్వజమెత్తింది. ఒకవైపు దేశ ప్రధాని అదానీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారని రాహుల్‌ గాంధీ పార్లమెంటులో ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే రేవంత్‌ చేస్తున్న ప్రకటనలు విడ్డూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ అదానీ గ్రూపు బిల్లులు వసూలు చేయడం నిజమైతే, అదే విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణకు తొలి అడుగని తీవ్రంగా విమర్శిస్తోంది.

విమర్శలను పట్టించుకుంటే ప్రభుత్వాలే కావు!

ఇంతవరకూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యుత్‌ బిల్లుల వసూళ్లు ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పిన దాఖలాలు లేవు. దీనిలోని నిజానిజాల గురించి తెలుసుకోవడానికి సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ సిఎండి ముషారఫ్‌ అలీ ఫరూకీని, తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌లను సంప్రదించినపుడు అదానీ బిల్లుల వసూళ్ల విషయమై తమకు ఇంకా ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు రాలేదని చెప్పారు. ఎప్పటిలాగే ప్రస్తుతానికి పాతబస్తీ ప్రాంతంలో తామే విద్యుత్‌ పంపిణీ చేస్తున్నామని, బిల్లులు వసూలు చేస్తున్నామని అన్నారు.

కాని, ప్రైవేటీకరణ భయం మాత్రం వెన్నాడుతోంది. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన వారం రోజుల తర్వాత అంటే జులై 7న పాతబస్తీ ప్రాంతంలోని మీర్‌ అలం డివిజన్‌లో స్థానికులు విద్యుత్‌ మీటర్లు పరిశీలించడానికి వచ్చిన విద్యుత్‌ ఉద్యోగులను అడ్డుకున్నారు. దాంతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. వారంతా తెల్లదుస్తుల యూనిఫాం ధరించడం తమకు అనుమానం కలిగించిందని స్థానికులు తెలిపారు. చార్మినార్‌ ప్రాంత ఎలక్ట్రికల్‌ ఏఈ టి.లింగయ్య వెంటనే తమ సిబ్బందే ఆ ప్రాంతంలో తిరిగారని, వేరే ఎవ్వరూ రాలేదనే ప్రకటన విడుదల చేసారు. దీనికి పూర్తి భిన్నంగా జులై 12న విద్యుత్‌ ఉద్యోగుల యునైటడ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించవద్దంటూ తమ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఇవన్నీ ప్రజలలో అనేక అనుమానాలు రేపుతున్నాయి.

ఇందులో రెండు విషయాలున్నాయి. ఇంతవరకూ అదానీ గ్రూపు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ నుంచి విద్యుత్‌ పంపిణీ కోసం ఎలాంటి లైసెన్సుకూ దరఖాస్తు చేయలేదు. తెలంగాణలో పాతబస్తీ ప్రాంతంలో విద్యుత్‌ బిల్లుల బకాయిలు సరిగా వసూలు కావడం లేదు. ఇక్కడ బిల్లుల వసూళ్లు సక్రమంగా జరగాలని డిసెంబర్‌ 2023లో శాసనసభ్యుల సమావేశంలో గట్టిగా చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బీపీఎల్‌ కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీనిచ్చింది. ప్రైవేటీకరణ వల్ల ఈ హామీ ఏమవుతుందోనని కొందరి బెంగ. కాగా పాతబస్తీ విద్యుత్‌ బిల్లుల మొండి బకాయిల గురించి మాట్లాడడం ప్రజల దృష్టి మళ్లించడానికేనని మరికొందరు విమర్శిస్తున్నారు. అక్కడ రావాలసిన బకాయి 500 కోట్ల రూపాయలు కాగా, వ్యవసాయ పంపు సెట్లకు ప్రభుత్వం 12వేల కోట్లు ఖర్చు పెడుతోందని వారంటున్నారు.

