‘ప్రైవేటు’ సర్వేకు ప్రభుత్వ రోవర్లు
- BAGADI NARAYANARAO

- Apr 20
- 2 min read
సర్వే అండ్ ల్యాండ్స్ లో 6 రోవర్లు మాయం
రాష్ట్రవ్యాప్తంగా కనిపించకుండాపోయినవి 52
జీపీఎస్ తప్పించేసి వ్యాపారం చేసుకుంటున్న సర్వేయర్లు
రికవరీకి సిద్ధపడుతున్న ప్రభుత్వం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో భూముల రీసర్వే కోసం ప్రభుత్వం పంపిన రోవర్లలో ఆరు కనపడకుండాపోయాయి. ఒక్కోదాని విలువ రూ.6 లక్షలు ఉంటుంది. రీసర్వేలో రోవర్లే కీలక భూమిక పోషిస్తాయి. అటువంటివి కనపడకుండాపోవడంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎందుకంటే.. ఇది ఒక్క శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయాల్లో కనపడకుండాపోయాయి. ఇందుకు సంబంధించి సంబంధిత సర్వేయర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జీతాల నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీ`సర్వే కోసం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖకు 2023లో అప్పటి ప్రభుత్వం అందించిన రోవర్ సెట్లలో రాష్ట్రవ్యాప్తంగా 52 కనిపించకుండా పోయినట్టు గుర్తించింది. రోవర్ సెట్‌లో ఉండే రోవర్ రిసీవర్, కంట్రోలర్, పోల్, బ్యాటరీస్, ఛార్జర్ బాక్స్‌తో సహా కనిపించకుండా పోయాయి. జిల్లాలో ఎవరెవరి పరిధిలో రోవర్లు మిస్ అయ్యాయో రికార్డులను పరిశీలించిన అనంతరం ఆ శాఖ ఏడీ ఈ నెల 15న జిల్లాలోని ఆరు మండý, గ్రామ సర్వేయర్లకు నోటీసులు ఇచ్చి, వారికి అప్పగించిన రోవర్లపై శాఖ జిల్లా అధికారికి నేరుగా వివరణ ఇవ్వాలని మెమో జారీ చేశారు. మెమోలు అందుకున్నవారిలో ఆమదాలవలస మండల సర్వేయర్ బి.గోవిందరావు, గ్రామసర్వేయర్ కె.మోహన్‌దాస్, ఎలఎన్‌పేటలో మండల సర్వేయర్ ఆర్.గవరయ్యలు ఉన్నారు. పొందూరు మండలంలో సర్వేయర్ బి.గోవిందరావు, గ్రామ సర్వేయర్ విజయ్ కుమార్‌కు, టెక్కలిలో టౌన్ సర్వేయర్ పీవీఎస్ సూర్యనారాయణ, మందసలో మండల సర్వేయర్ కె.మోహనరావు, సరుబుజ్జిలిలో మండల సర్వేయర్ పీవీవీఎస్ శివరాంమూర్తి, గ్రామ సర్వేయర్ రోహిణికి మెమోలు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రోవర్లు మిస్సింగ్ చేసిన వారికి నోటీసులు జారీచేసి వారి వివరణ తీసుకున్న తర్వాత క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జిల్లాలో మాత్రం వివరణ కోరడానికే నెల రోజులు సమయం తీసుకున్నారు.
శాఖలో అందరూ కలిసి
జిల్లాలో రోవర్లు 2023 నాటికే ఆరు మిస్సింగ్ అయినట్టు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ ఎవరినీ బాధ్యులుగా చేయలేదు. మిస్సింగ్ అయిన రోవర్లపై ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించడం మినహా వాటిని గుర్తించడానికి ప్రయత్నాలు చేయలేదు. మూడేళ్ల తర్వాత వాటి రికవరీ కోసం ప్రయత్నాలు చేయడంపై సర్వేయర్లలో చర్చ సాగుతుంది. సర్వే అండ్ ల్యాంగ్ రికార్డ్స్ ఏడీగా ప్రభాకరరావు దీర్ఘకాలంగా విధులు నిర్వహించారు. ఆయన తర్వాత విజయ్‌కుమార్ ఏడీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆరు రోవర్లు మిస్సింగ్ అయినట్టు ఆ శాఖలో చర్చ సాగుతుంది. రోవర్లు మిస్సింగ్ వెనుక జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల హస్తం ఉందని చర్చ సాగుతుంది. వీటితో పాటు ప్రభుత్వ రీసర్వే కోసం సరఫరా చేసిన ల్యాప్‌టాప్‌లు కూడా కనిపించడం లేదని భోగట్టా. వీటిపై అధికారులు పెద్దగా దష్టి సారించలేదు. ల్యాప్‌టాప్‌లపై ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. దీనిపై ఆ శాఖ అధికారులు మరమ్మతులకు గురైనట్టు చూపించి వాటిని పట్టుకుపోయారనే ఆరోపణలున్నాయి. కానీ రోవర్ల విషయంలో అలా జరగడానికి అవకాశం లేదు. రోవర్లు రిపేర్ చేయడానికి సంuంధిత సంస్థకు చెందిన ఇంజినీర్లు అందుబాటులో ఉంటారు. ప్రతి రోవర్‌కు జీపీఎస్ అమర్చి ఉంటుంది. దీన్ని అధికారులు ట్రాక్ చేసే అవకాశం ఉంది. అయితే రోవర్లను దాచిపెట్టిన సర్వేయర్లు ఒరిజినల్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను తప్పించినట్టు తెలిసింది. దీంతో రోవర్‌ను ట్రాకింగ్ చేసే అవకాశం లేకుండా పోయిందని చర్చ నడుస్తుంది. రోవర్ సెట్ మొత్తాన్ని సర్వేయర్లే ఉద్దేశపూర్వకంగా మిస్సింగ్ చేసి కనిపించకుండా చేశారని సర్వేయర్లే విమర్శిస్తున్నారు.
ప్రైవేట్ భూముల సర్వే..
రీసర్వే కోసం రోవర్లను గ్రామ సర్వేయర్లు మాత్రమే పూర్తిస్థాయిలో వినియోగించే పరిజ్ఞానం కలిగివున్నట్టు అధికారులు చెబుతున్నారు. మండల సర్వేయర్లలో కొందరికి మాత్రమే ఏవిధంగా వినియోగించాలన్న పరిజ్ఞానం కలిగివున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రైవేట్ భూములను సర్వే చేయడానికి రోవర్‌ను వినియోగిస్తే రోజుకు రూ.10 వేలు అద్దె రూపంలో తీసుకుంటున్నారు. గ్రామ సర్వేయర్లు సెలవు రోజుల్లో ప్రభుత్వం సరఫరా చేసిన రోవర్లను పట్టుకొని ప్రైవేట్ భూములు సర్వే చేయడానికి వెళుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. రోవర్‌ను తీసుకొని సర్వే చేయడానికి వెళితే రోజుకు రూ.15వేలు చెల్లిస్తారని సర్వేయర్లే చెబుతున్నారు. దీంతో కొందరు మండల సర్వేయర్లు గ్రామ సర్వేయర్లతో కలిసి ప్రభుత్వం సరఫరా చేసిన రోవర్లను సొంత అవసరాలకు దాచిపెట్టి కనిపించకుండా పోయాయని రికార్డుల్లో చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 85 రోవర్లు అందుబాటులో ఉన్నాయి. మరో ఆరు రోవర్లు కనిపించడం లేదు.






Comments