top of page

పేరు సన్యాసి.. తీరు సన్నాసి!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • May 29
  • 2 min read
  • మహిళా ఉద్యోగులను వేధిస్తున్న ఉద్యోగి

  • స్థాన, రాజకీయ బలంతో అరాచకాలు

  • ఫిర్యాదులు అందినా మొక్కుబడి చర్యలు

  • తాజా ఫిర్యాదుతో వెలుగులోకి నిర్వాకాలు


అతగాడి పేరు సన్యాసిరావు.. కానీ చేసేవన్నీ సన్నాసి పనులే. గత పన్నెండేళ్లుగా పొందూరు తహసీల్దారు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా తిష్ట వేసిన ఈ సన్యాసికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అతని చేష్టలకు ఎదురుచెప్పేవారు లేకుండాపోయారు. దానికితోడు స్థానికుడు కావడంతో అతని జోలికి వెళ్లడానికి కూడా తోటి ఉద్యోగులు జంకుతారు. ఇదే అదనుగా ఈ సన్యాసి రెచ్చిపోతున్నాడు. ఎట్టకేలకు ఒక మహిళా ఉద్యోగి ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో సదరు సన్యాసి అకృత్యాలు బయటపడుతున్నాయి.

ఎవరూ పనిచేయలేని చోట..

జిల్లాలో పొందూరు తహసీల్దార్‌ కార్యాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరూ ఎక్కవ కాలం పనిచేయలేరు. ఇక్కడ పని చేయడం పనిష్మెంట్‌గా భావిస్తుంటారు. లిటిగేషన్లు, వివాదాలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. అందువల్లే ఎక్కువగా ఇన్‌ఛార్జీలు, ఎఫ్‌ఏసీ అధికారులతో నెట్టుకొస్తుంటారు. కానీ సన్యాసిరావు మాత్రం బదిలీ లేకుండా 12 ఏళ్లగా పొందూరులోనే పని చేస్తున్నాడు. అతగాడి నిర్వాకాలన్నీ అక్కడ తహసీల్దార్లుగా పని చేసిన వారందరకీ తెలుసు. కానీ ఎవరూ ఇంతవరకు ఆయన్ను టచ్‌ చేసేందుకు సాహసించలేదు. మహిళా ఉద్యోగులు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు గతంలోనూ సన్యాసిరావుపై ఆరోపణలు వచ్చాయి. అయితే తహసీల్దారు స్థాయిలోనే అతడిని మందలించి విడిచిపెట్టేసేవారు. అయినా సన్యాసిరావు వక్రబుద్ధి మారలేదు. పాత పద్ధతిలోనే బుధవారం టాయిలెట్‌కు వెళ్లిన ఓ మహిళా ఉద్యోగిని వీడియో తీస్తూ దొరికిపోయాడు. ఇలా చేయడం సన్యాసిరావుకు ఇదే మొదటిసారి కాదని తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో కొందరు ఉద్యోగులు అతనిపై ఫిర్యాదు చేసినా కొందరు తహసీల్దార్లు లైట్‌గా తీసుకుంటే, మరికొందరు మొక్కుబడిగా మందలించి విడిచిపెట్టేసేవారని అంటున్నారు. దానికితోడు స్థానికుడైన సన్యాసిరావు.. తన స్థానబలాన్ని చూపించి బెదిరింపులకు పాల్పడుతుండటంతో అతగాడి జోలికి వెళ్లే సాహసం ఎవరూ చేయలేకపోయారు.

పోలీసులకు ఫిర్యాదు

తాజా ఘటనలో బాధితురాలైన మహిళా ఉద్యోగి సన్యాసిరావుపై ఎదురు తిరిగి ఆ వీడియోను అతని ఫోనులో నుంచి డిలీట్‌ చేయించినట్టు తెలిసింది. అక్కడితో ఆగకుండా తహసీల్దారుకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యుల మద్దతుతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి సన్యాసిరావు నుంచి ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో సన్యాసిరావు వికృత చేష్టలకు బలైనవారు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా సన్యాసిరావును ఈ కేసు నుంచి బయట పడేసేందుకు రాజకీయంగా ప్రయత్నాలు మొదలైనట్లు రెవెన్యూ శాఖలో చర్చ జరుగుతోంది. నాలుగేళ్ల క్రితం డీఎస్‌వో కార్యాలయంలో ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ అక్రమాలకు, వికృత చేష్టలకు పాల్పడిన ఉదంతాన్ని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు విచారణ జరిపి సదరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని తొలగించారు. సన్యాసిరావుపైనా ఇదే తరహాలో చర్యలు తీసుకోవాలని బాధిత మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. మరోవైపు బాధిత ఉద్యోగిని చేసిన ఫిర్యాదుపై వెంటనే విచారించిన పొందూరు తహసీల్దార్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి సన్యాసిరావును కలెక్టరేట్‌కు సరెండర్‌ చేశారు. అయితే ఆయనకు రాజకీయ నాయకుల అండ ఉన్నందున వేరేచోటకు బదిలీతో సరిపెట్టేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇటువంటి కామపిశాచులు పౌరసరఫరాల సంస్థ, శాఖలోనూ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆ రెండు శాఖల్లోనే..

జిల్లాలో తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల్లో 71 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. వీరంతా రెవెన్యూ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు పౌరసరఫరాల శాఖ, సంస్థ పరిధిలో మరికొందరు ఉన్నారు. వీరిందరినీ 2012లో విధుల్లోకి తీసుకున్నారు. అలాగే జిల్లాలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. అయితే రెవెన్యూ, పౌరసరఫరా శాఖలు తప్ప మిగిలిన శాఖల్లోని కంప్యూటర్‌ ఆపరేటర్లకు నేరుగా పౌరులకు సేవలు అందించే పరిస్థితి లేదు. అందుకే రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్లకు మూడేళ్లకోసారి స్థానచలనం కలిగిస్తున్నారు. కానీ పౌర సరఫరాల సంస్థ, శాఖలో మాత్రం ఏళ్లతరబడి కంప్యూటర్‌ ఆపరేటర్లకు బదిలీల్లేవు. రెవెన్యూ శాఖలో ఒకరో, ఇద్దరో చేస్తున్న అరాచకాలకు మొత్తం కంప్యూటర్‌ ఆపరేటర్లందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. పొందూరు తహసీల్దారు కార్యాలయంలో మహిళలను చాటుగా ఫోటోలు, వీడియోలు తీసి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సువ్వారి సన్యాసిరావు 2012 నుంచి అక్కడే కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మధ్యలో సమీపంలోని సంతకవిటికి బదిలీపై వెళ్లినా ఏడాదిలోనే తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి పొందూరులోనే తిష్ట వేసి అరాచకాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page