ధరల పెంపు వారి ఇష్టానుసారమే

తెలంగాణ ఏర్పాటైన తర్వాత పదేళ్లు పాలించిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అదానీ గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. దానికి కారణం అదానీ బీజేపీతో అంటకాగుతున్నారని కేసీఆర్‌కు మంట. దీనికి భిన్నంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే సీఎం రేవంత్‌ వరల్డ్‌ ఎకానిమిక్‌ ఫోరం సదస్సుకు దావోస్‌ వెళ్లినపుడు అదానీ గ్రూపుతో నాలుగు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఆ సందర్భంగా గౌతం అదానీ మాట్లాడుతూ అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ కనెక్స్‌ డేటా, అంబుజా సిమెంట్స్‌, అదానీ ఏరోస్పేస్‌ విభాగాలలో 12,400 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడులుగా పెట్టనున్నట్టు వివరించారు. దానికి తగిన వాతావరణం, వసతులు కల్పిస్తామని, పరిశ్రమల విస్తరణకు తమ పూర్తి మద్దతు అందిస్తామని సీఎం హామీనిచ్చారు.

ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ దీని గురించి మాట్లాడుతూ విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణ వినియోగదారులకు గొడ్డలిపెట్టు లాంటిదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తును ప్రజలకు సబ్సిడీ ధరలకు అందిస్తాయని, ఆ ప్రకటించిన సబ్సిడీ ఆధారంగా విద్యుత్‌ బిల్లులు నిర్ధారిస్తారని తెలిపారు. అదే ప్రైవేట్‌ కంపెనీ సబ్సిడీల గురించి పట్టించుకోదని, ప్రభుత్వం అందించే రాయితీలను నేరుగా వినియోగదారుల ఖాతాలకు చేరవేయమని కోరుతుందని వివరించారు. ప్రైవేటు సంస్థ ఖర్చులు, పొందాల్సిన లాభాలు లెక్కించుకుని ధరను నిర్ణయించి, వినియోగదారుల నుంచి ముక్కుపిండి రుసుము వసూలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసారు. ఉమ్మడి ఆంధ్రపద్రేశ్‌ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించాలని ప్రయత్నించినపుడు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారని గుర్తు చేసారు. ఈ నిరసన ఉద్యమం బషీర్‌బాగ్‌లో కాల్పుల వరకూ వెళ్లిందని, కేవలం ఈ ఆందోళన వల్లనే అప్పటి ప్రభుత్వం మారిందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలలో రేగిన గుబులు

బీహార్‌లో గయ, సమస్తిపూర్‌, భగల్పూర్‌ పట్టణాల్లో, ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌ నగరంలో, మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌, సాగర్‌, ఉజ్జయిని సిటీలలో, మహారాష్ట్రలో ఔరంగాబాద్‌, జలగావ్‌ పట్టణాలలో, జార్ఖండ్‌లో రాంచీ, జంషెడ్‌పూర్‌ నగరాల్లో ఇదివరలో విద్యుత్‌ పంపిణీని ప్రైవేటీకరించాలని తలపెట్టినప్పుడు రెగ్యులేటరీ కమిషన్లు బలవంతంగా వాటి అనుమతులను రద్దు చేయవలసి వచ్చింది. దానికి ముఖ్య కారణాలుగా విద్యుత్‌ ధర అమాంతం పెంచేయడం, వినియోగదారులు బిల్లులు చెల్లించలేనపుడు కనెక్షన్లు రద్దు చేసి, విద్యుత్‌ పంపిణీలో తీవ్ర అసౌకర్యానికి గురి చేయడంగా చెప్తున్నారు. తెలంగాణలో విద్యుత్‌ పంపిణీ ప్రైవేటీకరణ వార్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. శిష్యుడి కంటే గురువు ఎల్లవేళలా ప్రైవేటీకరణకు మరింత సిద్ధంగా ఉంటారని అందరికీ తెలిసిందే. అందులోనూ ఈ ఏడాది రాజధాని నిర్మాణానికి వరల్డ్‌ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాలను ఇప్పిస్తామని దేశ ఆర్థిక మంత్రి పార్లమెంటు బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించినప్పటి నుంచి ప్రజల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ప్రపంచ బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి మరెన్ని ప్రైవేటు ఒప్పందాలు ఈ రాష్ట్రానికి మన ఏలికలు తీసుకు రానున్నారని ఆందోళన చెందుతున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page